కష్టాన్ని దిగమింగి.. కొత్త పంట కోసం!
ABN , Publish Date - Nov 14 , 2026 | 03:25 AM
ఖరీఫ్ పంట కోతకు వచ్చిన తరుణంలో అర్నబ్, మురసు తుఫాన్లు విరుచుకుపడి రైతుల నడ్డి విరిచాయి. తొలి తుఫానుకు పంట నేల వాలగా..
కోతకు వచ్చిన వరిని దున్నేస్తున్న రైతులు..
తుఫాన్లతో అన్నదాతకు తీరని నష్టం!
ఖరీఫ్ పంట కోతకు వచ్చిన తరుణంలో అర్నబ్, మురసు తుఫాన్లు విరుచుకుపడి రైతుల నడ్డి విరిచాయి. తొలి తుఫానుకు పంట నేల వాలగా.. ఆతర్వాత వచ్చిన మురసుతో వరి చేలు ముంపునకు గురయ్యాయి. పొలాల్లోని నీరు బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో నేలనంటిన వరి కుళ్లి పోతోంది. దీనిని ఒబ్బిడి చేసుకునే మార్గం లేకపోవడంతో.. కష్టాన్ని దిగమింగుకుంటూ.. నష్టాల్ని భరిస్తూ.. కోతకు వచ్చిన వరిని దున్నేసి.. మళ్లీ పంట (దాళ్వా) వేసేందుకు రైతులు దమ్ములు చేసుకుంటున్నారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని చిప్పలపాలెం రైతు గోరింట రాంబాబురాజుకు జరిగిన నష్టం ఇందుకు ఓ ఉదాహరణ.
ఈ రైతుకు బొండాయికోడులో ఐదెకరాలు ఉంది. మరో పదెకరాలు కౌలుకు తీసుకున్నారు. మొత్తం 15 ఎకరాల్లో ‘సంపద’ రకం వరిని సాగు చేశారు. ఇంకొద్ది రోజుల్లో కోత కోయాల్సిన తరుణంలో అర్నబ్ తుఫానులో వీచిన పెను గాలులకు వరి చేను నేలనంటింది. ఆతర్వాత వచ్చిన మురసు వర్షాలకు పంట నీట మునిగి వరి కుళ్లిపోవడం మొదలయ్యింది. దీంతో శుక్రవారం ట్రాక్టర్‌తో పొలంలో దమ్ము చేశారు. దాళ్వా సాగుకు సన్నద్ధమయ్యారు.
పంట బాగుంది.. మంచి దిగుబడి వస్తుందనుకున్న సమయంలో వర్షం వచ్చి ముంచేసిందని రాంబాబురాజు ఆవేదన వ్యక్తం చేశారు. సాగుకు ఎకరాకు 20 నుంచి 25 వేల వరకూ ఖర్చు చేశానని, తుఫాన్లతో రూ.10లక్షల వరకూ నష్టపోయానని వాపోయారు. వ్యవసాయాధికారులు పంట నష్టాన్ని అంచనా వేశారని, ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని రాంబాబురాజుతోపాటు ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు.
- ముమ్మిడివరం, ఆంధ్రజ్యోతి