రాజధానిలో అధికారుల మధ్య కోల్డ్‌వార్!
ABN , Publish Date - Mar 09 , 2026 | 05:22 AM
రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్‌డీఏ)కు ఉన్న అధికారాలు, బాధ్యతలను స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీవీ)గా తీసుకువచ్చిన అమరావతి అభివృద్ధి సంస్థ......
సీఆర్‌డీఏ, ఏడీసీఎల్ విభాగాల్లో ‘ఉన్నత స్థాయి’లో వివాదాలు
పనుల బదలాయింపుతో పేచీలు
ప్రభుత్వ కీలక లక్ష్యానికి తూట్లు
ఎల్‌పీఎస్ ఇన్‌ఫ్రా, ట్రంక్ రోడ్స్
బ్యూటిఫికేషన్ వర్క్ ఏడీసీఎల్‌కు కొత్తగా ఏజీఐసీఎల్ ఎస్పీవీ ఏర్పాటు
దీంతో సీఆర్‌డీఏకి తగ్గిన ప్రాధాన్యం
పనేముందన్న భావనలో కమిషనర్
ప్లానింగ్ అధికారాలను హైజాక్ చేయటానికి డీటీసీపీ మైండ్‌గేమ్
రైతుల సమస్యలు అపరిష్కృతం
మంత్రి నారాయణ తీరుపై రైతులు, ప్రజాప్రతినిధుల తీవ్ర అసంతృప్తి
రాజధాని అమరావతి పనులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రమంలో తీసుకువచ్చిన ఎస్పీవీలకు కొన్ని పనులు, బాధ్యతలను బదలాయించింది. అయితే.. ఈ వ్యవహారం వివాదానికి, ఉన్నతాధికారుల మధ్య కోల్డ్ వార్‌కు దారి తీసింది. తమ అధికారాలను, పనులను లాగేసుకున్నారన్న భావన సీఆర్‌డీఏలో కనిపిస్తోంది. దీంతో కమిషనర్ కన్నబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా క్షేత్రస్థాయిలో తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
(విజయవాడ-ఆంధ్రజ్యోతి)
రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు కీలక దశలో ఉండగా, సీఆర్‌డీఏ అధికారాలు, పనుల బదలాయింపు వ్యవహారం దుమారం రేపుతోంది. పనుల వేగవంతానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే, అధికారాలు, పనులు, బాధ్యతల బదలాయింపు వంటి కీలక అంశాలు ఉన్నతాధికారుల మధ్య కోల్డ్‌వార్‌కు దారి తీసింది. మరోవైపు రాజధాని ప్రాంత రైతులు తమ సమస్యల పరిష్కారం విషయంలో కీలక సంస్థలు ఏకతాటిపై లేకపోవడం సమస్యగా మారుతోందని, మంత్రి నారాయణ పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఏం జరిగింది?
రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్‌డీఏ)కు ఉన్న అధికారాలు, బాధ్యతలను స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీవీ)గా తీసుకువచ్చిన అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీఎల్)కు అదనంగా అప్పగించారు. అదేవిధంగా మరో ఎస్పీవీ అమరావతి గ్రోత్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(ఏజీఐసీఎల్)కు కూడా మరికొన్నింటిని బదలాయించారు. దీంతో సీఆర్‌డీఏ కేవలం ల్యాండ్, ప్లానింగ్ అథారిటీగా మాత్రమే ఉంది. సీఆర్‌డీఏకు ఉన్న అధికారాలు, బాధ్యతలు తగ్గిపోవడంతో కమిషనర్ కన్నబాబు అసంతృప్తిగా ఉన్నారు. పెద్దగా పని లేకపోవటంతో ఆయన ఇక్కడ పనిచేయడమెందుకన్న భావనలో ఉన్నట్టు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. సీఆర్‌డీఏ, ఏడీసీఎల్ ఉన్నతాధికారుల మధ్య కొంతకాలంగా కోల్డ్‌వార్ నడుస్తోంది. అధికారాల బదలాయింపు దీనికి ఆజ్యం పోయగా, ఒకరి అధికారాలను మరొకరు తగ్గించుకునే దిశగా పావులు కదపడం వంటివి సీఆర్‌డీఏ, ఏడీసీఎల్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సీఆర్‌డీఏ కమిషనర్‌గా కాటమనేని భాస్కర్ ఉన్న సమయంలో అమరావతిలో ఎల్‌పీఎస్ ఇన్‌ఫ్రా పనులు సీఆర్‌డీఏ పరిధిలో ఉండేవి. ఆయన స్థానంలో కన్నబాబు వచ్చాక.. ఎల్‌పీఎస్ ఇన్‌ఫ్రా పనులను ఏడీసీఎల్‌కు అప్పగించారు. అమరావతిలో అతిపెద్ద పనులు ఏమైనా ఉన్నాయంటే అవి ఎల్‌పీఎస్ ఇన్‌ఫ్రావే. ఈ పనులన్నీ ఏడీసీఎల్‌కి బదలాయించారు. ఈ క్రమంలో సీఆర్‌డీఏ నుంచి కాంట్రాక్టర్లకు ఇబ్బందులు ఎదురయ్యాయన్న విమర్శలు వస్తున్నాయి. పనులు ఏడీసీఎల్ చేయిస్తున్నప్పటికీ ఫైనల్ బిల్స్ రావాలంటే మాత్రం తమ అనుగ్రహం తప్పదన్న అభిప్రాయాన్ని కల్పించేలా సీఆర్‌డీఏ అధికారులు వ్యవహరించడంతో ఈ విషయం ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్లింది. దీంతో బిల్స్‌కు సంబంధించిన వ్యవహారాలన్నింటినీ ఏడీసీఎల్‌తోనే ఫైనల్‌గా వెళ్లేలా చర్యలు తీసుకున్నారు.
