20 నుంచి సీపీఐ దీక్షలు
ABN , Publish Date - Feb 16 , 2026 | 12:14 AM
రాగులపాడు నుంచి పిల్లకాలువల ద్వారా గుంతకల్లు, ఉరవకొండ మండలాలకు కృష్ణ జలాలు తరలించేందుకే నిధులు కేటాయించాలని ఈనెల 20 నుంచి దీక్షలు చేపడుతున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డీ జగదీష్, రైతు సంఘం నాయకులు తెలిపారు.
గుంతకల్లుటౌన, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): రాగులపాడు నుంచి పిల్లకాలువల ద్వారా గుంతకల్లు, ఉరవకొండ మండలాలకు కృష్ణ జలాలు తరలించేందుకే నిధులు కేటాయించాలని ఈనెల 20 నుంచి దీక్షలు చేపడుతున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డీ జగదీష్, రైతు సంఘం నాయకులు తెలిపారు. స్ధానిక బీరప్ప స్వామి కళ్యాణ మండపంలో రైతు సంఘం నాయకులతో ఆదివారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. 2017 ఏప్రిల్ 20న పామిడిలో బహిరంగ సభలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు గుంతకల్లు మండలంలోని చెరువులన్నింటికీ హంద్రీనీవా కాలువ ద్వారా కృష్ణజలాలు మళ్లించేందుకు కాలువలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అనంతరం అధికారంలోకి వచ్చిన జగన భూసేకరణ, కాలువ నిర్మాణాలకు నిధులు కేటాయించలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో వీటి కోసం నిధులు కేటాయించాలని స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రతి రోజు ఒక గ్రామానికి చెందిన రైతులు దీక్ష చేస్తారన్నారు. కార్యక్రమంలో దోనిముక్కల సర్పంచు శ్రీరాములు, టీడీపీ రైతు సంఘం నాయకులు పాలమల్లికార్జున, జడ్పీటీసీ కదిరప్ప, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరభద్రస్వామి, మండల కార్యదర్శి రాము, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.