Share News

ముంచిన నాసిరకం విత్తనాలు

ABN , Publish Date - Feb 12 , 2026 | 12:27 AM

నాసిరకం వరి విత్తనాలు అన్నదాతలను నిండాముంచాయి.

ముంచిన నాసిరకం విత్తనాలు
ఎదుగుదల లేని వరి పంట వద్ద రైతులు

శెట్టూరు, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): నాసిరకం వరి విత్తనాలు అన్నదాతలను నిండాముంచాయి. మండలంలోని పెరుగుపాళ్యం పంచాయతీ బుడ్డయ్యదొడ్డి గ్రామ రైతులు కళ్యాణదుర్గం ఆర్టీసీ బస్టాండు సమీపంలోని ఓ దుకాణంలో గత అక్టోబరులో వరి విత్తనాలను ఒక ప్యాకెట్‌ రూ. 950 చొప్పున కొనుగోలు చేశారు. అంతేకాకుండా ఆ పంటకు కావలసిన ఎరువులు, మందులు మొత్తం ఆ ఎరువుల దుకాణంలోనే కొన్నారు. అదే నెలలో నారు పోసి సాగు చేశారు. అయితే వరి పంట ఎదుగుదల లోపించి.. వరి కంకులు సక్రమంగా రాకపోవడంతో రైతులు అయోమయంలో పడ్డారు. సాగు చేసిన వరి పంట 40 శాతం చిగురు వచ్చి.. పంట చేతికివచ్చే లక్షణాలుకనిపించకపోవడంతో రైతులు యర్రప్ప, యర్రగుంటప్ప గారి తిప్పేస్వామి, గోపాల్‌ ఇటీవల మండల వ్యవసాయాధికారి వాసుకికి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే పెట్టుబడికి సుమారుగా రూ. 1.50 లక్షలు పెట్టామని.. తీరా చూస్తే పెట్టుబడి కూడా వచ్చేలా లేదని వాపోయారు. దీంతో ఆ అధికారి వారి పంటను పరిశీలించింది. దీనిపై మండల వ్యవసాయాధికారిని వివరణ కోరగా.. విచారించి తగు చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - Feb 12 , 2026 | 12:27 AM