Share News

అమరావతికి ‘అక్షర’ కళ

ABN , Publish Date - Mar 27 , 2026 | 06:15 AM

అంతర్జాతీయ స్థాయి విద్యా కేంద్రంగా రాజధాని అమరావతి రూపు దిద్దుకుంటోంది. ఇప్పటికే జాతీయంగా, అంతర్జాతీయంగా ఖ్యాతి గాంచిన పలు విద్యాసంస్థలు అమరావతిలో కొలువు తీరాయి.

అమరావతికి ‘అక్షర’ కళ

నిన్నటిదాకా అద్భుత సాంకేతిక, నిర్మాణ శైలికి అమరావతి చిరునామా! ఇప్పుడు అక్షరమాలలోని తొలి అక్షరం అ.. అంటే అమరావతే గుర్తుకు వచ్చేలా సకల చదువుల కేంద్రంగా రాజధాని అవతరిస్తోంది. ఏఐ క్యాంపస్‌ నుంచి రైతు విశ్వవిద్యాలయం వరకు.. సకల జ్ఞానం ఇక్కడికే ప్రవహిస్తోంది. సహకరించే రైతులు; విద్యావ్యాప్తికి అనువైన విధానాల కారణంగా టాప్‌ ఇనిస్టిట్యూట్‌లకు అమరావతి ఆకర్షణగా మారింది. వాటిలో కొన్ని ఇప్పటికే క్యాంప్‌సలను ఏర్పాటుచేసుకోగా, మరికొన్ని నిర్మాణ,

  • ఒప్పంద దశలో ఉన్నాయి.

  • దేశంలోనే తొలి ఏఐ క్యాంపస్‌ ఇక్కడికే

  • రైతు యూనివర్సిటీకీ ఇక్కడే నాంది

  • కేజీ నుంచి పీజీ వరకూ టాప్‌ సంస్థలు

  • క్యాంప్‌సలు ప్రారంభించిన విట్‌ ఏపీ వర్సిటీ,ఎస్‌ఆర్‌ఎం, అమృత యూనివర్సిటీ, ఎన్‌ఐడీ

(గుంటూరు-ఆంధ్రజ్యోతి)

అంతర్జాతీయ స్థాయి విద్యా కేంద్రంగా రాజధాని అమరావతి రూపు దిద్దుకుంటోంది. ఇప్పటికే జాతీయంగా, అంతర్జాతీయంగా ఖ్యాతి గాంచిన పలు విద్యాసంస్థలు అమరావతిలో కొలువు తీరాయి. మరికొన్ని తమ విద్యాసంస్థలను స్థాపించే పనుల్లో బిజీగా ఉన్నాయి. కేజీ నుంచి పీజీ వరకూ అత్యున్నత స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యాసంస్థలకు కూడలిగా రాజధాని కొత్త రూపం సంతరించుకుంటోంది. అమరావతిలో తొట్టతొలిగా అడుగుపెట్టిన విద్యాసంస్థ విట్‌ ఏపీ యూనివర్సిటీ. 2017లో ఈ సంస్థ 600 మందితో శాఖమూరులో ప్రారంభమైంది. ఇప్పుడది 19,000 మంది విద్యార్థుల సామర్థ్యానికి చేరింది. వంద ఎకరాల్లో ప్రారంభమెన ఈ సంస్థ ఇప్పుడు 200 ఎకరాలకు విస్తరించబోతోంది. కురగల్లు- నీరుకొండలో ఏర్పాటైన మరో ప్రతిష్ఠాత్మక సంస్థ ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ. ఇక్కడ 15,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటితోపాటు మాతా అమృతానందమయి ఆధ్వర్యంలో ‘అమృత యూనివర్సిటీ’ నడుస్తోంది. రాజధాని విద్యావనంలో మరో కలికుతురాయి ఇది. పూర్తిస్థాయి కార్యకలాపాలకు వీలుగా యూనివర్సిటీని అభివృద్ధి చేస్తున్నారు. మరో జాతీయ స్థాయి సంస్థ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌(ఎన్‌ఐడీ) కూడా నాలుగేళ్లుగా విద్యాసేవలు అందిస్తోంది.

2.jpg


తొలి ఏఐ క్యాంపస్‌..

ప్రముఖ విద్యాసంస్థ బిర్లా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (బిట్స్‌) అమరావతిలో తన క్యాంప్‌సను నిర్మిస్తోంది. ఇటీవలే క్యాంపస్‌ నమూనాలను మంత్రి లోకేశ్‌ పరిశీలించారు. దాదాపు ఏడు వేలమంది సామర్థ్యంతో దీనిని సిద్ధం చేస్తున్నారు. ఈ నిర్మాణం పూర్తయితే దేశంలోనే తొలి ఏఐ క్యాంప్‌సగా బిట్స్‌ అమరావతి ఉండబోతోంది. కాగా, ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ జేవియార్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ ఒక క్యాంప్‌సను అమరావతిలో నిర్మించేందుకు ఇటీవల సీఆర్డీఏతో ఒప్పందం చేసుకుంది. 61 ఎకరాల్లో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. జంషెడ్‌పూర్‌, ఢిల్లీ తరువాత దేశంలో ఏర్పాటవుతున్న మూడో క్యాంపస్‌ ఇదే కావడం విశేషం. ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ప్రాంతీయ క్యాంపస్‌ పూర్తి కావస్తోంది. దీంతోపాటు అంతర్జాతీయ న్యాయ విద్యా సంస్థ ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లీగల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ ఏర్పాటుకు తాజాగా ఒప్పందం జరిగింది. సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌(సీఐటీడీ) అమరావతిలో ఏర్పాటు కాబోతోంది. కాగా నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ యూనివర్సిటీ(ఐఎన్‌ఐ)ని కూడా అమరావతిలో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోమ్‌ శాఖ కిందటేడాది డిసెంబరులో ప్రకటించింది. అయితే వీటితోపాటు ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ యోగా అండ్‌ నేచురోపతి, బసవతారకం కేన్సర్‌ స్కూల్‌, కేఐఐఎంఎస్(కిమ్స్‌) మెడికల్‌ కళాశాలలకు సంబంధించి ప్రతిపాదనలు ఉన్నాయి.

సకల చదువుల కూడలి..

పాఠశాల విద్యారంగంలోను అమరావతిని మేటిగా తీర్చిదిద్దే ప్రయత్నాలు ఫలితాలనిస్తున్నాయి. ప్రముఖ పాఠశాలలు అమరావతిలో అడుగు పెడుతున్నాయి. ఇటీవలే చిన్మయ విద్యాలయం శంకుస్థాపన జరుపుకొంది. కేంద్రియ విద్యాలయం క్యాంప్‌సను అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారు. డీఏవీ గ్రూప్‌ అమరావతిలో రైతు విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తోంది. వీటితోపాటు మౌంట్‌పోర్ట్‌ ఇంటర్నేషనల్‌ అకాడమి, బేసిల్స్‌ ఉడ్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌, శాంటా మారియా ఇంటర్నేషనల్‌ స్కూలు, ఇండస్‌ ఇంటర్నేషనల్‌ స్కూలు, గ్లోబల్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ స్కూలు, రేయాన్‌ ఇంటర్నేషనల్‌ స్కూలు అమరావతిలో కొలువుదీరబోతున్నాయి. వీటిలో మెజారిటీ స్కూళ్లకు సీఆర్డీఏ భూ కేటాయింపులు కూడా పూర్తి చేసింది.

Updated Date - Mar 27 , 2026 | 06:15 AM