నష్టాల పాలు..!
ABN , Publish Date - Mar 02 , 2026 | 12:20 AM
పాలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో మండలంలోని పాడి రైతులు నష్టాల పాలవుతున్నారు
నల్లమాడ, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): పాలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో మండలంలోని పాడి రైతులు నష్టాల పాలవుతున్నారు. గతంలో అనేకమంది రైతులు వ్యవసాయ రంగం మీదే ఆధారపడి జీవించేవారు. కాని వర్షాభావంతో పంటలు చేతిక రాకపోవడం.. వ్యవసాయ పెట్టుబడులు పెరగడంతో అనేక మంది వ్యవసాయం మానేసి.. పాడిరైతులుగా మారారు. దీంతో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి వద్ద రెండు నుంచి పది పాడి ఆవులను కొనుగోలు చేశారు. పాడిరైతులుగా మారి జీవనం సాగిస్తున్నారు. మండల కేంద్రంలో 2008లో పాల డెయిరీని ప్రారంభించారు. వెలుగు కార్యాలయం ఆధ్వర్యంలో పాల కేంద్రాలను ప్రభుత్వమే ఏర్పాటు చేసి, పాడి రైతులకు లాభసాటిగా ఉండేలా నిర్వహించారు. కొన్నేళ్లుగా వెలుగు సంఘం సభ్యుల ద్వారా పాలను సేకరించి, డెయిరీలను కొనసాగించారు. ఇలా కొన్నేళ్లుగా ఈ డెయిరీ విజయవంతంగా సాగింది. ఈ క్రమంలో ప్రైవేటు పాల డెయిరీలు ఏర్పాటు చేసి.. ప్రభుత్వం కన్నా అధిక ధరకు పాలను కొనుగోలు చేయడం ప్రారంభించారు. దీంతో పాల సేకరణ తగ్గడంతో ప్రభుత్వ డెయిరీలు మూతపడ్డాయి. దీంతో పాడి రైతులకు ప్రైవేటు పాల డెయిరీలే దిక్కయ్యాయి. ప్రస్తుతం మండలంలోని దొడ్ల , శ్రీజా పాల డెయిరీలు కొనసాగుతున్నాయి.
పెరిగిన ఖర్చులు : పాడిరైతులు ఒక పాడి ఆవును రూ.50వేల నుంచి లక్ష వరకు వెచ్చించి కొనుగోలు చేశారు. ఒక్కొక్క రైతు రెండు నుంచి పది ఆవుల వరకు పోషిస్తున్నారు. పాడి ఆవులకు గడ్డి, దాణ, వైద్యం ఇలా.. దాదాపు ఒక ఆవుకు నెలకు రూ.6 వేల నుంచి 7 వేల వరకు ఖర్చు అవుతోంది. రెండు పాడి ఆవుల నుంచి 15 లీటర్ల పాలు వస్తాయి. వెన్న శాతాన్ని బట్టి లీటర్ రూ. 30 నుంచి 38 వరకు ఽధర పలుకుతోంది. కష్టం తగట్టుగా ఫలితం ఉండటం లేదని పాడిరైతులు వాపోతున్నారు. లీటర్‌కు రూ.45 నుంచి 50 వరకు చెల్లిస్తే ఉపసమనంగా ఉంటుందంటున్నారు. అంతేకాకుండా ఒక దాణా ప్యాకెట్టు రూ.1500, ఒక ట్రాక్టర్ వేరుశనగ కట్టె రూ.15 వేలు, వైద్యచికిత్సల కోసమే వచ్చిన మొత్తాన్ని ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం మళ్లీ పాల డెయిరీలను ఏర్పాటు చేసి.. లీటర్‌కు రూ.50తో కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని పాడి రైతులు కోరుతున్నారు.