బుద్ధిలేని రాతల బుర్రలేని యాక్‌ఛీ!
ABN , Publish Date - May 12 , 2026 | 05:04 AM
జగన్ నడిపేది తెలుగు పత్రిక! కానీ... దాని బుర్ర నిండా తెగులే! అక్షరాలా చిమ్మేది బురదే! దీనికి తాజా ఉదాహరణ... సోమవారం ప్రచురించిన ‘సీఎం సన్నిహితులకేనా జాక్‌పాట్?’ కథనం! అందులో...
అమరావతిలో ప్లాట్ల కేటాయింపుపై జగన్ పత్రిక విషం
‘జాక్‌పాట్’ అంటూ రైతులను రెచ్చగొట్టేలా తప్పుడు రాతలు
‘ఆంధ్రజ్యోతి’ ఎండీ కుమారుడు, కుమార్తెకు ప్లాట్లపై తప్పుడు కథనం
బైపాస్ పక్కనే, ఎస్‌ఆర్‌ఎం ఎదురుగా అంటూ వక్రీకరణ
300 మీ., ఓ కిలోమీటరు దూరంలో ఉన్నా ‘పక్కనే, ఎదురుగా’నేనట
మేనేజ్ చేయగలిగితే కోర్ క్యాపిటల్‌లోనే ప్లాట్లు పొందొచ్చుగా!
ప్లాట్ల కేటాయింపుల్లో పక్కాగా వ్యవహరించిన సీఆర్డీయే
పూర్తి పారదర్శకంగా, టెక్నాలజీతో లాటరీ ప్రక్రియ
పక్కనే అంటే... అర్థం ఏమిటి? మీ పక్కింట్లో ఎవరుంటారంటే... ఎక్కడో ఆరు వీధుల అవతలున్న వారి పేరు చెబుతారా?ఎదురుగా అంటే ఏమిటి? మీ ఇంటికి ఎదురుగా ఏముందంటే... ఎక్కడో ఏడు వరుసల అవతలున్న బిల్డింగ్ పేరు చెబుతారా?
కనీస పరిజ్ఞానం, అవగాహన ఉన్న వారెవరూ అలా చెప్పరు. కానీ.. బుర్రలేని ‘యాక్ ఛీ’ పత్రిక మాత్రం అలా చెబుతుంది. ‘సీఎం సన్నిహితులకేనా జాక్‌పాట్’ శీర్షికన బుద్ధిలేని రాతలు రాసేసింది. తొలిదశ భూసమీకరణ నుంచి ప్రతి సందర్భంలోనూ రాజధాని రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెస్తూ, పరిష్కారానికి ప్రయత్నిస్తున్న ‘ఆంధ్రజ్యోతి’పై అదే రైతుల్లో వ్యతిరేకత తెచ్చేందుకు ఒక పిచ్చి ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో తన వెర్రితనాన్ని, ‘ఆంధ్రజ్యోతి’ యాజమాన్యంపై తన అక్కసును బయటపెట్టుకుంది.
(గుంటూరు (రాజధాని)/మంగళగిరి-ఆంధ్రజ్యోతి)
జగన్ నడిపేది తెలుగు పత్రిక! కానీ... దాని బుర్ర నిండా తెగులే! అక్షరాలా చిమ్మేది బురదే! దీనికి తాజా ఉదాహరణ... సోమవారం ప్రచురించిన ‘సీఎం సన్నిహితులకేనా జాక్‌పాట్?’ కథనం! అందులో... ‘ఆంధ్రజ్యోతి’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వేమూరి ఆదిత్య, డైరెక్టర్ అనూషకు జాక్‌పాట్ తగిలిందంటూ పిచ్చి కథనం ప్రచురించారు. ‘ఎదురు’గా అంటే ఏమిటి... ‘పక్కనే’ అంటే ఏమిటో కూడా తెలియకుండా బుర్రతిరుగుడు రాతలు రాశారు. రాజధాని ప్రాంతంలో వందలమంది భూములు కొనుగోలు చేశారు. వారిలో... ఆదిత్య, అనూష కూడా ఉన్నారు. 2015 అక్టోబరులో రాజధానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయగా... 2016లో, అంటే రాజధానిపై ప్రకటన వెలువడిన తర్వాతే రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారు. నిబంధనల ప్రకారం వారికి రెసిడెన్షియల్, కమర్షియల్ ప్లాట్లను లాటరీ ద్వారా సీఆర్డీయే కేటాయించింది. ఇందులో అక్రమం జరిగిందని, ‘జాక్‌పాట్’ తగిలిందని, కీలకమైన ప్లాట్లు వచ్చేశాయని ‘యాక్ ఛీ’ పత్రిక అక్షరాలా వాంతికి చేసుకుంది. ‘యాక్ ఛీ’ పత్రిక రాసిందేమిటీ... అసలు వాస్తవాలేమిటి?


