Share News

యథేచ్ఛగా కాపర్‌ చోరీలు

ABN , Publish Date - Jan 12 , 2026 | 11:43 PM

గతంలో పొలాల్లోని డ్రిప్పులు, స్పింక్లర్లను చోరీ చేసే దొంగలు.. నేడు రూట్‌ మార్చారు. సులువుగా.. అధికంగా డబ్బులు సంపాదించేందుకు ట్రాన్సఫార్మర్లలోని రాగిని చోరీ చేస్తున్నారు.

యథేచ్ఛగా కాపర్‌ చోరీలు
దాసంపల్లి వద్ద దుండగులు ధ్వంసం చేసిన ట్రాన్సఫార్మర్‌

కళ్యాణదుర్గం, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): గతంలో పొలాల్లోని డ్రిప్పులు, స్పింక్లర్లను చోరీ చేసే దొంగలు.. నేడు రూట్‌ మార్చారు. సులువుగా.. అధికంగా డబ్బులు సంపాదించేందుకు ట్రాన్సఫార్మర్లలోని రాగిని చోరీ చేస్తున్నారు. పొలాల్లో రైతులు ఏర్పాటు చేసుకున్న, బహిరంగ ప్రదేశాల్లోని ట్రాన్సకో శాఖ ఏర్పాటు చేసిన ట్రాన్సఫార్మర్లనే లక్ష్యం చేసుకొంటూ యథేచ్ఛగా చోరీలకు పాల్పడుతున్నారు. ట్రాన్సఫార్మర్లను ధ్వంసం చేసి అందులోని రాగిని ఎత్తుకొని వెళ్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో రాగి కడ్డీ విలువ సుమారు రూ. 1000 ఉంది. ఒక కొత్త ట్రాన్సఫార్మర్‌ను తయారు చేయాలంటే కెఫాసిటీని బట్టి రూ.30 వేలు నుంచి రూ.45 వేలు వరకు ఖర్చు అవుతుంది. అదే ట్రాన్సఫార్మర్‌ను పగులకొట్టి అందులో ఉన్న కాఫర్‌ వైర్‌ను ఎత్తుకెళ్లి విక్రయిస్తే కేవలం రూ. 12 వేలు నుంచి రూ. 15 వేలు వరకు మాత్రమే వస్తుంది. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వారికి కంటి మీద కునుకు లేకుండా పోతోంది.

వరుస చోరీలు..! : కళ్యాణదుర్గం మండలంలోని దాసంపల్లిలో ఇటీవల నలుగురు రైతుల పొలాల్లోని ట్రాన్సఫార్మర్‌ను ధ్వంసం చేశారు. కామక్కపల్లి ప్రాథమిక పాఠశాలలో సబ్‌ మోర్సిబుల్‌ మోటర్‌ను ఎత్తుకెళ్లారు. బోరంపల్లి, యర్రంపల్లి, దురదకుంట, భట్టువానిపల్లి గ్రామాల తోటల్లోని ట్రాన్సఫార్మర్లను పగులగొట్టి కాఫర్‌ వైరు ఎత్తుకెళ్లారు. కంబదూరు మండలంలో కుర్లపల్లి, అండేపల్లి గ్రామాలకు విద్యుత సరఫరా చేసే ట్రాన్సఫార్మర్‌ను దొంగలు దర్జాగా పగుల కొట్టి అందులోని రాగిని ఎత్తుకెళ్లారు. ఓబయ్యతోట సమీపంలో కూడా ట్రాన్సఫార్మర్‌నూ ధ్వంసం చేశారు. వీటిని అరికట్టేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. దీనిపై కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబును వివరణ కోరగా.. రాగి దొంగలపై పూర్తిస్థాయిలో నిఘా వేశామని, రైతులు, గ్రామస్థులు సహకరిస్తే వీటిని పూర్తి స్థాయిలో అరికట్టవచ్చని ఆయన అన్నారు.

Updated Date - Jan 12 , 2026 | 11:43 PM