విచ్చలవిడిగా కేబుల్ చోరీలు
ABN , Publish Date - Feb 13 , 2026 | 12:13 AM
సులభంగా దొంగతనాలు చేయడం ద్వారా అధికంగా డబ్బు పొందడంపై ఇటీవల దొంగలు దృష్టిసారించారు.
తాడిపత్రి, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): సులభంగా దొంగతనాలు చేయడం ద్వారా అధికంగా డబ్బు పొందడంపై ఇటీవల దొంగలు దృష్టిసారించారు. మార్కెట్లో ప్రస్తుతం రాగికి మంచి డిమాండ్ ఉంది. దీంతో పొలాల్లోని వ్యవసాయ బోర్లకు ఉన్న వైర్లను చోరీ చేసి.. అందులోని కాపర్‌ను అమ్ముకొని సులభంగా డబ్బులు సంపాదిస్తున్నారు. నియోజకవర్గంలోని తాడిపత్రి, పెద్దపప్పూరు, యాడికి, పెద్దవడుగూరు, యల్లనూరు, పుట్లూరు మండలాల్లో బోరుబావుల కింద ఎక్కువగా రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారు. మార్కెట్లో మీటర్ కేబుల్ గేజ్‌ను బట్టి రూ. 200 నుంచి రూ. 400 వరకు పలుకుతోంది. దీంతో పది మీటర్ల వైర్ చోరీ చేసినా.. వేలాది రూపాయలు వస్తున్నాయి. దీంతో దొంగలు ఒక గ్రామంలో కనీసం 500 మీటర్ల కేబుల్‌ను చోరీ చేస్తున్నారు. దాన్ని రూ. 15 వేల నుంచి రూ. 20 వేలకు విక్రయించి జల్సా చేసుకొంటున్నారు. అదే కేబుల్‌ను రైతు మళ్లీ కొనాలంటే రూ. 50 వేల పెట్టుకోవాల్సి వస్తోంది. ఇలా రెండు, మూడు నెలలకు ఓ సారి చోరీ జరుగుతుండటంతో రైతులు రూ. లక్షల్లో నష్టపోతున్నారు. పంటలను కాపాడుకోవడానికి అప్పులు చేసి.. మరీ కేబుల్ కొంటున్నాడు. కేబుల్ దొంగతనాలను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని పలుమార్లు పోలీసులను విజ్ఞప్తి చేసినా.. వారు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని బాధిత రైతులు వాపోతున్నారు.