Share News

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ‘వర్క్‌ ఫ్రమ్‌ హోం’!

ABN , Publish Date - May 14 , 2026 | 05:34 AM

‘వర్క్‌ ఫ్రమ్‌ హోం’.. కరోనా మహమ్మారి నివారణ చర్యల్లో భాగంగా తొలిసారి తెరపైకి వచ్చింది! ఉద్యోగులు ఆఫీసుకు వెళ్లకుండా ఇంటి నుంచే పనిచేసే విధానమిది! ఆ మాట ఇప్పుడు మరోసారి వినిపిస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ‘వర్క్‌ ఫ్రమ్‌ హోం’!

  • తప్పనిసరిగా హాజరవ్వాల్సిన సిబ్బంది మినహా మిగిలిన అందరికీ వర్తింపు

  • హైబ్రిడ్‌ విధానమూ పరిశీలన.. టెలీ, వీడియో కాన్ఫరెన్స్‌లకు ప్రాధాన్యం

  • నేడు క్యాబినెట్‌ భేటీలో చర్చ.. రెండు రోజుల్లో విధాన ప్రకటన

  • సీఎం చంద్రబాబు కాన్వాయ్‌ కుదింపు.. వాహనాల సంఖ్య 50ు తగ్గింపు

  • అదేబాటలో డిప్యూటీ సీఎం పవన్‌.. మంత్రులు, అధికారులకూ సీఎం ఆదేశం

  • ప్రధాని సూచనలు పాటిద్దామని ముఖ్యమంత్రి పిలుపు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

‘వర్క్‌ ఫ్రమ్‌ హోం’.. కరోనా మహమ్మారి నివారణ చర్యల్లో భాగంగా తొలిసారి తెరపైకి వచ్చింది! ఉద్యోగులు ఆఫీసుకు వెళ్లకుండా ఇంటి నుంచే పనిచేసే విధానమిది! ఆ మాట ఇప్పుడు మరోసారి వినిపిస్తోంది. నాడు కరోనా నివారణకు ఐటీ, ప్రైవేటు కంపెనీలు అమలు చేయగా... ఇప్పుడు పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఇంధన సంక్షోభం నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. డీజిల్‌, పెట్రోల్‌ వినియోగం తగ్గించేందుకు వర్క్‌ ఫ్రమ్‌ హోంతో పాటు హైబ్రిడ్‌ విధానం అమలు దిశగా అడుగులు వేస్తోంది. టెలీ, వీడియో కాన్ఫరెన్స్‌లకూ ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోంది. డీజిల్‌, పెట్రోల్‌ వినియోగం తగ్గిద్దామని ప్రజలకు సీఎం చంద్రబాబు పిలుపునివ్వడంతో పాటు స్వయంగా ఆచరణాత్మక నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోదీ తన కాన్వాయ్‌లోని వాహనాలను తగ్గించగా.. సీఎం చంద్రబాబు సైతం తన కాన్వాయ్‌ను సగానికి కుదిస్తున్నట్టు ప్రకటించారు. అంతేగాక మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు వాహనాలను సగానికి తగ్గించాలని ఆదేశించారు.

ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా వర్క్‌ ఫ్రమ్‌ హోంను ప్రోత్సహించాలని, ప్రభుత్వ ఉద్యోగులకూ వర్తించే పరిస్థితులు వస్తాయని సీఎం అన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోంను అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. దీనిపై మార్గదర్శకాలను రూపొందించాల్సి ఉందని చెబుతున్నారు. తప్పనిసరిగా భౌతికంగా కార్యాలయాలకు రావాల్సిన ఉద్యోగులు.. ఇంటి నుంచి కూడా పనిచేసేందుకు వీలున్న ఉద్యోగులు ఎవరెవరన్నది విభజించాల్సి ఉందని అంటున్నారు. వీలున్న వారికి వర్క్‌ ఫ్రమ్‌ హోం అమలు చేయడంతో పాటు ఒకరోజు ఇంటి నుంచి, మరో రోజు ఆఫీసుకు వచ్చి పని చేసేలా హైబ్రిడ్‌ విధానాన్నీ ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు. టెలీ కాన్ఫరెన్స్‌, వీడియో కాన్ఫరెన్స్‌లకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడం వల్ల అధికారులు కార్యాలయాలకు రావాల్సిన అవసరం ఉండదని, దీంతో ఇంధన వినియోగం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. గురువారం జరిగే క్యాబినెట్‌ భేటీలో పొదుపు అంశాలు, వర్క్‌ ఫ్రమ్‌ హోంపై చర్చించిన తర్వాత ఒకటి, రెండు రోజుల్లో ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం ప్రకటించే అవకాశముందని అధికారులు తెలిపారు.


