Share News

800 ప్రాజెక్టులు.. 24 లక్షల ఉద్యోగాలు!

ABN , Publish Date - May 14 , 2026 | 05:45 AM

ఏపీ ఇప్పుడు పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిందని మంత్రి లోకేశ్‌ తెలిపారు. గడచిన 23 నెలల్లో 800 కీలక ప్రాజెక్టులకు సంబంధించి రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని చెప్పారు.

800 ప్రాజెక్టులు.. 24 లక్షల ఉద్యోగాలు!

  • గడచిన 23 నెలల్లో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు: లోకేశ్‌

  • 3 నెలల్లో 100 కంపెనీలు ఎన్‌ఎస్ఈలో లిస్ట్‌ కావాలి

  • ఎస్‌ఎంఈ ఐపీవో అవగాహన సదస్సులో మంత్రి

అమరావతి, మే 13(ఆంధ్రజ్యోతి): ఏపీ ఇప్పుడు పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిందని మంత్రి లోకేశ్‌ తెలిపారు. గడచిన 23 నెలల్లో 800 కీలక ప్రాజెక్టులకు సంబంధించి రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని చెప్పారు. ఇవి సాకారమైతే యువతకు 24 లక్ష ల ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. యువతకు ఉద్యోగాల కల్పనలో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు(ఎంఎస్ఎంఈ) పాత్ర అత్యంత కీలకమన్నారు. ఎంఎస్ఎంఈలకు మూలధన మార్కెట్‌ అవకాశాలపై అవగాహన కల్పించేందుకు నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌(ఎన్‌ఎస్ఈ), ఏపీ ఎంఎ్‌సఎంఈ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌, సీఐఐ సంయుక్తంగా బుధవా రం విజయవాడలో నిర్వహించిన ఎంఎస్ఎంఈ ఐపీవో అవగాహన సదస్సులో లోకేశ్‌ ప్రసంగించారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు సృష్టించాలనే ఏకైక ఎజెండాతో ప్రభుత్వం పని చేస్తోందన్నారు. సీఎం చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ, ఫార్మా రంగాలను ఏవిధంగా అభివృద్ధి చేశారో.. అదే తరహాలో ఏపీని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు టీమ్‌వర్క్‌తో పని చేస్తున్నామని చెప్పారు. లోకేశ్‌ ఏం చెప్పారంటే..

గూగుల్‌ సెంటర్లు.. ఎకోసిస్టమ్‌: చంద్రబాబు రాష్ట్రానికి బ్రాండ్‌ అంబాసిడర్‌లాగా ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు. గూగుల్‌ రూ.1.35 లక్షల కోట్లు, ఆర్సెలార్‌ మిట్టల్‌ రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడులతో ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశాయి. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, టీసీఎస్‌, కాగ్నిజెంట్‌ వంటి కంపెనీలూ వస్తున్నాయి. పుట్టపర్తిలో ప్రపంచ శ్రేణి ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంటిగ్రేషన్‌-ఫ్లయిట్‌ టెస్టింగ్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు కానుంది. విశాఖ నగరానికి అనేక కంపెనీలు క్యూ కట్టాయి. ఇప్పటికే గూగుల్‌ రాగా.. త్వరలో ఇంకో సంస్థ భారీ పెట్టుబడులతో వస్తోంది. విశాఖలో గూగుల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు కావడంతోనే సీమకు క్యారియర్‌ కంపెనీ వచ్చింది. గూగుల్‌ డేటా సెంటర్‌ నిర్వహణకు భారీస్థాయిలో కూలింగ్‌ సిస్టమ్స్‌ అవసరం. ఆ అవసరాన్ని తీర్చేందుకు క్యారియర్‌ శ్రీసిటీలో పెట్టుబడులు పెడుతోంది. దీనినే మల్టీప్లయర్‌ ఎఫెక్ట్‌ అంటారు. పారిశ్రామికవేత్తలకు ఏ కష్టం వచ్చినా నేను మెసేజ్‌ దూరంలోనే ఉంటా.