అంతా నిబంధనల ప్రకారమే...
రాజధాని కోసం భూములు ఇచ్చిన వారికి రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు విషయంలో సీఆర్డీయే పక్కా గా వ్యవహరించింది. ఏ రెవెన్యూ గ్రామ పరిధిలో భూ మి ఇచ్చారో ఆ గ్రామ రెవిన్యూ పరిధిలోనే రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తారు. ఒకవేళ ఆ గ్రామ పరిధిలో భూమి అందుబాటులో లేకపోతే... ఐదు కిలోమీటర్ల పరిధిలో మరెక్కడైనా ప్లాట్లు కేటాయిస్తారు. వేమూరి ఆదిత్య, అనూషలకూ రిటర్నబుల్ ప్లాట్లు అలాగే లాటరీలో వచ్చాయి. వేమూరి ఆదిత్య, అనూష 5.39 ఎకరాలను నీరుకొండ గ్రామ పరిధిలో ఇచ్చారు. కమర్షియల్ ప్లాట్లు నీరుకొండ పరిధిలోనే వచ్చాయి. నీరుకొండలో 470 ఎకరాల్లో జలాశయాన్ని ఏర్పాటు చేస్తుండటం, పర్యాటక హబ్‌గా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించడంతో ఆ గ్రామ పరిధిలో భూమి విస్తీర్ణత తగ్గింది. దీంతో... అక్కడ రెసిడెన్షియల్ ప్లాట్లు దక్కాల్సిన చాలామందికి ప్లాట్లు అందుబాటులో ఉన్న ఇతర గ్రామాల పరిధిలో వచ్చాయి. వారిలో ఆదిత్య, అనూష కూడా ఉన్నారు. దీనిని కూడా ‘యాక్ ఛీ’ పత్రిక వక్రీకరించింది. దీని వెనుక అయాచిత లబ్ధి చేకూరిందన్నట్లుగా చిత్రీకరించింది. అలాగే... రెసిడెన్షియల్ ప్లాట్ల రూపకల్పనలో ఏపీసీఆర్డీయే కొన్ని విధానాలను రూపొందించింది. వాటి ప్రకారం ఒకే విస్తీర్ణంలో ఉండే ప్లాట్లన్నీ ఒక చోట ఉంటాయి. నవులూరు- యర్రబాలెం పరిధిలో వేసిన లే అవుట్లో 1500 చదరపు గజాల ప్లాట్లు వేశారు. నిబంధనలు, అర్హతల ప్రకారం ఆదిత్య, అనూషలకు లాటరీలోనే ఈ ప్లాట్లు దక్కాయి. నిజానికి, ఈ రెండు ప్లాట్ల సమీపం నుంచే కొండవీటి వాగు వెళుతోంది. ఒకరకంగా చెప్పాలంటే... ఇది పెద్ద ప్రతికూలత!
రెచ్చగొట్టడమే అసలు లక్ష్యం
‘రాజధాని రైతులకు వాగులు, వంకలు, ముంపు భూముల్లో ప్లాట్లు కేటాయించి... కావాల్సిన వారికి మాత్రం విలువైన ప్లాట్లు కట్టబెట్టారంటూ జగన్ పత్రిక నీచ రాతలు రాసింది. అసలు వాస్తవం ఏమిటంటే... అమరావతి మాస్టర్‌ప్లాన్‌లో చెరువులు, వాగులు, తీర ప్రాంతాలను ‘నో డెవల్‌పమెంట్ జోన్లు’గా ప్రకటించారు. ఆ ప్రాంతాల్లో ఎలాంటి లేఅవుట్‌లు వేయలేదు. వాటన్నింటినీ బఫర్ జోన్లుగానో, గ్రీన్ జోన్లుగానో ప్రభుత్వం వినియోగిస్తుంది. అయినా సరే... కేవలం రైతులను రెచ్చగొట్టడమే లక్ష్యంగా యాక్ ఛీ పత్రిక తప్పుడు ప్రచారానికి దిగింది.
కోర్ క్యాపిటల్‌లోనే తీసుకోవచ్చు కదా?
