రీ సర్వేతో ఊరట
ABN , Publish Date - Feb 10 , 2026 | 01:07 AM
గత వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. రైతు సమస్యలను ఏ మాత్రం పట్టించుకోలేదు.
డీ.హీరేహాళ్, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. రైతు సమస్యలను ఏ మాత్రం పట్టించుకోలేదు. పైగా వైసీపీ ముఖ్యమంత్రి జగనరెడ్డి తీసుకోచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టుతో రైతులు వారి భూములపై హక్కులు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. భూముల సర్వే చేసి.. జగన ఫొటో ఉన్న సర్వే రాళ్లు పాతి.. జగన ఫొటో ఉన్న పాస్‌పుస్తకాన్ని ఆ ప్రభుత్వం ఇచ్చేది. నాడు ఆ పార్టీ నాయకులు పలు స్థలాలను వారి పేర్లమీద మార్చుకోవడం మొదలు పెట్టారు. కనీసం రైతులకు తెలీకుండా.. ఇష్టానుసారంగా సర్వేలు చేయడంతో భూ వివాదాలు అధికమయ్యాయి. ఈ వివాదాలు పలు గొడవలు, హత్యలకూ దారి తీసింది. ఆ సమయంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వెంటనే ఆ నల్ల చట్టాన్ని రద్దు చేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దుతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. కూటమి ప్రభుత్వం మళ్లీ రైతుల సమక్షంలో రీ సర్వే చేయించి.. వారి స్థలాల హద్దులను గుర్తించింది. రాజముద్ర ఉన్న పట్టాదారు పాసుపుస్తకాన్ని ఇవ్వడం ప్రారంభించింది. ఇంకా ఏమైనా సమస్యలుంటే గ్రామసభలు నిర్వహించి.. వాటిని అక్కడికక్కడే వెం టనే పరిష్కరించేలా చర్యలు చేపట్టింది. రాజముద్రతో కూడిన నూతన పట్టాదారుపాసుపుస్తకాలను అందుకు న్న రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.