అమరావతిలో ‘పుంగోల్’
ABN , Publish Date - May 12 , 2026 | 05:51 AM
రాజధాని అమరావతిలో సింగపూర్‌లోని ఆధునిక పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌ను నిర్మిస్తామని రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి లోకేశ్ ప్రకటించారు.
సింగపూర్ తరహా టౌన్‌షిప్
దేశానికే రోల్ మోడల్‌గా నిర్మాణం
సింగపూర్ సహకారంతో అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి
ఆగ్నేయ ఆసియా దేశాలతో సులభతర వాణిజ్యం
అమరావతిలో నాలుగు కన్వెన్షన్ సెంటర్లకు ఓకే
విశాఖలో ప్రపంచ స్థాయి ‘మైస్’ సెంటర్
గ్లోబల్ ఈవెంట్ల గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దుతాం
ఏపీ-సింగపూర్ మధ్య పోర్టు ఆధారిత కారిడార్
సింగపూర్‌లో జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీతో లోకేశ్ భేటీ.. సీఐసీ సీఈవోతో చర్చలు
అమరావతి, మే 11(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో సింగపూర్‌లోని ఆధునిక పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌ను నిర్మిస్తామని రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి లోకేశ్ ప్రకటించారు. ఇది ఆంధ్రప్రదేశ్‌కే కాకుండా దేశానికే ఓ రోల్ మోడల్ టౌన్‌షిప్‌గా నిలుస్తుందని చెప్పారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ఆయన సోమవారం అక్కడి వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలోని జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ (జేఐఎస్సీ) సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు సహాయం తీసుకుంటామని చెప్పారు. ఈ సమీకృత టౌన్‌షిప్ విధివిధానాల్లో వేగాన్ని పెంచాలని జాయింట్ ఇంప్లిమెంటేషన్ వర్కింగ్ కమిటీ (జేఐడబ్ల్యూసీ)ని కోరారు. సింగపూర్ సహకారంతో అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి చేయాలని భావిస్తున్నామని చెప్పారు. దీని అభివృద్ధికి ఆసక్తిగల భాగస్వాములను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్లు ఇచ్చామని తెలిపారు. అమరావతి రాజధానికి ఇప్పుడు చట్టబద్ధత ఉందని, ఇది అమరావతిలో పెట్టుబడులకు మదుపరులలో విశ్వాసాన్ని పెంచుతుందని వివరించారు. రాష్ట్రం నుంచి సింగపూర్ ద్వారా ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా మధ్య వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి గల అవకాశాలను పరిశీలించాలని కోరారు. సింగపూర్ సన్‌టెక్ సిటీ తరహాలో ఆంధ్రప్రదేశ్‌ను కూడా మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్ అండ్ ఎగ్జిబిషన్ (మైస్) గమ్యస్థానంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఉన్నామన్నారు. రాష్ట్రంలో రియల్‌టైమ్ గవర్నెన్స్‌ను బలోపేతం చేయడానికి సింగపూర్ అనుభవాన్ని ఉపయోగించుకుంటామని చెప్పారు.

సింగపూర్-ఏపీ మధ్య పటిష్ఠ భాగస్వామ్యం
సింగపూర్- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య ఇప్పుడు పటిష్ఠమైన భాగస్వామ్యం నెలకొందని లోకేశ్ అభిప్రాయపడ్డారు. భాగస్వామ్య ఒప్పందాల్లోని అంశాల అమలుపై వర్కింగ్ గ్రూపుల ద్వారా ప్రతినెలా సంప్రదింపులు జరుగుతున్నాయని వెల్లడించారు. రాష్ట్ర మంత్రులు ఆరుగురు రెండు వారాల క్రితం సింగపూర్-ఏపీ గవర్నెన్స్ ఎక్సలెన్స్ (ఎస్‌ఏజీఈ) కార్యక్రమంలో భాగంగా వారం రోజుల పాటు శిక్షణా తరగతులకు హాజరై పరిపాలనలో తమ అనుభవాలను పంచుకున్నారని వెల్లడించారు. రాష్ట్రానికి చెందిన 37 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా తాజాగా శిక్షణను పూర్తి చేసుకున్నారన్నారు. రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ మోడల్ టౌన్‌షి్‌ప, అమరావతి ఎకనామిక్ రీజియన్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్/రియల్ టైమ్ గవర్నెన్స్‌పై గత నవంబరులో