Share News

ప్రగతి బాటలో గడేకల్లు

ABN , Publish Date - Feb 13 , 2026 | 12:18 AM

మండలంలోని గడేకల్లు గ్రామం ప్రగతి బాటలో పరుగులు తీస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయంలో ఆ గ్రామం సమస్యలకు నిలయమై.. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది

ప్రగతి బాటలో గడేకల్లు
నూతన విద్యుత సబ్‌స్టేషన

విడపనకల్లు, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): మండలంలోని గడేకల్లు గ్రామం ప్రగతి బాటలో పరుగులు తీస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయంలో ఆ గ్రామం సమస్యలకు నిలయమై.. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది. కూటమి ప్రభుత్వం రాక.. మంత్రి పయ్యావుల కేశవ్‌ ప్రత్యేక చొరవతో ప్రస్తుతం ఈ గ్రామంలో సమస్యలు పరిష్కారం కావడంతో పాటు రూ. కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ గ్రామంలో రూ.40 లక్షలతో వివిధ కాలనీల్లో సీసీ రోడ్లు వేయించారు. రూ. 8లక్షలతో కొండపై మంచి నీటి ట్యాంక్‌ను ఏర్పాటు చేసి బీసీ, కొండ మీద కాలనీలకు తాగు నీటి సమస్యను తీర్చారు. జల్‌జీవన పథకం కింద ఇంటింటికి కొలాయిలు వేయించారు. రూ.13లక్షలతో ఎస్సీ బాలుర హాస్టల్‌ను రీ మోడలింగ్‌ చేయించి విద్యార్థులకు మంచి సౌకర్యాలు కల్పించారు. నూతన సబ్‌స్టేషనను ప్రారంభించి.. గడేకల్లు ఫీడర్‌ కింద ఉన్న దాదాపుగా 3వేల మంది రైతులకు విద్యుత సమస్య తీర్చారు. రూ.పది లక్షలతో 63వ జాతీయ రహదారికి ఇరువైపులా కంప చెట్లు తొలగించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టారు. గడేకల్లు బస్టాండ్‌లో ఎనిమిదేళ్లుగా నిలిచిపోయిన జాతీయ రహదారి రోడ్డు పనులను పూర్తి చేయించారు. కొండ కింద ఉన్న శ్మశాన వాటికలో ఊటనీరు రాకుండా మంత్రి సొంత నిధులతో దాదాపు కిలోమీటర్‌ వరకు డ్రైనేజి ఏర్పాటు చేయించి.. సమస్యను పరిష్కరించారు. గ్రామంలోని వీధుల్లో సుమారు 50 విద్యుత దీపాలను ఏర్పాటు చేశారు. రూ.20 లక్షలతో ఎనిమిది మంది రైతులకు గోకులం షెడ్లను నిర్మించారు. అంగనవాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు నిర్మించారు. ఈ అభివృద్ధి పనులపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Feb 13 , 2026 | 12:18 AM