నిజంగానే ‘ఆంధ్రజ్యోతి’ యాజమాన్యం ప్రభుత్వాన్ని మేనేజ్ చేసి, ‘జాక్‌పాట్’ కొట్టాలనుకుంటే... ఎక్కడెక్కడో ఎందుకు, ‘కోర్ క్యాపిటల్’లోనే ప్లాట్లు తీసుకోవచ్చు కదా!? కీలకమైన రాయపూడి, నేలపాడు, తుళ్లూరు, వెలగపూడి వంటి కీలక ప్రాంతాల్లో కాదని... కోర్ క్యాపిటల్‌కు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్లాట్లు ఎందుకు తీసుకుంటారు? వేమూరి ఆదిత్య, అనూషలకు వచ్చిన రిటర్నబుల్ ప్లాట్లలో ఏవీ కీలకమైన ప్రాజెక్టులకు ఎదురుగా, పక్కన లేవు. ఈ ప్లాట్లు ఉన్న కురగల్లు, నవులూరు, యర్రబాలెంలలో చదరపు గజం రూ.25వేలు- 30వేలు మధ్యే పలుకుతోంది. అదే కోర్ క్యాపిటల్ ప్రాంతంలో చదరపు గజం రూ.50వేల నుంచి 60వేలు పలుకుతోంది.
గోల్‌మాల్‌కు అవకాశమే లేదు...
రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపులో సీఆర్డీయే అత్యంత పారదర్శకమైన విధానాన్ని అవలంబిస్తోంది. ‘మేనేజ్’ చేసే అవకాశమే లేదు. పూర్తి కంఫ్యూటరైజ్డ్, ర్యాండమైజేషన్ సాఫ్ట్‌వేర్, థర్డ్‌పార్టీ ఆడిట్, పూర్తి వీడియోగ్రఫీ మధ్య లాటరీ తీస్తారు. ఇంత పకడ్బందీ వ్యవస్థను ‘జాక్‌పాట్’ అంటూ తప్పుపట్టడమా... ‘యా క్ ఛీ’ అని రైతులు ఈసడించుకుంటున్నారు. అసలు విషయం ఏమిటంటే... రిటర్నబుల్ కేటాయింపుల నిబంధనలు 2015లోనే రూపొందించారు. 2018లోనే లాటరీలో రిటర్నబుల్ ప్లాట్ల ప్రక్రియ పూర్తయింది. ఎక్కడైనా తేడా జరిగితే ఇన్నేళ్లు దాచి ఉంచడం సాధ్యమేనా? అన్యాయం జరిగిన రైతులు ఊరుకుంటారా?
వీరందరికీ ‘జాక్‌పాట్’ తగిలినట్లేనా?
రాజధాని పరిధిలో వెస్ట్ బైపాస్ రహదారి ఐదారు కిలోమీటర్లు వెళుతుంది. ఆ దారి వెంట అటూ ఇటూ కొన్ని వందలు, లేదా వేలమందికి లాటరీలో ప్లాట్లు వచ్చాయి. మరి... వారంతా సీఎం సన్నిహితులా? వారందరికీ జాక్‌పాట్ ఎలా తగిలినట్లు? అదే విధంగా ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ ఎదురుగా, చుట్టూ అనేకమందికి రిటర్నబుల్ ప్లాట్లు వచ్చాయి. వారు కూడా సీఎం సన్నిహితులేనా? ‘డైమండ్ సర్కిల్’ వెంట ప్లాటు అంటూ జగన్ పత్రిక ప్రత్యేకంగా ప్రస్తావించింది. అమరావతి మొత్తం లేఅవుట్‌ను పరిశీలిస్తే... 35 ఆర్టీరియల్ రోడ్ల వెంట డైమండ్ రూపంలో చిన్న చిన్న సర్కిళ్లు వందల్లోనే ఉంటాయి. ఆ సర్కిళ్ల వద్ద ప్లాట్లు పొందినవారంతా లాటరీలో మాయజాలానికి పాల్పడినట్లేనా?
సొంత బుర్ర వాడరా?
