‘ఆర్నబ్’పై మరింత అప్రమత్తం
ABN , Publish Date - Oct 27 , 2026 | 06:24 AM
‘ఆర్నబ్’ తుఫాన్ ముంచుకొస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని మరింత అప్రమత్తం చేస్తూ అధికారులకు సీఎం చంద్రబాబు పలు ఆదేశాలిచ్చారు. తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో విద్యా సంస్థలకు స్థానికంగా సెలవులు ప్రకటించాలని స్పష్టం చేశారు.
ప్రతి 4 గంటలకూ బులెటిన్లు.. అలర్ట్ మెస్సేజ్‌లు
తీర జిల్లాల కలెక్టర్లు ముందస్తు చర్యలు చేపట్టాలి
తుఫాన్ పరిస్థితిపై అధికారులతో సీఎం సమీక్ష
అమరావతి, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): ‘ఆర్నబ్’ తుఫాన్ ముంచుకొస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని మరింత అప్రమత్తం చేస్తూ అధికారులకు సీఎం చంద్రబాబు పలు ఆదేశాలిచ్చారు. తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో విద్యా సంస్థలకు స్థానికంగా సెలవులు ప్రకటించాలని స్పష్టం చేశారు. తుఫాన్ ప్రభావంపై సామాజిక మాధ్యమాల ద్వారా దుష్ప్రచారం చేసేందుకు ప్రయత్నించిన వారిపై కఠినంగా వ్యవహరించాలని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం ఉండవల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో తుఫాన్ పరిస్థితిని సీఎం వర్చువల్‌గా సమీక్షించారు. ఆర్నబ్ తుఫాన్ మంగళవారానికల్లా తీవ్ర తుఫాన్‌గా మారి రాష్ట్రంపై ప్రభావం చూపే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం హెచ్చరికలతో తీర ప్రాంత జిల్లాల కలెక్టర్లు ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం చెప్పారు.
బుధవారానికి తుఫాన్ యానాం వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉందని అధికారులు సీఎంకు వివరించారు. తుఫాన్ కారణంగా మంగళవారం నుంచి 28, 29 తేదీల వరకు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. అలాగే తీరప్రాంతం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. తుఫాన్‌పై గంట గంటకూ అధికారుల నుంచి సమాచారం తీసుకుంటున్న సీఎం.. కలెక్టర్లు, అధికారులకు కీలక సూచనలు చేశారు. తుఫాన్ గమనాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రతి 4 గంటలకూ ప్రజలకు, రైతులకు హెచ్చరికలతో కూడిన బులెటిన్‌ను జారీ చేయాలన్నారు. అలెర్ట్ మెసేజీలు పంపాలని చెప్పారు. తుఫాన్ విషయంలో రాష్ట్రం తీసుకుంటున్న ముందస్తు చర్యలను ఎప్పటికప్పుడు కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలన్నారు.
ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చర్యలు
ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని సీఎం చెప్పారు. ముంపు ప్రాంతాల్లోని ప్రజలను తుఫాన్ షెల్టర్లకు తరలించాలన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణిలు, శిశువులకు తొలి ప్రాధాన్యత ఇచ్చి, సురక్షిత ప్రాంతాలకు వారిని చేర్చాలని చెప్పారు. ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య బృందాలు, అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచాలన్నారు. రాష్ట్రంలో 7 ఎన్డీఆర్ఎఫ్, 8 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను 11 ప్రభావిత జిల్లాల్లో మోహరించినా, ఎన్టీఆర్, విశాఖ జిల్లాల్లో అదనపు బలగాలను రిజర్వ్‌లో ఉంచాలని చెప్పారు. మెరైన్ పోలీసులతో పాటు నౌకాదళం, కోస్ట్‌గార్డుల సేవలను కూడా సహాయక చర్యల్లో వినియోగించుకోవాలని అన్నారు.
సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులందరినీ సురక్షితంగా వెనక్కి రప్పించాలని, సముద్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనేంత వారు వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. వరికోతలైన చోట్ల ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు చేర్చాలన్నారు. దాదాపు 1.82 లక్షల హెక్టార్లలోని ఉద్యాన పంటలకు తుఫాన్ ముప్పు ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. రేషన్ దుకాణాల్లోనూ సరుకులు అందుబాటులో ఉంచాలన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే, తక్షణమే పునరుద్ధరించేలా చూడాలని చెప్పారు.
వరద నీటిని నిల్వ చేయాలి
భారీ వర్షాలతో మొత్తం 22 రిజర్వాయర్ల పరిధిలో వరద ప్రవాహాలు వస్తాయని అధికారులు అంచనా వేశారు. ఈప్రవాహాలతో 10-12 టీఎంసీల నీటిని నిల్వ చేసేలా చూడాలని జలవనరులశాఖను సీఎం ఆదేశించారు. తాండవ, రైవాడ, ఏలేరు, తమ్మిలేరు, ఎర్రకాలువ, తాడిపూడి రిజర్వాయర్లకు పూర్తి స్థాయిలో నీటి నిల్వలు వచ్చే అవకాశం ఉందని సీఎం అన్నారు. వాగులు, వంకలు, కాలువల ప్రవాహాలకు అడ్డంకి లేకుండా చూడాలని సూచించారు.
తుఫాన్ నేపథ్యంలో మొత్తం 30,043 పడవలను సురక్షితంగా హార్బర్లకు చేరుకున్నాయని మత్స్యశాఖ అధికారులు వివరించగా, రాష్ట్రవ్యాప్తంగా 4,711మంది గర్భిణులను ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలకు, ఆసుపత్రులకు తరలించే ప్రక్రియ కొనసాగుతోందని వైద్యఆరోగ్యశాఖ అధికారులు వివరించారు. సమీక్షలో సీఎస్ సాయిప్రసాద్, ఆర్టీజీఎస్, విపత్తు నిర్వహణతో సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరవగా, మంత్రి రామానాయుడు వర్చువల్‌గా పాల్గొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా బలపడిన ‘అర్నబ్’
అతి తీవ్ర తుఫాను..ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్