INSTA ఇనస్టా ప్రేయసీ.. ఊడ్చేశావే ఊర్వశీ..!
ABN , Publish Date - Apr 28 , 2026 | 12:48 AM
‘మా అబ్బాయిలు అలా తుప్పల్లోకి పిలిస్తే వెళ్లండమ్మా.. మీరు ఊహించినట్లుగా అక్కడ ఏమీ జరగదు..’ అని అల్లు అర్జున చెప్పే డైలాగ్ యువతను ఉర్రూతలూగించింది. ఆ మాటలు నిజమే అనుకున్నాడో, లేక ఏదో ఊహించుకున్నాడో గాని, ఓ యువతితో కలిసి తుప్పల్లోకి వెళ్లిన పల్నాడు యువకుడికి చుక్కలు చూపించింది ఓ గ్యాంగ్..!
పల్నాడు పిల్లోడికి
తుప్పల్లో చుక్కలు
వలపు వల విసిరి దోచేసిన గ్యాంగ్..?
గుత్తి వద్ద హైవేపై ఘటన
‘మా అబ్బాయిలు అలా తుప్పల్లోకి పిలిస్తే వెళ్లండమ్మా.. మీరు ఊహించినట్లుగా అక్కడ ఏమీ జరగదు..’ అని అల్లు అర్జున చెప్పే డైలాగ్ యువతను ఉర్రూతలూగించింది. ఆ మాటలు నిజమే అనుకున్నాడో, లేక ఏదో ఊహించుకున్నాడో గాని, ఓ యువతితో కలిసి తుప్పల్లోకి వెళ్లిన పల్నాడు యువకుడికి చుక్కలు చూపించింది ఓ గ్యాంగ్..! ‘నా లవర్‌తో నీకేం పనిరా ఇక్కడ..?’ అంటూ చీకట్లో చితక్కొట్టి నిలువుడోపిడీ చేసింది. గుత్తి పట్టణ శివారులో, 44వ నంబరు జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన ఈ సంఘటన ‘వలపు వల’ అనేందుకు బలమైన ఆధారాలు కనిపిస్తున్నాయి. ‘కలుసుకుందాం రా..’ అని పిలవగానే, ‘గాల్లో తేలినట్లుందే..’ అని ఏదోదే ఊహించుకుని, ఎగేసుకుంటూ వచ్చిన యువకుడు.. చేదు అనుభవంతో వెనుదిరిగాడు.
ఇదీ కథ.
పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన ఓ యువకుడికి ఇనస్టాలో కర్నూలు జిల్లా జొన్నగిరి ప్రాంతానికి చెందిన ఓ యువతి పరిచయమైంది. కేవలం నాలుగు రోజుల వ్యవధిలో ప్రేమ ముదిరింది. ‘కలుసుకుందామా..’ అనేదాకా వెళ్లింది. అప్పటికే వివిధ నంబర్లకు ఫోన పే ద్వారా ఆ యువకుడి నుంచి కొంత సొమ్ము రాబట్టుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో.. ‘రా...’ అని ఆ యువతి పిలవగానే లగెత్తుకుంటా వచ్చేశాడు. ఈ నెల 26వ తేదీ రాత్రి గుత్తి సమీపంలోని 44వ జాతీయపై.. ఓ రెస్టారెంట్ వద్దకు చేరుకున్నాడు. కాసేపటికి ఆ యువతి అతన్ని కలిసింది. ‘ఇక్కడ వద్దు.. ఎవరూ లేనిచోటకు వెళ్లి మాట్లాడుకుం దాం..’ అని ఊరించింది. ఇద్దరూ కలిసి అక్కడికి సమీపంలో, ఓ పాడుబడిన పెట్రోల్ బంకు వద్ద తుప్పల్లోకి వెళ్లారు. ఆ వెంటనే ఓ గ్యాంగ్ ఎంట్రీ ఇచ్చింది. సుమారు నలుగురు నుంచి ఆరుగురు దుండగులు దాడి చేశారు. యువకుడి కళ్లలోకి ఏదో స్ర్పే చేశారు. దుండగుల్లో ఒ కరు ఆ యువతి లవర్‌ను అని చెప్పుకున్నాడు. ‘నా లవర్‌తో నీకేం పని..?’ అని అందరూ కలిసి చితక్కొట్టారు. డబ్బులు, వాచీ లాక్కున్నారు. సెల్‌ఫోనను కూడా లాక్కోబోయారు. పెనుగులాడి తప్పించుకున్న ఆ యువకుడు, పరిగెత్తుకుంటూ హైవేపై ఓ డాబా వద్దకు చేరుకున్నాడు. డాబా నిర్వాహకులు, కస్టమర్లకు విషయం చె ప్పగానే, వారు పోలీసులకు సమాచారం చేరవేశారు. అ యినా ఆ గ్యాంగ్ వదల్లేదు. యువతి లవర్ అని చెప్పుకున్న యువకుడు, మరికొందరు డాబా వద్దకు వచ్చి దా డికి ప్రయత్నించారు. అక్కడే దుప్పటి పంచాయితీ చే యాలని చూశారు. ఈ లోగా కొందరు పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు అడిగారు. దీంతో ఒక రాజకీయ పార్టీ నాయకులమని చెప్పుకున్నారు. తమ స్నేహితుడి ప్రియురాలిని ఆ యువకుడు చీకట్లోకి తీసుకెళ్లాడని, అం దుకే తాము దండిస్తున్నామని సమర్థించుకున్నారు. ‘స్టేషనకు రండి..’ అని పిలిస్తే, ఓ పోలీసు అధికారికి ఫోన చేసి సిఫార్సు చేయించుకున్నట్లు సమాచారం. దీంతో అప్పటికే వణికిపోయిన ఆ యువకుడు, ‘సర్, నాకు కేసు వద్దు ఏమీ వద్దు.. మరొకరికి ఇట్ల జరగకుండా చూడండి చాలు..’ అని పోలీసులకు చెప్పి వెళ్లిపోయాడు.
భయమే లేదా..?
వలపు వలలు వ్యవహారం జిల్లాను కుదిపేస్తోంది. అందులో ఇరుక్కున్న పోలీసులు విలవిలలాడుతున్నారు. కొందరి ఉద్యోగాలు పోయాయి. మరికొందరు సస్పెండ్ అయ్యారు. అయినా ఇలాంటి ఘటన జరగడం కలకలం రేపుతోంది. ఈ సంఘటన ఆధారంగా పోలీసులు కూపీలాగితే.. ఇంకో ముఠా పట్టుబడినా ఆశ్చర్యపోనక్కర లేదని స్థానికులు అంటున్నారు. ఫిర్యాదు అందలేదు కాబట్టి పోలీసులు వదిలేస్తారా..? లేక లోతుగా దర్యాప్తు చేస్తారా..? తేలాల్సి ఉంది.