సింగపూర్ ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహనా ఒప్పందం కుదుర్చుకుందని వివరించారు. ఈ ఎంవోయూ పురోగతిని నిరంతరం సమీక్షించేందుకు జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశారన్నారు. ఈ భేటీలో సింగపూర్ వాణిజ్య, పరిశ్రమలు, విదేశాంగ మంత్రి గాన్ సియో హువాంగ్, సీనియర్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ చోంగ్, సింగపూర్ కో-ఆపరేటివ్ ఎంటర్‌ప్రైజ్ డిప్యూటీ చీఫ్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టే లియాన్ చూ, ఎంటర్ ప్రైజెస్ సింగపూర్ సౌత్ ఆసియా డెవల్‌పమెంట్ డైరెక్టర్ ఆడ్రీ టాన్, భారత హైకమిషనర్ శిల్పక్ అంబులే, రాష్ట్ర ఆర్థిక ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ ఈవెంట్ల అనుమతులు
ఏపీని ప్రపంచస్థాయి మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్ అండ్ ఎగ్జిబిషన్ (మైస్) కేంద్రంగా మార్చడమే లక్ష్యమని లోకేశ్ వెల్లడించారు. సింగపూర్ సన్‌టెక్ సిటీని సందర్శించి.. డీపీ అర్బన్ ఆర్కిటెక్ట్ సంస్థ డైరెక్టర్ ఆనందన్ కరుణాకరన్‌తో భేటీ అయ్యారు. అంతర్జాతీయ స్థాయి ఈవెంట్ల కేంద్రంగా ఏపీని మార్చేందుకు డెడికేటెడ్ మైస్ పాలసీ రూపొందిస్తున్నామని ప్రకటించారు. అంతర్జాతీయ ఈవెంట్ నిర్వాహకులకు సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇస్తామన్నారు. విశాఖపట్నం, అమరావతి, తిరుపతిలలో ప్రత్యేక బ్యూరోలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
పోర్టు వాణిజ్య కారిడార్ ప్రారంభించండి
సింగపూర్-ఏపీ మధ్య పోర్టు ఆధారిత వాణిజ్య కారిడార్‌ను ప్రారంభించాలని కమోడిటీస్ ఇంటెలిజెన్స్ సెంటర్ (సీఐసీ) సీఈవో గ్లోరియా డూను లోకేశ్ కోరారు. ప్రపంచంతో ఏపీ వాణిజ్య అనుసంధానానికి సహకారం కోరారు. ప్రపంచవ్యాప్తంగా ఎగుమతులు పెంచాలనే లక్ష్యంతో ప్రస్తుతం పోర్టు ఆధారిత పారిశ్రామిక అభివృద్ధిపై దృష్టిపెట్టామని చెప్పారు. కాగిత రహితంగా, పారదర్శకతతో కూడిన ఎగుమతుల కోసం సీఐసీ బ్లాక్‌చెయిన్ ప్లాట్‌ఫాంతో సింగపూర్ నుంచి విశాఖ లేదా కృష్ణపట్నం మధ్య ఓ పైలట్ డిజిటల్ కారిడార్‌ను ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. గుంటూరు మిర్చితో పాటు ఇతర సరుకుల ఎగుమతులకు ఉన్న అవకాశాలను గుర్తించేందుకు ఎగుమతిదారులు, సీఐసీ, ఎంటర్‌ప్రైజ్ సింగపూర్, ఎస్‌జీఎక్స్‌లతో కలసి ఏపీ-సింగపూర్ జాయింట్ కమోడిటీ ట్రేడ్ రౌండ్ టేబుల్‌ను నిర్వహించాలని ప్రతిపాదించారు. లోకేశ్ ప్రతిపాదనలు పరిశీలిస్తామని సీఐసీ ప్రతినిధులు చెప్పారు.
పుంగోల్ ప్రాముఖ్యం ఇదీ
సింగపూర్ ఈశాన్య ప్రాంతంలో మొట్టమొదటి సారిగా స్మార్ట్, సుస్థిరమైన పుంగోల్ డిజిటల్ డిస్ట్రిక్ట్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఇది సింగపూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో జేటీసీ బిజినెస్ పార్కులను అనుసంధానిస్తుంది. సైబర్ సెక్యూరిటీ, ఏఐ, రోబోటిక్స్‌కు పుంగోల్ టెక్ హబ్‌గా పనిచేస్తుంది. పరిశ్రమలు, విద్యాసంస్థలు, పచ్చని వాతావరణాన్ని మేళవించడం ద్వారా 28 వేల ఉద్యోగాలను సృష్టించడం లక్ష్యంగా దీనిని 2025లో ప్రారంభించారు. ఈ ఎకో టౌన్‌లో గ్రీన్ బిల్డింగ్‌లు, నీటి సంరక్షణ పద్ధతులు, ఆధునికంగా వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలు ఉన్నాయి. శక్తి వినియోగాన్ని, స్మార్ట్ పరిష్కారాలకు దీనిని ఓ లివింగ్ ల్యాబ్‌గా రూపొందిస్తున్నారు. ఇక్కడి పార్కులు, రెస్టారెంట్లు, తీర ప్రాంతంలోని ఆహ్లాదకర వాతావరణం సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తోంది. మెట్రో రైళ్లు, అధునాతన రోడ్ల ద్వారా దేశంలోని ఇతర ప్రాంతాలకు సులువుగా చేరుకోవచ్చు. ఒకప్పుడు మత్స్యకారుల గ్రామంగా ఉన్న పుంగోల్ ఇప్పుడు ఆధునిక జీవనానికి నమూనాగా నిలుస్తోంది.