అప్పుడే నీటి ఇక్కట్లు
ABN , Publish Date - Feb 18 , 2026 | 12:17 AM
వేసవి ప్రారంభం కాకముందే తాగునీటి సమస్యలు తలెత్తుతున్నాయి. తనకల్లు సాయినగర్ వాసులు రెండు నెలలుగా తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు
తనకల్లు, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): వేసవి ప్రారంభం కాకముందే తాగునీటి సమస్యలు తలెత్తుతున్నాయి. తనకల్లు సాయినగర్ వాసులు రెండు నెలలుగా తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా బోరుగా వేయాలని.. లేదా పైప్‌లైన వేసి ఈ సమస్యను పరిష్కరించాలని పలుమార్లు ఆ కాలనీ వాసులు అధికారులు, పాలకులను విజ్ఞప్తి చేస్తున్నా.. వారు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. సాయినగర్‌లో ప్రభుత్వం మొదట చేతిపంపును ఏర్పాటు చేసింది. కొంతకాలానికి ఆ బోరుకు విద్యుత మోటారు ఏర్పాటు చేసి.. అక్కడో ట్యాంక్ ఏర్పాటు చేసి.. పైపులైన ద్వారా నీటిని అందించేవారు. ఇటీవల భూగర్బజలాలు బాగా తగ్గాయి. దీంతో సాయినగర్ బోరులోనూ నీరు అడుగంటాయి. పైపులైన్ల ద్వారా నీరు రాకపోవడంతో ఆ కాలనీ వాసులు ఆ ట్యాంక్ వద్దే నీరు పట్టుకొని వెళ్లేవారు. ప్రస్తుతం ఆ బోరు ద్వారా పది బిందెల నీరూ రావడం లేదు. ఆ కాలనీవాసులు బిందె నీటి కోసం అక్కడే నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపై కార్యదర్శి క్రిష్ణమూర్తిరెడ్డిని వివరణ కోరగా.. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి.. పరిష్కరిస్తామన్నారు.