Share News

ఆంధ్ర.. ‘కూల్‌’ క్యాపిటల్‌!

ABN , Publish Date - May 07 , 2026 | 04:33 AM

ఇండియాస్‌ కూల్‌ క్యాపిటల్‌గా ఆంధ్రప్రదేశ్‌ ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తొమ్మిది ప్రముఖ ఏసీ తయారీ సంస్థలతో వచ్చే ఏడాదికి దేశంలోనే ఏసీల ఉత్పత్తిలో...

ఆంధ్ర.. ‘కూల్‌’ క్యాపిటల్‌!

  • రెండేళ్లలో 80 శాతం ఏసీ ఉత్పత్తులు ఇక్కడి నుంచే: లోకేశ్‌

  • ఫార్మా రంగంలో మన దేశం ఏవిధంగా అగ్రగామిగా మారిందో.. డేటా సెంటర్‌ పరికరాల తయారీలో కూడా ప్రపంచ నాయకత్వాన్ని సాధించగలదు. వీటి తయారీ రంగం భారతదేశ తదుపరి ఫార్మా రంగం కావచ్చు.

  • ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకున్నాం. మన యువతకు నైపుణ్యం, ఉపాధి కల్పన కోసం నైపుణ్యం పోర్టల్‌ను తీసుకొస్తున్నాం. దీనిద్వారా పరిశ్రమలకు అవసరమైన శిక్షణ అందిస్తాం.

- మంత్రి లోకేశ్‌

  • మా ఫస్ట్‌ ఏసీ.. క్యారియర్‌ కంపెనీదే

  • శ్రీసిటీలో ‘క్యారియర్‌’కు శంకుస్థాపన

తిరుపతి సిటీ, మే 6 (ఆంధ్రజ్యోతి): ‘ఇండియాస్‌ కూల్‌ క్యాపిటల్‌గా ఆంధ్రప్రదేశ్‌ ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తొమ్మిది ప్రముఖ ఏసీ తయారీ సంస్థలతో వచ్చే ఏడాదికి దేశంలోనే ఏసీల ఉత్పత్తిలో 60 శాతం రాష్ట్రం నుంచే జరుగుతుంది. 2028 నాటికి ఇది 80 శాతానికి చేరుతుంది. ఇది వృద్ధి మాత్రమే కాదు.. గ్లోబల్‌ పోటీ సామర్థ్యం. మనందరం కలిస్తే ఇది వంద శాతానికి చేరుతుంది’ అని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్‌ అన్నారు. తిరుపతి జిల్లా శ్రీసిటీ పారిశ్రామికవాడలో బుధవారం అమెరికాకు చెందిన ఎయిర్‌ కండిషనర్‌ తయారీ దిగ్గజ సంస్థ ‘క్యారియర్‌’ ఏసీ తయారీ యూనిట్‌కు ఆ సంస్థ చైర్మన్‌, సీఈవో డేవిడ్‌ ఎల్‌.గిట్లిన్‌తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడారు. క్యారియర్‌.. ప్రపంచంలోనే కూలింగ్‌ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన సంస్థగా పేర్కొన్నారు. ఆధునిక ఎయిర్‌ కండిషనింగ్‌ను ఆవిష్కరించడం నుంచి 50 బిలియన్‌ డాలర్లకు పైగా విలువ కలిగిన గ్లోబల్‌ శక్తిగా ఎదగడం వరకు ఈ సంస్థ ఎప్పుడూ ఆవిష్కరణల్లో ముందువరుసలో నిలిచిందన్నారు. రాష్ట్రంలో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టడంతో పాటు 3 వేల ఉద్యోగాలు కల్పించనుందని తెలిపారు. క్యారియర్‌ రావడం.. మన రాష్ట్రం, మన ఎకోసిస్టమ్‌, మన ముఖ్యమంత్రి విజన్‌ పట్ల దానికి ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు. క్యారియర్‌తో తమకు ఎమోషనల్‌ కనెక్షన్‌ ఉందని చెప్పారు. ‘మా ఫస్ట్‌ ఏసీ.. క్యారియర్‌ కంపెనీదే. చంద్రబాబు తన గదిలో 17 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతను ఇష్టపడతారు’ అని అన్నారు. లోకేశ్‌ ఇంకా ఏం చెప్పారంటే..

