Share News

honey ఇనస్టాహనీట్రాప్‌ కేసులో నవరత్నాలు

ABN , Publish Date - Apr 28 , 2026 | 12:52 AM

హనీట్రాప్‌ కేసులో ‘తొమ్మిది’ ట్రెండింగ్‌ నంబర్‌ అయింది. ఈ కేసులో ఇప్పటి వరకూ అరెస్టు అయిన నిందితుల సంఖ్య, ఇరుక్కున్న పోలీసుల సంఖ్య ఇదే కావడం గమనార్హం.

honey ఇనస్టాహనీట్రాప్‌ కేసులో నవరత్నాలు

పోలీసులు 9.. ముఠా సభ్యులు 9

నరేంద్ర రెడ్డి, ఓం ప్రకాష్‌ అరెస్టు

‘నాలుగో స్తంభం’ ఉందన్న డీఎస్పీ

ఆ విలేకరులపై కేసులు కడతారా..?

దర్యాప్తు ముగిసిందా..? ఇంకా ఉందా..?

అనంతపురం క్రైం, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): హనీట్రాప్‌ కేసులో ‘తొమ్మిది’ ట్రెండింగ్‌ నంబర్‌ అయింది. ఈ కేసులో ఇప్పటి వరకూ అరెస్టు అయిన నిందితుల సంఖ్య, ఇరుక్కున్న పోలీసుల సంఖ్య ఇదే కావడం గమనార్హం. ఈ వ్యవహారంలో ‘ట్రిపుల్‌ పి’ ఉందని ఆంధ్రజ్యోతి చెప్పింది అక్షర సత్యమని తేలింది. ‘సెటిల్‌మెంట్లు చేసే క్రమంలో కీలక నిందితుడు నరేంద్ర రెడ్డి కొందరు మీడియావారిని సంప్రదించారు’ అని డీఎస్పీ శ్రీనివాసులు స్పష్టంగా చెప్పారు. దీంతో ‘తేనె’ రుచి చూసిన విలేకరులపై కేసులు ఉంటాయా, వదిలేస్తారా అన్న చర్చ మొదలైంది.

దొరికిపోయిన గ్యాంగ్‌ లీడర్‌

హనీట్రాప్‌ కేసులో కీలక నిందితుడు, రుద్రంపేట మాజీ ఉప సర్పంచ కనుముక్కల నరేంద్రరెడ్డిని, మరో నిందితుడు పొత్తూరు ఓం ప్రకా్‌షను పోలీసులు అరెస్టు చేశారు. హనీట్రాప్‌ కేసులో బాధితుడిగా, బాధితులకు తోడుగా నిలిచిన వ్యక్తిగా కనిపించాలని చూసిన నరేంద్రరెడ్డి, చివరకు గ్యాంగ్‌ లీడర్‌ అని తేలింది. హనీట్రాప్‌ కేసులలో ఏ1గా ఉన్న చిన్ని అలియాస్‌ రంగమ్మ నాయుడును టార్గెట్‌ చేయాలని, ఒక ఎపిసోడ్‌ నడపాలని నరేంద్ర రెడ్డి చూశాడు. తాను తీసిన గోతితో తానే పడ్డాడు. ఇద్దరు నిందితులను పోలీసులు సోమవారం రాత్రి రిమాండ్‌కు తరలించారు.

బెదిరింపులు.. సెటిల్‌మెంట్లు..

రంగమ్మ నాయుడు, మల్లీశ్వరి గ్యాంగ్‌లలో నరేంద్రరెడ్డి క్రియాశీలక సంబంధాలు కొనసాగించాడని రూరల్‌ డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. ఈ కేసుల వివరాలను ఆయన విలేకరులకు సోమవారం వివరించారు. ఇద్దరి గ్యాంగ్‌ల ట్రాప్‌లో చిక్కుకున్న బాధితులకు నరేంద్రరెడ్డి ఫోన చేస్తాడని, పంచాయితీ పెడతాడని తెలిపారు. బలవంతంగా డబ్బులు వసూలు చేయడంతోపాటు సెటిల్‌మెంట్లు కూడా చేయడంలో నరేంద్ర రెడ్డి పాత్ర ఉన్నట్లు గుర్తించామని అన్నారు. ఈ గ్యాంగ్‌ సభ్యులకు సమస్యలు వచ్చినపుడు నరేంద్ర రెడ్డి కొందరు మీడియా ప్రతినిధులతో సంప్రదింపులు జరిపి, సెటిల్‌మెంట్లు కూడా చేశాడని వివరించారు. ఈ నేరాలలో రంగమ్మ స్కార్పియో డ్రైవర్‌, బంధువు పొత్తూరు ఓం ప్రకాష్‌ ప్రమేయం కూడా ఉందని, అందుకే అతన్ని కూడా అరెస్టు చేశామని అన్నారు.

డబుల్‌ నవరత్నాలు..!

