తాగునీటి పనుల అడ్డగింత
ABN , Publish Date - Feb 13 , 2026 | 12:14 AM
పట్టణంలోని కొలిమి లేఅవుట్ (జగనన్న కాలనీ)లో 450కు పైగా ఇళ్లు ఉన్నాయి. వైసీపీ హయాం లో జలజీవన మిషన క్రింద వైసీపీ నాయకులు తూతూ మంత్రంగా ఇంటింటికి కొళాయిలు ఏర్పాటు చేసి.. బిల్లులు తీసుకున్నారు.
ఉరవకొండ, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని కొలిమి లేఅవుట్ (జగనన్న కాలనీ)లో 450కు పైగా ఇళ్లు ఉన్నాయి. వైసీపీ హయాం లో జలజీవన మిషన క్రింద వైసీపీ నాయకులు తూతూ మంత్రంగా ఇంటింటికి కొళాయిలు ఏర్పాటు చేసి.. బిల్లులు తీసుకున్నారు. అయితే ఆ పైప్‌లైనకు ప్రధాన కనెక్షన ఇవ్వకపోవడంతో ఆ పనులు వృథా అయ్యాయి. ఏ ఒక్క ఇంటికీ చుక్కనీరు అందలేదు. ఆ కాలనీ ఏర్పడినప్పటి నుంచి నీటి సమస్య ఉందని, దీన్ని పరిష్కరించాలని ఆ కాలనీ వాసులు మంత్రి పయ్యావుల కేశవ్‌ను కోరారు. దీంతో ఆ కాలనీలో వైప్‌లైన ఏర్పాటుకు రూ.4.80 లక్షల మంజూరు చేయించారు. మొత్తం ఆ కాలనీలో 13 లైన్లు ఉండగా.. రూ. 4.80 లక్షలతో 8 లైన్లు వరకు పైప్‌లైన పనులు పూర్తి చేశారు. ఇక ఆ పైప్‌లైనకు ప్రధాన పైప్‌లైన కనెక్షన ఇచ్చి.. ఇంటింటికి కొళాయిలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రధాన కనెక్షన ఇచ్చేందుకు కాంట్రాక్టర్ గురువారం ప్రయత్నించగా.. ఆ కాలనీ వాసులే అడ్డుకున్నారు. కాలనీ మొత్తం పనులు పూర్తయిన తర్వాతే ప్రధాన కనెక్షన ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శి మహ్మద్‌రఫీకి వారు తేల్చిచెప్పారు. ప్రస్తుతం ఈ కనెక్షన ఇస్తే.. దాదాపు 200 ఇళ్లకు నీరు లభిస్తుందని... నిధులు మంజూరు కాగానే మిగిలిన లైన్లకూ పైప్‌లైన వేస్తామని కాంట్రాక్టర్ చెప్పినా.. వారు వినలేదు. దీంతో చేసేదీమీలేక వారు వెనుతిరిగారు.
రాజకీయ కుట్ర : కాలనీ వాసుల్లో విభేదాలు సృష్టించి.. అభివృద్ధిని అడ్డుకునేందుకే వైసీపీ నాయకులు ఇలా కుట్ర చేస్తున్నారని లేఅవుట్ వాసులే వాపోతున్నారు. జగనన్న కాలనీలో సమస్య పరిష్కారం అయితే ఆ పేరు టీడీపీకి వస్తుందనే ఇలా వైసీపీ నాయకులు ఉద్ధేశపూర్వకంగానే మిగిలిన వారిని రెచ్చగొట్టి ఆ పనులను అడ్డుకున్నట్లు ఆరోపిస్తున్నారు. జలజీవన మిషన కింద తూతూ మంత్రంగా పనులు చేపట్టి బిల్లులు కాజేసిన వైసీపీ నాయకులను నిలదీయని వారు .. నేడు అభివృద్ధి పనులు అడ్డుకోవడంతో విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నీచ రాజకీయాలతో నేడు అందరం తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడాల్సి వస్తోందని వాపోతున్నారు.