1.jpg


డేటా సెంటర్లలో ప్రపంచవ్యాప్త పోటీ

రాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటు ప్రారంభం మాత్రమే.. డేటా సెంటర్‌ పరికరాల తయారీలో అగ్రగామిగా నిలవాల్సిన అవసరం ఉంది. ఈ డేటా సెంటర్ల నిర్మాణం, పవర్‌ ఏఐలో ప్రపంచవ్యాప్తంగా పెద్ద పోటీ నడుస్తోంది. ఏపీ ఇప్పటికే ముందంజలో ఉంది. అయితే మనం డేటా సెంటర్లకు ఆతిథ్యం ఇవ్వడం మాత్రమే కాకుండా వాటిని నడిపించే వ్యవస్థలను కూడా నిర్మించాలి. ప్రతి డేటా సెంటర్‌కు అడ్వాన్స్‌డ్‌ కూలింగ్‌ సిస్టమ్స్‌ హై-ఎఫిషియన్సీ చిల్లర్స్‌, పవర్‌ ఎలక్ట్రానిక్స్, కంట్రోల్‌ సిస్టమ్స్‌, ప్రెసిషన్‌ మాన్యుఫాక్చరింగ్‌ అవసరం. మనం ఈ పరికరాల తయారీతో పాటు కీలక సరఫరాదారులుగా మారితే.. అది దేశానికి గొప్ప వ్యూహాత్మక ప్రయోజనంగా మారుతుంది. విశాఖలో ఏఐ డేటా సెంటర్ల నుంచి.. రాష్ట్రవ్యాప్తంగా తయారీ కేంద్రాల వరకు తొలి పూర్తిస్థాయి ఎకోసిస్టమ్‌ నిర్మించడమే మా లక్ష్యం. ఈ ఎకో సిస్టమ్‌లో డేటా సెంటర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, పునరుత్పాదక ఇంధనం, కూలింగ్‌, థర్మల్‌ మేనేజ్‌మెంట్‌, కాంపోనెంట్‌ మాన్యుఫాక్చరింగ్‌, స్కిల్డ్‌ వర్క్‌ ఫోర్స్‌ ఉంటాయి. ఎకోసిస్టమ్‌లో భాగంగానే క్యారియర్‌ ఏపీని ఎంచుకుంది. మా రాష్ట్రాన్ని ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. ఇది ప్రారంభం మాత్రమే. ఈ సంస్థ ఇక్కడ రీసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ను కూడా ఏర్పాటుచేయాలని కోరుకుంటున్నాను. క్యారియర్‌ ప్లాంట్‌ ద్వారా భారతదేశ హీటింగ్‌, వెంటిలేషన్‌-ఎయిర్‌కండిషనింగ్‌ (హెచ్‌వీఏసీ) తయారీ బలపడుతుంది. దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుంది. బలమైన స్థానిక సప్లయ్‌ చైన్‌ ఏర్పడుతుంది. తదుపరితరం డేటా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు బలం చేకూరుతుంది.

