చిరుతిండికి వంద
ABN , Publish Date - Nov 21 , 2026 | 05:16 AM
బడి పిల్లలు ఎక్కువగా చిరుతిండికి మొగ్గుచూపుతున్నారు. పాఠశాల ఆవరణ, వెలుపల కొనుగోలు చేసే చిరుతిండి కోసం ఒక్కో చిన్నారి వారానికి రూ.100కు పైగా ఖర్చు చేస్తున్నారు.
బడికెళ్లే పిల్లలు వారానికి చేస్తున్న ఖర్చు ఇది
85 శాతం మంది తినేది జంక్ ఫుడ్డే.. బిస్కెట్లు, చాక్లెట్లు, చిప్స్, కోక్స్‌కే మొగ్గు
పాఠశాలకు సమీపంలోనే చిరుతిండి అందుబాటులో
పాఠశాలల్లో 97.8 శాతం మందికి మధ్యాహ్న భోజనం
‘పౌష్టికాహారం, పర్యావరణ అంచనా’పై యునిసెఫ్ సర్వేలో వెల్లడి
బడికి వెళ్లాలంటే పిల్లలు మారాం చేస్తారు. తల్లిద్రండులు బిస్కట్లో, చాక్లెట్లో ఆశ చూపి బడికి పంపుతారు. బడి నుంచి వచ్చే సమయంలోనూ ఓ జంక్ ఫుడ్ ప్యాకెట్ పిల్లల చేతిలో పెట్టాల్సిందే. వీటికి తల్లిదండ్రులు వారానికి రూ.100కు పైగా ఖర్చు చేస్తున్నారు. 85 శాతం మంది పిల్లలు పాఠశాలల్లో అతిగా ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్ తింటున్నారు. యునిసెఫ్ సర్వేలో ఇలాంటి పలు అంశాలు వెల్లడయ్యాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యకరమైన ఆహారంపై పాఠశాల విద్యాశాఖ, సమగ్రశిక్ష సోషల్ మీడియా ప్రచారాన్ని ప్రారంభించాయి.
అమరావతి, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): బడి పిల్లలు ఎక్కువగా చిరుతిండికి మొగ్గుచూపుతున్నారు. పాఠశాల ఆవరణ, వెలుపల కొనుగోలు చేసే చిరుతిండి కోసం ఒక్కో చిన్నారి వారానికి రూ.100కు పైగా ఖర్చు చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో అందుబాటులో ఉన్న ఆహారం, తాగునీరు, పారిశుధ్యం, వ్యక్తిగత పరిశుభ్రతపై ‘పౌష్టికాహారం, పర్యావరణ అంచనా సర్వే’(నీట్-ఎస్) పేరుతో యునిసెఫ్ ఒక సర్వే నిర్వహించింది. పాఠశాల విద్యాశాఖ, సమగ్రశిక్ష సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా 556 పాఠశాలల్లో ఈ సర్వే చేశారు. నీట్-ఎస్ సర్వే రాష్ట్ర నివేదికను విజయవాడలోని సమగ్రశిక్ష కార్యాలయంలో శుక్రవారం విడుదల చేశారు.
సర్వే చేసిన వాటిలో ప్రభుత్వ, ప్రైవేటు, గురుకులాలు, మదరసాలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 50 శాతం మంది, ప్రైవేటు పాఠశాలల్లో 60 శాతం మంది పిల్లలు రూ. వందకు పైగా ఖర్చు పెడుతున్నారు. రూ. 50 మాత్రమే ఖర్చుచేస్తున్న వారు ప్రభుత్వ పాఠశాలల్లో 41 శాతం ఉంటే, ప్రైవేటు పాఠశాలల్లో 31 శాతం మంది ఉన్నారు. స్నాక్స్ తినే అలవాటుపైనా సర్వే చేశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో 51 శాతం మంది మాత్రమే ప్రతిరోజూ స్నాక్స్ తింటున్నారు. ప్రైవేటులోనూ 55 శాతం మందికే ప్రతిరోజూ స్నాక్స్ ఉంటున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 13 శాతం మందికి, ప్రైవేటు పాఠశాలల్లో 12 శాతం మందికి స్నాక్స్ అలవాటు చాలా అరుదుగా ఉంది.
