కూతురు పుడితే 10 వేలు!
ABN , Publish Date - Nov 22 , 2026 | 01:21 AM
సర్పంచ్‌గా తనను గెలిపిస్తే.. పంచాయతీ పరిధిలో ఎవరికి కూతురు పుట్టినా రూ.10 వేలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయిస్తానంటూ ఓ అభ్యర్థి ఇచ్చిన హామీ ఆకర్షిస్తోంది
అనంతలో సర్పంచ్ అభ్యర్థి ఎన్నికల హామీ
ప్రజలకు అగ్రిమెంట్ రాసిచ్చిన వైనం
బొమ్మనహాళ్, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): సర్పంచ్‌గా తనను గెలిపిస్తే.. పంచాయతీ పరిధిలో ఎవరికి కూతురు పుట్టినా రూ.10 వేలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయిస్తానంటూ ఓ అభ్యర్థి ఇచ్చిన హామీ ఆకర్షిస్తోంది. అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలంలోని నేమకల్లు పంచాయతీ ఎన్నికల బరిలో దిగిన కురుబ భాగ్య.. తన ఎన్నికల హామీలకు గ్యారెంటీ ఇస్తూ రూ.10 బాండ్ పేపర్‌పై అగ్రిమెంట్ రాసిచ్చారు. ఏ ఒక్క హామీ నెరవేర్చకపోయినా పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. పోటీ గట్టిగా ఉండడంతో భాగ్య గెలుపు కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా నేమకల్లు ఆంజనేయస్వామి సాక్షిగా ‘ప్రజాసేవ హామీ పత్రం’ పేరుతో అగ్రిమెంట్ రాసిచ్చారు. గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారం, వీధి దీపాలు, విద్యార్థులకు బస్సు సౌకర్యం, పాడి రైతులకు మేత కోసం ఆర్థిక సాయం, గ్రంథాలయం ఏర్పాటు తదితర హామీలు ఇచ్చారు. ఈ ఒప్పందం పత్రంపై భాగ్య, ఆమె భర్త బసప్ప సంతకాలు చేశారు. సాక్షుల సంతకాలు తీసుకుని నోటరీ చేయించారు.