సర్పంచ ఇంటి ఎదుట విద్యార్థుల ఆందోళన
ABN , Publish Date - Feb 11 , 2026 | 12:09 AM
పాఠశాలలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని మండలంలోని నాగిరెడ్డిపల్లి ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు.
బ్రహ్మసముద్రం, ఫిబ్రవరి10 (ఆంధ్రజ్యోతి) : పాఠశాలలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని మండలంలోని నాగిరెడ్డిపల్లి ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఏకంగా సర్పంచ ఇంటి ఎదుటే ఖాళీ ప్లేట్లతో నిరసన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. నాగిరెడ్డిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో 15 మంది ఉపాధ్యాయులు, 250 మంది విద్యార్థులున్నారు. పది రోజులుగా తాగునీటి సమస్య ఏర్పడింది. మధ్యాహ్న భోజనం తయారీకి.. తాగు నీరు లేక ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను ఉపాధ్యాయులు పలుమార్లు వివరించినా సర్పంచ సందీప్ కుమార్ పట్టించుకోలేదు. దీంతో ఆ విద్యార్థులు ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో ఉన్న ఆ సర్పంచ ఇంటి వరకు ఖాళీ ప్లేట్లతో నిరసన ర్యాలీని మంగళవారం చేపట్టారు. ఆయన ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. ప్లేట్లు గ్లాసులతో శబ్దం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అయితే ఆ సమయంలో ఇంటిలో సర్పంచ లేకపోవడంతో అతని అమ్మతో మాట్లాడి వి ద్యార్థులు వెనుదిరిగారు. ప్రధానోపాధ్యాయులు పోలమ్మ మాట్లాడుతూ.. ఆర్వో వాటర్ ప్లాంట్ పనిచేయడం లేదని, శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం ద్వారా పాఠశాలకు పది రోజులకు ఒకసారి నీరు వస్తోందని అన్నారు. పాఠశాలలో నీటి సమస్యను సర్పంచ, స్కూల్ కమిటీ ఛైర్మన దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదన్నారు. విద్యార్థులు నీటి కోసం తన వద్దకు వస్తే వెళ్లి సర్పంచ ఇంటి ముందు నిరసన వ్యక్తం చేయాలని తానే సూచించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు స్పందించి సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపాలన్నారు.