పెద్దాస్పత్రిలో పరిణామాలపై ఎమ్మెల్యే ఆగ్రహం
ABN , Publish Date - Jun 01 , 2026 | 11:55 PM
జిల్లా సర్వజనాస్పత్రి పరిణాలపై అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ సీరియస్ అయ్యారు. సోమవారం ఆయన ఆస్పత్రి సూపరింటెండెంట్ మల్లీశ్వరి, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ విజయశ్రీతో తన క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు.
సూపరింటెండెంట్, ప్రిన్సిపాల్‌ను పిలిపించి ఆరా
రోగులు ఇబ్బంది పడకూడదని సూచన
అనంతపురం క్రైం, జూన 1(ఆంధ్రజ్యోతి): జిల్లా సర్వజనాస్పత్రి పరిణాలపై అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ సీరియస్ అయ్యారు. సోమవారం ఆయన ఆస్పత్రి సూపరింటెండెంట్ మల్లీశ్వరి, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ విజయశ్రీతో తన క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. పెద్దాస్పత్రిలో విద్యుత సరఫరా లేక రోగులు ఇబ్బందులు పడటంపై ఆరాతీశారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆస్పత్రిలో షెడ్డుకూలడం, చెట్లు పడిపోవడంతో రెండు రోజులుగా విద్యుత సరఫరాలో అంతరాయం ఏర్పడిందని వారు వివరించారు. వెంటనే జనరేటర్ సాయంతో విద్యుత సరఫరాను పునరుద్ధరించామన్నారు. వారి సమాధానంపై సంతృప్తి చెందని ఎమ్మెల్యే.. కొన్ని వార్డులకు ఎందుకు విద్యుత సరఫరా చేయలేదని మండిపడ్డారు. రోగులు ఇబ్బందులు పడడంపై అసహనం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో తరచూ గొడవలు, వీల్‌చైర్లు, సె్ట్రచర్ల కొరతపై ఆరాతీశారు. పెద్దాస్పత్రిలో ఏ చిన్న సమస్య వచ్చినా తన దృష్టికి తేవాలన్నారు. రోగులకు ఏ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
మోహన మృతిపై విచారణ కమిటీ ఏర్పాటు
అనంత సర్వజన వైద్యశాలలోని అత్యవసర విభాగంలో వెంటిలేటర్‌పై ఉన్న రోగి మోహన మృతిపై ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటుచేసినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి సోమవారం ప్రకటనలో తెలిపారు. గతనెల 30న పెద్దాస్పత్రిలో విద్యుత సరఫరా నిలిచిపోవడంతో వెంటిలేటర్‌పైనున్న ధర్మవరం పట్టణానికి చెందిన మోహన మృతిచెందాడు. ‘కరెంట్ పోయింది.. ఊపిరి ఆగింది’ శీర్షికన మే31న ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించిన విషయం విదితమే. దీనిపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, ఇంటెలిజెన్స విభాగం ఆరాతీసింది. ఈ నేపథ్యంలో మోహన మృతిపై ముగ్గురు వైద్యులతో కమిటీ వేశారు. కమిటీ నివేదిక మేరకు చర్యలు తీసుకుంటామని డాక్టర్ మల్లీశ్వరి తెలిపారు.