స్నాక్స్‌లోనూ ఎక్కువ మంది బిస్కెట్లకే మొగ్గుచూపుతున్నారు. 75శాతం మంది బిస్కెట్లను తింటుంటే.. 39 శాతం మంది చిప్స్‌ను, 19 శాతం మంది కోక్‌లు, సోడాలు, 34 శాతం మంది చాక్లెట్లను ఇష్టపడుతున్నారు. దాదాపుగా చాలా వరకు పాఠశాలల ఆవరణల్లో చిరుతిండి అందుబాటులో ఉంటోంది. కేజీబీవీలు, గురుకులాల్లో చదివే విద్యార్థుల్లో.. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు చిన్న కిరాణా షాపుల్లో దొరికే వాటిని ఇష్టపడుతుంటే, పట్టణాల్లోని విద్యార్థులు ఫాస్ట్‌ఫుడ్ తినేందుకు మొగ్గుచూపుతున్నారు. చేతులు శుభ్రం చేసుకునేందుకు 22శాతం మందికి సబ్బు అందుబాటులో ఉండటం లేదు. 4శాతం మందికి సబ్బుతో పాటు నీరు కూడా దొరకట్లేదు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో 47 శాతం మంది రోజుకు అరగంట నుంచి 2 గంటల వరకు టీవీ లేదా ఫోన్ చూస్తున్నారు. 60.6 శాతం మందికి ఆర్‌వో ప్లాంట్లు, 22.5 శాతం మందికి మున్సిపల్, 7.8 శాతం మందికి చేతిపంపు ద్వారా తాగునీరు అందుతోంది. 7.4 శాతం మందికి తాగునీరు అందుబాటులో లేదు. 97.8 శాతం మందికి మధ్యాహ్న భోజనం పాఠశాలల ద్వారా అందుతోంది. 64.4 శాతం మందికి ప్రభుత్వ పథకం ద్వారా, 31.5 శాతం మందికి గురుకులాల ద్వారా, 1.5శాతం మందికి ఎన్‌జీవోలు లేదా సీఎ్‌సఆర్ ద్వారా ఆహారం అందిస్తున్నారు.
ఆరోగ్యకర ఆహారానికి ప్రాధాన్యం
పాఠశాల విద్యలో ఆరోగ్యకరమైన ఆహారం అందించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు సమగ్రశిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు తెలిపారు. సర్వే విడుదల సందర్భంగా యునిసెఫ్- హైదరాబాద్ కార్యాలయ హెచ్‌వోడీ డా.జెలాలమ్ తఫస్సే మాట్లాడుతూ... పిల్లల్లో సరైన ఆహారపు అలవాట్లను పెంపొందించేందుకు అవగాహనతో పాటు పౌష్టికాహారం అందుబాటులో ఉంచాలన్నారు. ఇందుకోసం పాఠశాలలు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు, ఆరోగ్య విభాగాలు సమన్వయంతో పనిచేయాలన్నారు. తమ అధ్యయనంలో 85 శాతం మంది రాగి జావను, 92 శాతం మంది మిల్లెట్ చిక్కీలను ఇష్టపడుతున్నట్లు వెల్లడైందన్నారు.
అలాగే 85 శాతం మంది విద్యార్థులు పాఠశాలల్లో అతిగా ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్ తింటున్నారన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్యకరమైన ఆహారంపై ‘హెల్తీ డైట్స్ ఫర్ హెల్తీ ఫ్యూచర్స్’ పేరుతో పాఠశాల విద్యాశాఖ, సమగ్రశిక్ష సోషల్ మీడియా ప్రచారాన్ని శుక్రవారం ప్రారంభించాయి. ఈ కార్యక్రమంలో అధికారులు ఆర్.ఎ్‌స.గంగాభవానీ, వి.ఎస్.ఎన్.మూర్తి, యునిసెఫ్ ప్రతినిధులు ప్రీతు మిశ్రా, శేషగిరి మధుసూదన్, ఖ్యాతి తివారీ, గౌరి పాల్గొన్నారు.