కోతల్లో ఊరట
ABN , Publish Date - Jan 27 , 2026 | 01:18 AM
గతంలో పప్పుశనగ కోతలు వస్తున్నాయంటే రైతుల్లో ఆందోళన మొదలయ్యేది. కోతల సమయంలో కూలీలు దొరక్క... పంట ఎండిపోతుంటే ఇబ్బందులు పడేవారు.
యల్లనూరు, జనవరి 26(ఆంధ్రజ్యోతి): గతంలో పప్పుశనగ కోతలు వస్తున్నాయంటే రైతుల్లో ఆందోళన మొదలయ్యేది. కోతల సమయంలో కూలీలు దొరక్క... పంట ఎండిపోతుంటే ఇబ్బందులు పడేవారు. అయితే రెండు, మూడు సంవత్సరాల నుంచి యంత్రాల సాయంతో పప్పుశనగను నేరుగా కోతలు కోయిస్తున్నారు. దీంతో కూలీల బెడద నుంచి కొంత ఊరట లభించింది. అయితే నాడు తక్కువ యంత్రాలు ఉండటంతో వాటికి డిమాండ్ ఉండేది. ఈ ఏడాది పదుల సంఖ్యలో యంత్రాలు మండలానికి వచ్చాయి. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణా ప్రాంతాలకు చెందిన లారీలు, ట్రాక్టర్ యంత్రాలు రైతులకు అందుబాటులోకి వచ్చాయి.
తగ్గిన కోత ఖర్చు
గతేడాది ఎకరా యంత్రం సాయంతో కోయడానికి రూ.2500 వరకు బాడుగ ఉండేది. ప్రస్తుతం యంత్రాలు అధికంగా రావడంతో రూ.1800 నుంచి 2వేల వరకు బాడుగ నడుస్తోంది. దీంతో తమకు కోత ఖర్చులు కూడా తగ్గాయని రైతులు అంటున్నారు.
సమయమూ ఆదా
యంత్రాల సాయంతో ఒకేసారి పంట కోత.. నూర్పిడి జరుగుతుండడంతో రైతులు వాటిపైనే ఎక్కువ మొగ్గుచూపుతున్నారు. కూలీల సాయంతో కోత కోయడం... ఆ తర్వాత పంటనూర్పిడికి యంత్రాల్లోకి వేయడం.. ఇలా రెండుసార్లు కూలీలు అవసరం ఉండేది. కానీ ప్రస్తుతం నేరుగా యంత్రాలే ఈ రెండు పనులను ఒకేసారి చేస్తుండడంతో కూలీల డిమాం డ్ తగ్గింది. సమయమూ ఆదా అవుతోంది.
పెరిగిన దిగుబడి
ఈ సారి పంట దిగుబడి కూడా బాగా పెరిగిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు 5నుంచి 9క్వింటాళ్ల వరకు వస్తోంది. కొంతమంది రైతులు పొలాల వద్దనే అమ్మేస్తున్నారు. ప్రస్తుతం క్వింటా ధర రూ.5600 నుం చి 5800 వరకు పలుకుతోంది. అంతేకాకుండా పురుగు ఉధృతి చాలా తగ్గడంతో మందు ఖ ర్చులూ తగ్గాయని రైతులు అంటున్నారు. గ తంలో పప్పుశనగ పంట పూర్తయ్యే సమయానికి 4 నుంచి 5 రౌండ్ల మందులు పిచికారి చేయాల్సి వచ్చేది. ఈ ఏడాది పురుగు ఉ ధృతి చాలా తక్కువగా ఉండటంతో రైతులు రెండు, మూడు రౌండ్లు మాత్రమే పిచికారి చేశారు. దీంతో మందు ఖర్చులు తగ్గిపోయాయి.