‘అమరావతి’లో సుమారు 80వేల రిటర్నబుల్ ప్లాట్లు ఉన్నాయి. ఇవన్నీ లాటరీ ద్వారా కేటాయించినవే. అందులో... చంద్రబాబు సన్నిహితులంటూ ఇద్దరి పేర్లు, ‘ఆంధ్రజ్యోతి’ ఎండీ రాధాకృష్ణ కుమారుడు, కుమార్తెలకు దక్కిన ప్లాట్లలోనే అక్రమాలు జరిగాయని జగన్ పత్రిక పేర్కొనడం గమనార్హం! ‘ఫలానా వాళ్ల మీద బురదజల్లండి’ అని యాజమాన్యం చెప్పగానే... ఆ పత్రిక ప్రతినిధులు ముందూ వెనుకా చూడకుండా, క్షేత్రస్థాయికి వెళ్లకుండా, నిజాలు నిర్ధారించుకోకుండా ఒక కథనాన్ని వండి వార్చినట్లు ఇట్టే తెలుస్తుంది. జగన్ పత్రికలో ప్రచురించిన వేమూరి ఆదిత్య, అనూషలకు కేటాయించిన ప్లాట్ల నంబర్లతో సీఆర్డీయే వెబ్‌సైట్‌లో వెతికినా అసలు విషయం తెలుస్తుంది. అయినప్పటికీ, బురదచల్లడమే జగన్ పత్రిక నైజం కాబట్టి, నిజాలకు ముసుగేసి బుర్రతిరుగుడు రాతలు రాసినట్లు స్పష్టమవుతోంది.
ధనేకుల సుబ్బారావు ప్లాటు కథ..
తుళ్లూరు మండల టీడీపీ అధ్యక్షుడు ధనేకుల సుబ్బారావుకు ‘కోరుకున్న చోట’ ప్లాట్లు దక్కాయంటూ జగన్ పత్రిక మరో విశృంఖల వ్యాఖ్య చేసింది. సుబ్బారావు కుటుంబ సభ్యులు పలువురు కలిసి సీఆర్డీయేకు పెద్ద విస్తీర్ణంలో భూములు ఇచ్చారు. సహజంగానే వారికి ప్లాట్లు కూడా ఎక్కువగా వచ్చాయి. ఉదాహరణకు... కొత్తగా నిర్మిస్తున్న శాశ్వత హైకోర్టుకు సమీపంలో 24,500చదరపు గజాల రెసిడెన్షియల్ ప్లాటు వచ్చిందంటూ జగన్ పత్రిక వాపోయింది. నేలపాడు రెవిన్యూ పరిధిలో పొలం ఇచ్చిన రైతుకు ఆ గ్రామంలో రిటర్నబుల్ ప్లాటు ఇవ్వడం తప్పెలా అవుతుంది? తమ ప్లాటుకు వీధిపోటు సమస్య ఉందని, ఇది మార్చాలని ధనేకుల కుటుంబ సభ్యులు పలుమార్లు సీఆర్డీయేను కోరారు. మరోచోట అంత పెద్ద ప్లాటు ఇచ్చే అవకాశం లేకపోవడంతో వారి విజ్ఞప్తిని సీఆర్డీయే తిరస్కరించింది. ఈ విషయంలో ధనేకుల సుబ్బారావు తండ్రి రామారావు గోడును పట్టించుకోవడం లేదని, ఆయనను సీఆర్డీయే సమావేశం నుంచి బయటకు నెట్టేశారని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పార్లమెంటు వేదికపైనే ఆక్రోశించారు. ఇప్పుడు... ఆయన పార్టీ అధినేత జగన్ పత్రిక మాత్రం ‘ధనేకుల కుటుంబానికి ఎక్కడ కోరితే అక్కడ ప్లాట్లు’ అని రాయడం గమనార్హం.
‘పక్కనే’ అంటే ఇదేనా
‘‘ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కుమారుడు ఆదిత్య, కుమార్తె అనూష ల్యాండ్ పూలింగ్‌లో సీఆర్డీయేకు 5.39 ఎకరాలు అప్పగించారు. దీనికి బదులుగా ‘వెస్ట్ బైపాస్‌కు పక్కనే 1500 చదరపు గజాల చొప్పున రెండు నివాస ప్లాటు కేటాయించారు’’ అని జగన్ పత్రిక పేర్కొంది. ‘పక్కనే’ అంటే బైపాస్‌ను ఆనుకుని ఉన్న మొదటి ప్లాటు అనే కదా అర్థం! కానీ... ఈ ప్లాట్లు వెస్ట్ బైపాస్‌కు 300 మీటర్ల అవతల ఉన్నాయి. బైపాస్ రోడ్డు తర్వాత... ఆరు వరుసల్లో ఏకంగా 30 రెసిడెన్షియల్ ప్లాట్ల తర్వాతే ఆదిత్య, అనూషకు ప్లాట్లు దక్కాయి. బైపాస్‌కు, ఈ ప్లాట్లకూ మధ్య 15 మీటర్ల వెడల్పున్న రోడ్లు మూడు, 25 మీటర్ల వెడల్పున్న మరో రోడ్డు ఉన్నాయి. ఇక... మరో వెయ్యి గజాల ప్లాట్లు కూడా వెస్ట్ బైపా్‌సకు కిలోమీటరు దూరంలో ఉన్నాయి. అది కూడా కొండవీడు వాగుకు సమీపంలో! మరో వెయ్యి గజాల రిటర్నబుల్ ప్లాట్లు వాగుకు అవతల ఉన్నాయి. ఇలా వాగుకు అటూ ఇటూ ఉండటం ఒకరకంగా ప్రతికూలమే! ఇదీ అసలు వాస్తవం! కానీ... జగన్ పత్రిక మాత్రం బైపాస్ రోడ్‌కు ‘పక్కనే’ అంటూ పిచ్చి రాతలు రాసింది.