క్లస్టర్ల ఏర్పాటుతో అభివృద్ధి వికేంద్రీకరణ

‘ఒకే రాజధాని-అభివృద్ధి వికేంద్రీకరణ’ మా ప్రభుత్వ విధానం. 2047 నాటికి ఏపీ ఆర్థిక వ్యవస్థను 2.4 ట్రిలియన్‌ డాలర్లకు చేర్చాలనేది లక్ష్యం. దానికోసం రాష్ట్రవ్యాప్తంగా 22 క్లస్టర్ల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చే శాం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికో పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేస్తున్నాం. మాకు గూగుల్‌ ఎంత ముఖ్యమో.. రూ.50 లక్షల టర్నోవర్‌ కలిగిన ఎంఎస్ఎంఈ యూనిట్‌ అంతే ముఖ్యం. రాష్ట్రంలో 20 లక్షలకు పైగా ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. అవి ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు వర్కింగ్‌ గ్రూప్‌ ఏర్పాటు కావాలి. అందుకే ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ నుంచి ‘స్పీడ్‌ ఆఫ్‌ డూ యింగ్‌ బిజినెస్‌’ వైపు అడుగులు వేస్తూ.. ప్రతి ఎంఎస్ఎంఈకి అనుమతులు, రాయితీలను సరళీకృతం చేస్తున్నాం. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌(ఎన్‌ఎస్ఈ) ద్వారా చిన్న కంపెనీలు పెద్ద సంస్థలుగా ఎదిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఎన్‌ఎస్ఈలో 723 కంపెనీలు లిస్టయి.. రూ.22,415 కోట్ల నిధులు సమీకరించాయి. అందులో 158 సంస్థలు మెయిన్‌ బోర్డు కు చేరాయి. ఏపీ నుంచి ఇప్పటి వరకు 3 సంస్థలు ఎన్‌ఎ్‌సఈలో లిస్టయి.. రూ.100 కోట్లు సమీకరించాయి. వచ్చే మూడు నెలల్లో కనీసం 100 కంపెనీలు లిస్ట్‌ కావాలి.

యువగళం ప్రేరణ..

రాష్ట్రంలో ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యానికి నా ‘యువగళం’ పాదయాత్రే ప్రేరణ. ఒక రోజు పెనుగొండలో కియా మోటార్స్‌ వద్ద సెల్ఫీ దిగేందుకు దారుణమైన ఎండలో 23 కిలోమీటర్ల దూరం నన్ను జాతీయ రహదారిపై నడిపించారు. అక్కడే కియా అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న పద్మావతి అనే చెల్లి నాతో కలిసి నడిచింది. కియా, అనుబంధ పరిశ్రమలు రాకముందు ఆమె గృహిణి. ఆయా సంస్థలు వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులను ఒప్పించి ఉద్యోగంలో చేరింది. నెలకు రూ.30 వేలు సంపాదిస్తోంది. ఆమె కథ విన్న తర్వాత నాకు ఉద్యోగాల కల్పన ఎంత ముఖ్యమో అర్థమైంది. అప్పుడే 20 లక్షల ఉద్యోగాల లక్ష్యం పుట్టింది. కూటమి మ్యానిఫెస్టోలో ఇచ్చిన ‘సూపర్‌ 6’ హామీల్లో ఇదే మొదటిది.

లిస్టయితే అపార అవకాశాలు: ఎన్‌ఎస్ఈ సీఈవో

ఎంఎ్‌సఎంఈలు స్టాక్‌ మార్కెట్‌లో లిస్టయితే నిధుల సమీకరణ మాత్రమే కాకుండా ఆ కంపెనీల విలువ పెరుగుతుందని ఎన్‌ఎస్ ఈ ఎండీ, సీఈవో ఆశిష్‌ కుమార్‌ చౌహాన్‌ అన్నారు. లిస్టింగ్‌ కంపెనీలకు ఉచిత ప్రచారం లభించడంతోపాటు వ్యాపార విస్తరణ, వారసత్వ ప్రణాళికలకు మార్గం సుగమం అవుతుందని చెప్పారు. విజయవాడలో ఉన్న ఎన్‌ఎ్‌సఈ ఇన్వెస్టర్‌ సర్వీస్‌ సెంటర్‌ను మరింత బలోపేతం చేయడంతోపాటు రాష్ట్రంలో కొత్త కార్యాలయాలను ఏర్పా టు చేస్తామని తెలిపారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనను మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం వినూత్నమైన చర్యలు చేపడుతోందని చెప్పారు.

Updated Date - May 14 , 2026 | 05:45 AM