ఫ్రూట్ కవర్లతో అధిక దిగుబడి
ABN , Publish Date - Feb 25 , 2026 | 12:26 AM
మామిడి పంటలో ఫ్రూట్ కవర్లను వినియోగించడం ద్వారా నాణ్యమైన.. అధిక దిగుబడి సాధించవచ్చని ఉద్యానవన శాఖ అధికారిని లావణ్య రైతులకు సూచించారు
ఓబుళదేవరచెరువు/అమడగూరు/నల్లచెరువు, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): మామిడి పంటలో ఫ్రూట్ కవర్లను వినియోగించడం ద్వారా నాణ్యమైన.. అధిక దిగుబడి సాధించవచ్చని ఉద్యానవన శాఖ అధికారిని లావణ్య రైతులకు సూచించారు. ఓబుళదేవరచెరువు, అమడగూరు, నల్లచెరువు మండలాల్లోని మామిడి రైతులకు ఆమె మంగళవారం అవగాహన కల్పించారు. మామిడి పిందెలు, కాయలకు ఫ్రూట్ కవర్లను తొడగడం వల్ల తేనెమంచు పురుగు, తామరపురుగు, పండుఈగ నుంచి రక్షణ లభిస్తుందన్నారు. అలాగే అధిక సూర్యరశ్మి, దుమ్మూ ధూళీ, కాయ రాలడం వంటివి నివారించవచ్చన్నారు. పిందె నిమ్మకాయ పరిమాణంలో ఉన్నప్పుడు కాయను కవర్లో పెట్టి కట్టాలన్నారు. ఇలా చేయడం వల్ల కాయకు ఉండే సహజలక్షణాలు, కాయ సైజు, సహజ రంగు పెరుగుతుందన్నారు. వీటికి ఉద్యానశాఖ ఒక రైతుకు గరిష్టంగా 3000 కవర్లను 50 శాతం రాయతీతో రూ.30 వేలకు అందిస్తోందని, రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.