నత్తనడకన రీసర్వే
ABN , Publish Date - Feb 24 , 2026 | 12:46 AM
మండలంలోని భూ రీ సర్వే పనులు నత్తనడకన సాగుతున్నాయి. బ్రిటీష్ కాలంలో 1916లో మొట్టమొదటి సారిగా భూములు, గుట్టలు, కొండలు, వంకలు, వాగులు, చెరువులు పూర్తిస్థాయిలో సర్వేలు నిర్వహించి రికార్డుల్లో పొందుపరిచారు
అమడగూరు, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): మండలంలోని భూ రీ సర్వే పనులు నత్తనడకన సాగుతున్నాయి. బ్రిటీష్ కాలంలో 1916లో మొట్టమొదటి సారిగా భూములు, గుట్టలు, కొండలు, వంకలు, వాగులు, చెరువులు పూర్తిస్థాయిలో సర్వేలు నిర్వహించి రికార్డుల్లో పొందుపరిచారు. నాటి నుంచి నేటి వరకు అదే రికార్డులు ఆధారంగా సర్వేలు నిర్వహిస్తున్నారు. యంత్రాలు, టెక్నాలజీ పెరిగినా ఇప్పుడు కూడా గొలుసుతో స్థలాన్ని కొలుస్తూ హద్దులు నిర్ణయిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఒక సర్వే నెంబర్ సర్వే చేయాలంటే కనీసం రెండు, మూడు రోజులు పడుతుంది. అందులో కూడా ఖచ్చితత్వం ఉండటం లేదు. అదే ఆధునిక యంత్రాలతో కొలిస్తే కేవలం పది నిమిషాల్లో ఆ పని పూర్తి అవుతుంది. ఈ యంత్రాలతో పని సులభమే కాకుండా.. ఖచ్చితమైన కొలతలు వస్తాయని అఽధికారులు అంటున్నారు. ప్రస్తుతం మహమ్మదాబాద్ పంచాయతీలో నెల రెండు నుంచి భూ సర్వే పనులు నిర్వహిస్తున్నారు. సర్వే సిబ్బందికి కూడా తగినంత సర్వే పరికరాలు లేకపోవడంతో పనులు చాలా నెమ్మదిగా సాగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు, పాలకులు సర్వే పనులను వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.