Share News

TTD: 83 లక్షల లంచం.. టీటీడీకి 118 కోట్ల నష్టం

ABN , Publish Date - Jan 10 , 2026 | 04:50 AM

కల్తీ నెయ్యి కేసులో నిందితుడిగా ఉన్న డెయిరీ నిపుణుడు విజయభాస్కర్‌రెడ్డి.. అర్హత లేని డెయిరీలకు సహకరించడం ద్వారా ఆయా సంస్థల నుంచి ఆయన భారీగా లబ్ధి పొందారని సిట్‌ తెలిపింది.

TTD: 83 లక్షల లంచం.. టీటీడీకి 118 కోట్ల నష్టం

  • నెయ్యి నాణ్యతపై బోర్డుకు తప్పుడు సమాచారం

  • విజయభాస్కర్‌రెడ్డి అవినీతిపై సిట్‌ వాదనలు

  • కల్తీ నెయ్యి కేసులో ముందస్తు బెయిల్‌ నిరాకరణ

తిరుపతి/నెల్లూరు(లీగల్‌), జనవరి 9 (ఆంధ్రజ్యోతి): కల్తీ నెయ్యి కేసులో నిందితుడిగా ఉన్న డెయిరీ నిపుణుడు విజయభాస్కర్‌రెడ్డి.. అర్హత లేని డెయిరీలకు సహకరించడం ద్వారా ఆయా సంస్థల నుంచి ఆయన భారీగా లబ్ధి పొందారని సిట్‌ తెలిపింది. ప్రీమియర్‌ అగ్రి ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే డెయిరీ ఎండీ జగ్‌మోహన్‌ గుప్తా నుంచి రూ.2.50లక్షలు లంచంగా తీసుకున్నారని, ఆల్ఫా డెయిరీ ప్రతినిధుల నుంచి 8 గ్రాముల గోల్డ్‌ కాయిన్‌, వైష్ణవి, భోలేబాబా, మాల్‌గంగా, ప్రీమియర్‌ ఫుడ్స్‌ తదితర డెయిరీల నుంచి హైదరాబాద్‌లోని హవాలా ఏజంట్‌ ద్వారా మొత్తం రూ.83 లక్షలు లంచంగా తీసుకున్నారని ఆరోపించింది. వీటికి సంబంధించిన పక్కా ఆధారాలను సిట్‌ సేకరించిందని తెలిపేర్కొంది. ఆయా డెయిరీలకు జరిపిన బిల్లుల చెల్లింపులతో టీటీడీకి సుమారు రూ.118 కోట్ల నష్టం జరిగిందని చెప్పింది. ఏసీబీ కోర్టులో విజయభాస్కర్‌ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సిట్‌ తరఫు న్యాయవాది ఈ విసయాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. విచారణకు హాజరు కాకుండా అజ్ఞాతంలో ఉన్న నిందితుడికి ముందస్తు బెయిల్‌ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీపీ వాదనలతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు.. విజయభాస్కర్‌ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను శుక్రవారం డిస్మిస్‌ చేసింది. సికింద్రాబాద్‌కు చెందిన విజయభాస్కర్‌ను టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో నిందితుడిగా(ఏ34) చేరుస్తూ గత నవంబరు 23న నెల్లూరు ఏసీబీ కోర్టులో సిట్‌ మెమో దాఖలు చేసింది. అప్పటినుంచీ ఆయన అజ్ఞాతంలో ఉంటున్నారు. విచారణకు రావాలని సిట్‌ అధికారులు నోటీసులు జారీ చేసినా అనారోగ్యం కారణం చూపి హాజరుకాలేదు. పది రోజుల కిందట నెల్లూరు ఏసీబీ కోర్టులో ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఈ నెల 7న వాదనలు జరిగాయి. ఇదిలా ఉండగా.. 20 రోజుల కిందట సికింద్రాబాద్‌లోని నిందితుడి నివాసంలో సిట్‌ అధికారులు తనిఖీ చేసిన సమయంలో రూ.34 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఆ మొత్తాన్ని కోర్టులో డిపాజిట్‌ చేసినట్టు తెలిసింది.

Updated Date - Jan 10 , 2026 | 04:50 AM