Share News

వైసీపీ మాయాజాలం..!

ABN , Publish Date - Feb 21 , 2026 | 12:06 AM

వేసవి రాకనే మండలంలో నీటి ఎద్దడి మొదలైం ది. తాగునీటి కోసం గ్రామాలు విలవిల్లాడుతున్నాయి.

వైసీపీ మాయాజాలం..!
మహమ్మదాబాద్‌లో నిరుపయోగంగా ఉన్న ఆర్వో ప్లాంట్‌

అమడగూరు, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): వేసవి రాకనే మండలంలో నీటి ఎద్దడి మొదలైం ది. తాగునీటి కోసం గ్రామాలు విలవిల్లాడుతున్నాయి. తాగునీటిని సరఫరా చేయడానికి జల జీవన మిషన, ఎన్టీఆర్‌ సుజల స్రవంతి పథకాల కింద గతంలో విడుదల చేసిన నిధులను వైసీపీ హయాంలో స్వాహా చేశారు. దీంతో ప్రస్తుతం ఈ దుస్థితి ఏర్పడింది. జల జీవన మిషన పథకం కింద ప్రతి ఇంటికి కొళాయిలు ఏర్పాటు చేయాల్సి ఉంది. మండలానికి జలజీవన మిషన కింద రూ. 1.64 కోట్లు మంజూరయ్యాయి. వైసీపీ పాలనలో ఈ పథకం కాంట్రాక్టర్ల పాలిట వరంలా మారింది. పనులు చేయకుండనే చేసినట్లు చూపి.. బిల్లులు స్వాహా చేశారు. మొత్తం పది పంచాయతీలకు గాను .. కొట్టువారిపల్లి, తుమ్మల మినహా మిగిలిన వాటిల్లో ఇంటింటికి కొళాయిలు ఏర్పాటు చేసినట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో అం దుకు భిన్నంగా ఉంది. చాలా పంచాయతీల్లో అరకొర పనులు చేసి పూర్తి స్థాయిలో బిల్లులు దండుకున్నారు. ఆర్వో ప్లాంట్లలో మిషన్లను ఏర్పాటు చేసి.. బిల్లులు మంజూరైన తర్వాత ఆ మిషన్లను పక్కదారి పట్టించారు. మండలంలోని మహమ్మదాబాద్‌లో గత టీడీపీ ప్రభుత్వ హ యాంలో ఎన్టీఆర్‌ సుజల స్రవంతి పథకం కింద ఆర్‌ ఓ ప్లాంట్‌ ఏర్పాటు నిధులు మంజూరయ్యాయి. అనంతరం వైసీపీ అధికారంలోకి రావడంలో.. కాంట్రాక్టర్‌ అక్కడి ప్లాంట్‌, అందులో మిషన్లను ఏర్పాటు చేసినట్లు బిల్లులు చూపి.. నిధులు స్వాహా చేశారు. ఇలా రికార్డుల్లో మాత్రం అన్ని ఉన్నా.. భౌతికంగా మాత్రం ఏమీ లేవు. దీంతో ప్రస్తుతం గ్రామాలు నీటి ఎద్దడితో ఇబ్బందులు పడుతున్నాయి. గ్రామస్థులు తాగునీటిని బిందెకు రూ. 12లకు కొనాల్సి వస్తోంది. గ్రామాల్లో తాగునీటి సమస్య మరింత తీవ్రం కాకముందే అధికారులు, పాలకులు తగు చర్య లు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - Feb 21 , 2026 | 12:06 AM