కొత్త పింఛన్లు ఎప్పుడో..?
ABN , Publish Date - Feb 24 , 2026 | 12:45 AM
కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి వందలాది మంది అర్హులు నిరీక్షిస్తున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి ఈ దరఖాస్తులు తీసుకోకపోవడంతో.. మండలం అనేక మంది పింఛన కోసం ఎదురుచూస్తున్నారు.
ఓబుళదేవరచెరువు, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి వందలాది మంది అర్హులు నిరీక్షిస్తున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి ఈ దరఖాస్తులు తీసుకోకపోవడంతో.. మండలం అనేక మంది పింఛన కోసం ఎదురుచూస్తున్నారు. సచివాలయ ఉద్యోగులతో ఆరా తీస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. ప్రస్తుతం మండలంలో ఓఏపీ 4623, వితంతు 1251, ఒంటరి మహిళలు 201, వికలాంగులు దివ్యాంగులు 1018, డప్పు కళాకారులు అభయహస్తం ఇతర పింఛనదారులు 504, మెడికల్ పెన్షనలు 65 మంది తీసుకుంటారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వృద్ధులకు రూ. 4వేలు, దివ్యాంగులకు రూ. 6వేలు, ఒంటరి మహిళలకు రూ. 4వేలు, మెడికల్ పేషంట్లకు రూ. 15 వేలను ప్రతి నెలా ఒకటో తేదీనే ఇస్తోంది. ప్రస్తుతం ఓఏపీ, ఒంటరి మహిళలు కొత్త పెన్షనల కోసం దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం సామాజిక పెన్షనలు వస్తున్న వృద్ధులు అనారోగ్యంతోగానీ, ప్రమాదవశాత్తు గానీ చనిపోతే వెంటనే ఆ కుటుంబానికి చెందిన అతని భర్య లేదా భర్తకు వెంటనే స్పౌజ్ క్రింద ఆ పెన్షనను మంజూ రు చేస్తున్నారు. అయితే కొత్త వారి నుంచి మాత్రం దరఖాస్తులు స్వీకరించడం లేదు. దీంతో ఇటీవల 60 సంవత్సరాలు నిండిన వారు, వికలాంగులు, ఒంటరి మహిళలు పింఛన కోసం నిరీక్షిస్తున్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు పింఛన మంజూరు చేయాలని వినతులు అధికంగా వస్తున్నాయి.