పనుల్లో వేగం పెంచేందుకే
రాజధానిలో పనులను మరింత వేగంగా పూర్తి చేసేందుకు వీలుగా ఏజీఐసీఎల్ పేరుతో ప్రభుత్వం ప్రత్యేక ఎస్పీవీని ఏర్పాటు చేసింది. దానికి స్వయంప్రతిపత్తి కల్పించింది. ఈ సంస్థకు రివర్ ఫ్రంట్ డెవల్‌పమెంట్, గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, రోప్‌వే, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఐకానిక్ విగ్రహాల ఏర్పాటు వంటివి అప్పగించారు. వీటికి అదనంగా సీఆర్‌డీఏ చూస్తున్న ఐకానిక్ భవనాలైన జీఏడీ, సచివాలయం టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాలు, ఇతర భవన నిర్మాణాల ప్రాజెక్టులను కూడా అప్పగించారు.
మంత్రిపై అసహనం
రాజధానిలో శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వివాదంగా మారింది. దీంతో రైతుల అపరిష్కృత సమస్యలకు పరిష్కారం లభించడంలేదు. ఈ వ్యవస్థలను పర్యవేక్షించాల్సిన మంత్రి నారాయణపై ప్రభావం పడుతోంది. ఈ క్రమంలో మంత్రిని లక్ష్యంగా చేసుకుని రాజఽధాని రైతులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరోవైపు రాజధాని ప్రాంత ప్రజాప్రతినిధుల్లో కూడా మంత్రిపై అసహనం పెరుగుతోంది.
కన్నబాబు మంత్రాంగం
ఈ సమయంలో ఏడీసీఎల్ సీఎండీగా వ్యవహరిస్తున్న లక్ష్మీ పార్థసారథి అధికారాలు తగ్గించేలా సీఆర్‌డీఏ కమిషనర్ కన్నబాబు పావులు కదిపారని తెలిసింది. ఈ వ్యవహారం ముఖ్యమంత్రి వరకు వెళ్లగా, ఏడీసీఎల్ సీఎండీ అధికారాలను తగ్గించడానికి ససేమిరా అన్నట్టు సమాచారం. ఈ పరిణామం సీఆర్‌డీఏ, ఏడీసీఎల్ ఉన్నతాధికారుల మధ్య కోల్డ్‌వార్‌ను మరింత పెంచింది. దీంతో రైతులతో ప్రత్యక్ష సంబంధం ఉన్న అంశాల విషయంలో ఉన్నతాధికారులు ఎవరి దారి వారిదన్నట్టుగా ఉండటంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు నెలకొన్నాయి. ఇదే సందర్భంలో ఏడీసీఎల్ మెగా ఎల్‌పీఎస్ ఇన్‌ఫ్రా పనులకు తోడు రాజధానిలో 35 ట్రంక్ రోడ్డు(370 కి.మీ) పనులు, 217 కిలోమీటర్ల మేర బ్యూటిఫికేషన్ పనులను ఏడీసీఎల్ పర్యవేక్షిస్తోంది. దీంతో సగానికి పైగా సీఆర్‌డీఏ పర్యవేక్షణలోని కీలక పనులను ఏడీసీఎల్ దక్కించుకున్నట్టు అయింది.
సీఆర్‌డీఏ అధికారాలకు మరింత కోత
సీఆర్‌డీఏ దగ్గర ల్యాండ్, ప్లానింగ్ బాధ్యతలే ఉన్నాయి. ప్లానింగ్ అధికారాలను కూడా డీటీసీపీ తన చేతుల్లోకి తీసుకునేందుకు పావులు కదపటం ప్రారంభించింది. తాజాగా 25 ఎకరాలకు పైబడిన లేఅవుట్‌కు తుది అనుమతులు ఇవ్వాలంటే సీఆర్‌డీఏ అనుమతి తర్వాత డీటీసీపీకి వెళ్లాలి. డీటీసీపీ నుంచి క్లియరెన్స్ వస్తేనే ప్లాన్ వస్తుంది. ఆరకంగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు తెచ్చుకునేలా ముసాయిదా సిద్ధం చేసి పెట్టుకున్నారు. సీఆర్‌డీఏ పరిధిలో అప్లికేషన్ పెట్టాక.. ఏడు దశల్లో పరిశీలన పూర్తయ్యాక.. అదనపు కమిషనర్, కమిషనర్ల దగ్గరకు వెళ్తుంది. ఆ తర్వాత ఆమోదం లభిస్తుంది. ఇక మీదట మళ్లీ డీటీసీపీకి వెళ్తుంది. డీటీసీపీలో డైరెక్టర్ ఉంటారు. సీఆర్‌డీఏ స్థాయిలో ఐఏఎస్ అధికారులు ఆమోదించాక డీటీసీపీలో డైరెక్టర్ స్థాయి అధికారులు ఆమోదించాలి. ఈ పరిణామాలతో సీఆర్‌డీఏ ప్లానింగ్ అధికారాలను కూడా కోల్పోయే పరిస్థితి నెలకొంది.