తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో ముందే రేషన్ పంపిణీ
ABN , Publish Date - Oct 27 , 2026 | 04:16 AM
ఆర్నబ్ తుఫాన్ తీవ్రతతో పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీచేసిన నేపథ్యంలో కూటమి సర్కారు అప్రమత్తమైంది.
అమరావతి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): ఆర్నబ్ తుఫాన్ తీవ్రతతో పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీచేసిన నేపథ్యంలో కూటమి సర్కారు అప్రమత్తమైంది. ప్రభావిత ప్రాంతాల్లో పేదలకు బియ్యం, ఇతర నిత్యావసర సరుకులకు కొరత ఏర్పడకుండా ముందుగానే నిల్వలు సిద్ధంగా ఉంచాలని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థకు సూచించింది. తుఫాన్ రాకకు ముందే రేషన్ షాపులన్నింటిలో బియ్యం, ఇతర సరుకుల నిల్వలు సిద్ధంగా ఉంచాలని దిశానిర్దేశం చేసింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముందుగానే రేషన్ సరుకుల పంపిణీతోపాటు అంగన్వాడీ కేంద్రాలు (ఐసీడీఎస్), పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం, సంక్షేమ హాస్టళ్లకు అవసరమైన నిత్యావసర సరుకుల సరఫరాను కొనసాగించాలని ఆదేశించింది. సంబంధిత శాఖల సమన్వయంతో అవసరమైన చోట్ల స్వయం సహాయక సంఘాలు, మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీల సహకారంతో సహాయక శిబిరాల్లో వంట ఏర్పాట్లు చేయాలని పౌరసరఫరాల కమిషనర్ కన్నబాబు సోమవారం అన్ని జిల్లాల అధికారులకు సర్క్యులర్ జారీ చేశారు.
రెండు నెలల రేషన్ ముందుగానే సిద్ధం
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, ఉభయ గోదవరి, కాకినాడ, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పోలవరం జిల్లాలతోపాటు ప్రకాశం జిల్లాలో గుర్తించిన 74 రేషన్ దుకాణాల్లో నవంబరు, డిసెంబరు రేషన్ నిల్వలు కూడా ముందుగా సిద్ధంగా ఉంచాలని కన్నబాబు స్పష్టం చేశారు. తుఫాన్ సమయంలో అత్యవసర సేవలకు పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లతోపాటు విమానాలకు అవసరమైన ఇంధనాన్ని కూడా తగినంత అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. సివిల్ సప్లయిస్ డీఎంలు, డీఎస్వోలు, తహసీల్దార్లు, అసిస్టెంట్ సప్లయి ఆఫీసర్లు, క్షేత్రస్థాయి సిబ్బంది తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లోని రేషన్ షాపులకు అవసరమైన సరుకులను ముందుగానే తరలించే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
ఈ వార్తలనూ చదవండి:
బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా బలపడిన ‘అర్నబ్’
అతి తీవ్ర తుఫాను..ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్