నేడు క్యాబినెట్‌ సమావేశం

రాష్ట్ర మంత్రిమండలి సమావేశం గురువారం ఉదయం సచివాలయంలో జరగనుంది. ఇంధన పొదుపు చర్యలపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. 17వ ఎస్‌ఐపీబీ ఆమోదించిన పలు అంశాలతో పాటు మొత్తం 25 ప్రాజెక్టులకు సంబంధించిన రూ.2లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపనున్నారు.

ఇక సీఎం కాన్వాయ్‌ సగమే

పెట్రోల్‌, డీజిల్‌ ఉత్పత్తుల వాడకం తగ్గించాలన్న ప్రధాని మోదీ సూచన మేరకు సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కాన్వాయ్‌లోని వాహనాలను కుదించాలని ఆదేశించారు. జిల్లా పర్యటనల్లో కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను 50 శాతం తగ్గించాలని సూచించారు. డీజీపీ, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌తో జరిగిన భేటీలో ఈ విషయం స్పష్టం చేశారు. మంత్రులు, ఇతర వీఐపీలు సైతం సాధ్యమైనంత తక్కువ వాహనాలు వినియోగించేలా చూడాలని ఆదేశించారు. 50 శాతం వాహనాల తగ్గింపును అన్ని స్థాయిల్లోనూ అమలయ్యేలా చూడాలన్నారు. దేశ ప్రయోజనాల విషయంలో ప్రతి ఒక్కరూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సీఎం కోరారు. మరిన్ని కీలక విధాన నిర్ణయాలు గురువారం క్యాబినెట్‌లో చర్చించి ప్రకటించనున్నట్లు తెలిపారు.

పవన్‌ కాన్వాయ్‌లోనూ కుదింపు

ప్రధాని మోదీ పిలుపునకు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. తన కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను 50 శాతం తగ్గించాలని ఆదేశాలిచ్చారు. జిల్లా పర్యటనల్లోనూ కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను సగానికి కుదించాలని నిర్ణయించారు.

పొదుపుతోనే ఆర్థిక స్థిరత్వం: సీఎం

పొదుపు మంత్రంతోనే ఆర్థిక స్థిరత్వం సాధించగలమని సీఎం చంద్రబాబు అన్నారు. పెట్రోలు, డీజిల్‌ వినియోగం తగ్గించాలని పిలుపునిచ్చారు. దీనివల్ల విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుందన్నారు. గుంటూరు జిల్లా నిడమర్రులో బుధవారం జరిగిన బొల్లినేని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్కిల్‌, ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(బైసర్‌) శంకుస్థాపన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ప్రధాని ప్రకటించిన 8 పొదుపు అంశాలను ప్రతి ఒక్కరూ పాటించాలని పిలుపునిచ్చారు. ఒకటి, రెండు రోజుల్లో దీనిపై కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ప్రభుత్వాలతో పాటు పౌరులు కూడా బాధ్యతగా ఉండి తాత్కాలికంగా వచ్చే ఇబ్బందులను అధిగమించాలని సూచించారు. ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అనేది రియాలిటీ. ఇంటి నుంచే ప్రపంచం మొత్తం పనిచేసే పరిస్థితి వస్తుంది. దీనిని ప్రోత్సహించాలి. ప్రభుత్వంలో ఈ విధానాన్ని అమలు చేసే పరిస్థితులు వస్తాయి’ అన్నారు. విదేశీ పర్యటనలు తగ్గించుకోవాలన్న ప్రధాని సూచనపై ప్రజలందరూ ఆలోచించాలని కోరారు. దేశంలో, రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, ప్రజలు స్వదేశంలో పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. రాష్ట్రంలో అరకు, పాపికొండలు, గండికోట వంటి ప్రదేశాలు ఉన్నాయని తెలిపారు. గోవాను మించిన టూరిజం కేంద్రంగా సూర్యలంక మారుతుందన్నారు. ‘నా దేశం నా బాధ్యత’ అనే ఆలోచన ప్రజలంతా చేయాలని సీఎం సూచించారు. బంగారం కొనడాన్ని కూడా తగ్గించాలని ప్రధాని సూచించారని, దాన్ని కూడా ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు.

Updated Date - May 14 , 2026 | 05:34 AM