ప్రపంచస్థాయి నగరంగా అమరావతి
ABN , Publish Date - Sep 24 , 2026 | 04:29 AM
‘ప్రపంచ స్థాయి జీవన ప్రమాణాలకు వేదికగా ప్రజా రాజధాని అమరావతి ఉండబోతోంది. అమరావతిలో హెల్త్‌కేర్ ఎకో సిస్టమ్‌ను రూపొందిస్తున్నాం. ఎయిమ్స్, బసవతారకం క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్, ఎల్‌వీపీ వంటి సంస్థలతో అందరూ ఆరోగ్యం కోసం అమరావతికి వస్తారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.
అత్యుత్తమ జీవన ప్రమాణాలకు వేదిక
ఇక్కడ హెల్త్ ఎకో సిస్టం రూపొందిస్తున్నాం
వైద్యం కోసం ప్రజలు ఇక్కడికే వస్తారు: సీఎం
ఎల్వీప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌కు భూమిపూజ
గుంటూరు(రాజధాని), సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): ‘ప్రపంచ స్థాయి జీవన ప్రమాణాలకు వేదికగా ప్రజా రాజధాని అమరావతి ఉండబోతోంది. అమరావతిలో హెల్త్‌కేర్ ఎకో సిస్టమ్‌ను రూపొందిస్తున్నాం. ఎయిమ్స్, బసవతారకం క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్, ఎల్‌వీపీ వంటి సంస్థలతో అందరూ ఆరోగ్యం కోసం అమరావతికి వస్తారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. రాజధాని పరిధిలోని అబ్బరాజుపాలెంలో బుధవారం ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ భూమి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కంటి వైద్యరంగంలో దేశంలోనే తొలిస్థానం, ఆసియాలో రెండో స్థానం, ప్రపంచంలో 6వ స్థానంలో ఉన్న ఎల్‌వీపీఐ ఇన్‌స్టిట్యూట్ అమరావతికి రావడం అభినందనీయమని సీఎం అన్నారు. అమరావతిలో ప్రత్యేకంగా ఐ అండ్ బ్రెయిన్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయడం శుభపరిణామమని చెప్పారు. సంస్థ చైర్మన్ జీఎన్ రావు చిత్తశుద్ధి, అంకితభావాన్ని అభినందించారు. 2027 డిసెంబరుకి సంస్థ నిర్మాణాన్ని పూర్తి చేసి ఏటా 3 లక్షల మందికి సేవలు అందించాలని కోరారు. సంస్థ నిర్మాణానికి ముందుకు వచ్చిన జాస్తి వెంకట్, సుధా దంపతులను అభినందించారు. ‘‘అమరావతి క్వాంటమ్- బయో వ్యాలీగా అవతరించబోతోంది. ప్రపంచంలో ఉన్న ఆరు క్వాంటమ్ కంప్యూటర్లలో ఒకటి అమరావతిలో ఉంటుంది. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా ఉండబోతోంది.’’ అని సీఎం వివరించారు.
ప్రపంచం మెచ్చే నగరం
నేడు అమరావతి పేరు దేశమంతటా మారుమోగిపోతోంది. మొన్న లద్దాక్‌లో ఓ చిన్నారి అమరావతి గురించి చెప్పడం, నిన్న నయారాయ్‌పూర్‌లోనూ అమరావతి గురించి మాట్లాడటం.. చూస్తే ఎక్కడికి వెళ్లినా ప్రజారాజధాని అమరావతి పేరు వినిపిస్తోంది. రేపు ప్రపంచం మెచ్చే నగరంగా అవతరిస్తుందనడంలో నాకెలాంటి సందేహం లేదు. రాజధాని నగరానికి ఐదు సూత్రాలు పెట్టుకున్నాం. నో పోల్ సిటీ. అంటే విద్యుత్, టెలిఫోన్ స్తంభాలు ఉండవు. రెండోది బ్లూ సిటీ.. సంపూర్ణ నీటి సదుపాయం.. మూడోది గ్రీన్ సిటీ.. 50 శాతం గ్రీన్ బెల్ట్ కింద పెట్టాం. నాలుగోది గ్రీన్‌ఎనర్జీ సిటీ..అమరావతిలోనే విద్యుత్ తయారు చేసుకుంటాం. ఐదో సూత్రం డీప్ టెక్.. దేశంలోనే మొదటి క్వాంటమ్ కంప్యూటర్ అమరావతిలో ఉంటోంది.