ఎస్‌ఆర్‌ఎం ‘ఎదురు’గా అంటే?
ఆదిత్య, అనూషకు ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీకి ‘ఎదురుగా’ 660 గజాల కమర్షియల్ ప్లాట్లు రెండు కేటాయించినట్లు జగన్ పత్రిక రాసింది. ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీకీ, ఈ ప్లాట్లకూ మధ్య టేపు పట్టుకుని కొలిపిస్తే... ఇందులో నిజం ఎంతో అర్థమవుతుంది! వేమూరి ఆదిత్యకు కేటాయించిన కమర్షియల్ ప్లాటు ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీకి దాదాపు కిలోమీటరు దూరంలో ఉంది. యూనివర్సిటీకీ, ఈ ప్లాటుకూ మధ్య పది వరుసల ప్లాట్లు ఉన్నాయి. ఇవన్నీ చిన్న, మధ్య తరగతి రైతుల ప్లాటే! వీటి తర్వాతే వేమూరి ఆదిత్య కమర్షియల్ ప్లాటు ఉంది. ఎస్‌ఆర్‌ఎంకు, వేమూరి ఆదిత్యకు ఇచ్చిన ప్లాట్లకు మధ్య 15 మీటర్ల రోడ్లు 4, 25 మీటర్ల రోడ్లు 2, వందకు పైగా కమర్షియల్ ప్లాట్లు ఉన్నాయి. ఇక... వేమూరి అనూషకు వచ్చిన ప్లాటు ఎస్‌ఆర్‌ఎం సెకండ్ ఫేస్‌కు (ఖాళీ స్థలం) దగ్గరగా ఉంది. ‘యాక్ ఛీ’ పేర్కొన్నట్లుగా ఇప్పుడున్న ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ ‘ఎదురుగా’ ఆదిత్య, అనూషకు కమర్షియల్ ప్లాట్లు రాలేదు. ఇదీ అసలు వాస్తవం!

అందరి మాదిరిగానే కేటాయింపు
అమరావతిలో ‘ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ కుమారుడు, కుమార్తెకు అందరిలాగానే లాటరీలో ప్లాట్లు వచ్చా యి. దీనిపై రాజధాని రైతులను పక్కదారి పట్టించేలా జగన్ పత్రిక కథనం ప్రచురించింది. ల్యాండ్ పూలింగ్ అంటే ఏమిటి, ప్లాట్ల కేటాయింపు ఎలా జరుగుతుంది, మాస్టర్‌ప్లాన్ ఎలా ఉంటుందనే కనీస పరిజ్ఞానం కూడా లేదు.
- చిలకా బసవయ్య, దళిత జేఏసీ నేత

పెద్ద ప్లాట్లు ఉన్న చోట పెద్ద రోడ్లుంటాయి..
రాజధాని రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లలో పెద్ద ప్లాట్లకు పెద్ద రోడ్లుంటాయని మాస్టర్ ప్లాన్‌లో అప్పుడే తెలిపారు. పెద్ద ప్లాట్లను ఎంచుకున్న వారికి ఇస్తే తప్పేంటి? రాజధాని రైతులకు ఎలాగైతే ప్లాట్లు కేటాయించారో వేమూరి రాధాకృష్ణ కుమారుడు, కుమార్తెకు కూడా అలాగే ఇచ్చారు. ప్రజలకు నిజాలు తెలపాలి కానీ, అసత్యాలు రాయకూడదు.
- కాటా అప్పారావు, రాజధాని రైతు, జేఏసీ నాయకులు, తుళ్లూరు, ఆంధ్రజ్యోతి