స్వర్ణాంధ్ర-2040లో భాగస్వాములం: క్యారియర్‌

శ్రీసిటీలో తమ సంస్థకు ఇది చరిత్రాత్మక ఘట్టమని క్యారియర్‌ ఇండియా ఎండీ సుందరేశన్‌ నారాయణ్‌ చెప్పారు. క్యారియర్‌ బ్రాండ్‌ను తదుపరిస్థాయికి తీసుకెళ్తామని.. 40 ఏళ్లుగా ఇండియాలో తమ సంస్థ ఉందని.. మరో 40 ఏళ్లు నడిచేందుకు క్యారియర్స్‌కు సంబంధించిన అన్నిరకాల ఉత్పత్తులను ఇక్కడ తయారు చేయబోతున్నామని తెలిపారు. దేశ భవిష్యత్‌కు ఏపీ కీలకంగా మారనుందన్నారు. చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం బిజినెస్‌ ఫ్రెండ్లీగా ఉందని, స్వర్ణాంధ్ర-2040లో క్యారియర్‌ కూడా భాగస్వామి కానుందని చెప్పారు. సీఈవో డేవిడ్‌ గెట్లిన్‌ మాట్లాడుతూ.. తమ సంస్థ యూనిట్‌ ఏర్పాటుకు ప్రభుత్వ సహకారం మరువలేనిదన్నారు. ఇండియాలో ఉన్నంతగా క్యారియర్‌ వృద్ధి మరే దేశంలోనూ లేదని తెలిపారు. సంస్థ ప్రతినిధులు లోకేశ్‌ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో క్యారియర్‌ ప్రతినిధులు మైకేల్‌ ఎల్‌.గియర్జెస్‌, మైక్‌ డుయిజర్‌, నాదియా విల్లెనెవ్‌, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌, శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


శ్రీసిటీ ఉత్పాదక హబ్‌..

శ్రీసిటీ ఇండస్ట్రియల్‌ పార్క్‌ మాత్రమే కాదు.. గ్లోబల్‌ మాన్యుఫాక్చరింగ్‌ హబ్‌. ఇది 8500 ఎకరాల్లో విస్తరించి ఉంది. 31 దేశాల నుంచి 250కి పైగా కంపెనీలు శ్రీసిటీలో ఉన్నాయి. ఇక్కడి నుంచి 6 బిలియన్‌ డాలర్లకు పైగా విలువైన ఎగుమతులు జరుగుతున్నాయి. 70 వేల మందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందారు. వీరిలో సగం మంది మహిళలే. ఆటోమొబైల్స్‌ నుంచి ఎలకా్ట్రనిక్స్‌వరకు.. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ నుంచి ప్రిసిషన్‌ ఇంజనీరింగ్‌ వరకు శ్రీసిటీ మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఆంధ్రప్రదేశ్‌కు ఉత్తమ నమూనాగా నిలుస్తోంది. ఈ రోజు మరో గొప్ప ఘనతను ఖాతాలో వేసుకుంది.

అందరూ ఏపీవైపే..

అందరూ ఏపీనే ఎందుకు ఎంచుకుంటున్నారని అడుగుతున్నారు. ఇందుకు మూడు కారణాలున్నాయి. మొదటిది.. అద్భుతమైన ట్రాక్‌ రికార్డ్‌, అనుభవం ఉన్న ముఖ్యమంత్రి, కసితో పనిచేసే యూత్‌ టీమ్‌. రెండోది.. స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌. ఒక్క జూమ్‌ కాల్‌తోనే ఆర్సెలార్‌ మిట్టల్‌ స్టీల్‌ ప్లాంట్‌ వచ్చింది. మూడో కారణం.. రాష్ట్రంలో ఉన్న డబుల్‌ ఇంజన్‌ బుల్లెట్‌ ట్రైన్‌ సర్కారు. భూకేటాయింపుల నుంచి అనుమతుల వరకు మీతో కలిసి ఉంటాం. ఒక్కసారి మాతో చేతులు కలిపిన తర్వాత అది మీ ప్రాజెక్టు కాదు.. మన ప్రాజెక్టు. ఏ అవసరం వచ్చినా వాట్సాప్‌ మెసేజ్‌ దూరంలో అందుబాటులో ఉంటాం. క్లస్టర్‌ విధానంలో ముందుకు వెళ్తున్నాం. విశాఖ గ్లోబల్‌ ఏఐ హబ్‌గా రూపుదిద్దుకుంటుంది. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు విజన్‌-2020ని అందరూ విమర్శించారు. ఆయన్ను సరిగా అర్థం చేసుకోలేదు. ఆయన దార్శనిక నేత. 2047 నాటికి ఏపీని 2.4 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ఆయన లక్ష్యం. దీనిని కచ్చితంగా సాధిస్తాం.

Updated Date - May 07 , 2026 | 04:34 AM