హనీట్రాప్‌ కేసులో తొలివిడతలో ఐదుగురు నిందితులు.. చిన్ని అలియాస్‌ రంగమ్మ నాయుడు, దబ్బర రాజేష్‌, జయలక్ష్మి, చంద్రకళ, అనంత కుమారిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఆ తర్వాత ఈ నెల 26న ఉమాదేవి, ఉదయ్‌ భాస్కర్‌ని, తాజాగా నరేంద్ర రెడ్డి, ఓంప్రకా్‌షని అరెస్టు చేశారు. ఇలా 9 మంది నిందితులు జైలుకు వెళ్లారు. ఈ వ్యవహారంలో డిస్మిస్‌, సస్పెన్షన, వీఆర్‌, సరెండర్‌ అయిన పోలీసు అధికారులు, సిబ్బంది సంఖ్య కూడా తొమ్మిది కావడం గమనార్హం. ఒక సీఐ, ఒక హెడ్‌కానిస్టేబుల్‌, ఇద్దరు కానిస్టేబుళ్లను ఉద్యోగం నుంచి తొలగించారు. ఒక ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేశారు. ఇద్దరు సీఐలను కర్నూలు డీఐజీకి అటాచ చేశారు. వైసీపీ నేత నరేంద్ర రెడ్డి కీలకంగా వ్యవహరించిన హనీట్రా్‌ప వ్యవహారంలో ‘డబుల్‌ నవరత్నాలు’ తేలారన్న కామెంట్స్‌ వైరల్‌గా మారాయి. నరేంద్రరెడ్డి అరెస్టుతో ఈ కేసు దర్యాప్తు చివరి అంకానికి చేరినట్లు పోలీసువర్గాలు భావిస్తున్నాయి. కానీ, దర్యాప్తు మొదలయ్యాక పోలీసులను మరికొందరు బాధితులు ఆశ్రయిస్తున్నారని సమాచారం. ఇది ఇక్కడితో ఆగుతుందా, కుట్రలో ఇంకా ఎవరైనా తేలుతారా అన్నది వేచి చూడాల్సిందే.

వలపు వలలో మాస్టారు..!

అనంతపురం విద్య: హనీట్రాప్‌ ముఠా అరాచకాలు తవ్వేకొద్దీ బయట పడుతున్నాయి. బుక్కరాయసముద్రం మండలంలో పనిచేస్తున్న ఓ టీచర్‌ సైతం హానీట్రా్‌పలో చిక్కినట్లు తెలిసింది. ఆయనపై ముఠా సభ్యులు దాడి చేసి, రూ.4 లక్షలకు బాండ్‌ రాయించుకున్నారు. ఉపాధ్యాయ వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు, ఆ మండల పరిధిలోని ఓ గ్రామీణ పాఠశాలలో పనిచేస్తున్న ఓ టీచర్‌ హానీట్రా్‌పలో చిక్కారు. ఓ మహిళ ఆహ్వానం మేరకు ఆయన ఓ ఇంటికి వెళ్లారు. ఆ వెంటనే ముఠా సభ్యులు ఎంట్రీ ఇచ్చారు. ఆ టీచర్‌ను చితకబాది, భయాందోళనకు గురిచేశారు. రూ.4 లక్షలకు బాండ్‌ రాయించుకున్నారు. కానీ రెండు నెలలపాటు ఆయన డబ్బులు ఇవ్వకపోవడంతో ఆయన కోసం ముఠా వేట సాగించింది. డీఈవో కార్యాలయానికి వచ్చి ఆ టీచర్‌ పేరుచెప్పి ఎక్కడ పనిచేస్తున్నారని ఆరా తీసింది. విద్యాశాఖ సిబ్బంది ఇచ్చిన సమాచారం ఆధారంగా, ముఠా సభ్యులు కారులో పాఠశాలకు వెళ్లారు. టీచర్‌ను ఓ గదిలో కూర్చోబెట్టుకుని దుర్భాషలాడుతూ బెదిరించారు. దీంతో పాఠశాలలో ఉన్న ఇతర టీచర్లు షాక్‌కు లోనయ్యారు. అప్పు గొడవ అనుకుని, పాఠశాలలో ఇలా మాట్లాడడం సరికాదని సర్దిచెప్పడంతో ముఠా సభ్యులు వెళ్లిపోయారు. ఈ క్రమంలో హనీట్రాప్‌ ముఠాను పోలీసులు అరెస్టు చేయడం, వారి ఫొటోలు మీడియాలో రావడంతో ఆ స్కూల్‌ టీచర్లు చూసి అవాక్కయ్యారు. బాధిత మాస్టారును అడిగితే, తానూ హనీట్రాప్‌లో చిక్కానని, వచ్చింది ఆ ముఠానే అని చెప్పినట్లు తెలిసింది. తమ బంధువు పోలీసు శాఖలో పనిచేస్తున్నారని, ఆయనతో చెప్పించానని, అయినా ముఠా సభ్యులు వదలలేదని వాపోయినట్లు తెలిసింది.

Updated Date - Apr 28 , 2026 | 12:52 AM