Share News

పోలీసింగ్‌కు మరింత పదును!

ABN , Publish Date - Sep 24 , 2026 | 07:02 AM

రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను మరింత సమర్థంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కీలక ప్రతిపాదన చేసింది. తిరుపతి, గుంటూరు, కర్నూలు, రాజమహేంద్రవరంలో కొత్తగా పోలీస్‌ కమిషనరేట్లను ఏరాటు చేయాలని ప్రతిపాదించింది.

పోలీసింగ్‌కు మరింత పదును!

  • రాష్ట్రంలో 4 కొత్త కమిషనరేట్లు

  • తిరుపతి, గుంటూరు, కర్నూలు,రాజమహేంద్రవరంలో ఏర్పాటు

  • జోన్ల వారీగా సమగ్ర విభజన

  • ఐజీ, డీఐజీ స్థాయి అధికారుల నేతృత్వంలో ఏకీకృత కమాండ్‌

  • ఉన్న సిబ్బందితోనే పునర్వ్యవస్థీకరణ

అమరావతి, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను మరింత సమర్థంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కీలక ప్రతిపాదన చేసింది. తిరుపతి, గుంటూరు, కర్నూలు, రాజమహేంద్రవరంలో కొత్తగా పోలీస్‌ కమిషనరేట్లను ఏరాటు చేయాలని ప్రతిపాదించింది. పెరుగుతున్న పట్టణీకరణ, మారుతున్న నేరాల స్వరూపం, సైబర్‌ మోసాలు, మహిళలపై నేరాలు, ట్రాఫిక్‌, డ్రగ్స్‌ వంటి సవాళ్లను దృష్టిలో పెట్టుకుని ఆయా ప్రాంతాల్లో పోలీస్‌ వ్యవస్థను ఒకే కమాండ్‌ కిందకు తీసుకురావాలని నిర్ణయించింది. ఐజీ/డీఐజీ స్థాయి అధికారిని కమిషనర్‌గా నియమించడంతోపాటు జోన్లు, సబ్‌డివిజన్ల వారీగా డీసీపీలు, ఏసీపీలకు బాధ్యతలు అప్పగించేలా ప్రతిపాదన రూపొందించింది. కమిషనరేట్‌ వ్యవస్థలో శాంతిభద్రతలతోపాటు నేరాలు, ట్రాఫిక్‌, మహిళా పోలీసింగ్‌, సైబర్‌ నేరాలు, రికార్డులు, ఐటీ, కమాండ్‌ కంట్రోల్‌ వంటి విభాగాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు. కమిషనరేట్‌ ఉన్నతాధికారికి ఎగ్జిక్యూటివ్‌ మేజిస్టీరియల్‌ అధికారాలు కల్పించాలని ప్రతిపాదించారు.

తిరుపతికి నాలుగు జోన్లు

తిరుపతి కమిషనరేట్‌ను తిరుమల, తిరుపతి, శ్రీకాళహస్తి, శ్రీసిటీ.. నాలుగు జోన్లుగా విభజించాలని ప్రతిపాదించారు. కమిషనర్‌గా ఐజీ/డీఐజీ స్థాయి అధికారిని నియమించనున్నారు. తిరుమల జోన్‌లో ఒక సబ్‌డివిజన్‌, 3 పోలీస్‌ స్టేషన్లు.. తిరుపతి జోన్‌లో 2 సబ్‌డివిజన్లు, 11 స్టేషన్లు.. శ్రీకాళహస్తి జోన్‌లో 2 సబ్‌డివిజన్లు, 14 స్టేషన్లు.. శ్రీసిటీ జోన్‌లో 2 సబ్‌డివిజన్ల పరిధిలో 21 స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. తిరుపతి, తిరుమలలో క్రైమ్‌ కంట్రోల్‌ సిస్టమ్‌, ట్రాఫిక్‌, మహిళా పోలీస్‌ స్టేషన్‌, సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌, కంట్రోల్‌ రూమ్‌, క్రైమ్‌, ట్రాఫిక్‌ రికార్డు బ్యూరోలు, ఐటీ కోర్‌, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, క్లూస్‌, ఫింగర్‌ప్రింట్‌ విభాగాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. తిరుపతిలో 2024లో 9,411 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా.. 2025లో 10,094కు చేరాయి. 2026లో ఇప్పటి వరకు 5,123 కేసులు నమోదయ్యాయి.


గుంటూరులో..

గుంటూరు కమిషనరేట్‌ను నాలుగు జోన్లుగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కమిషనర్‌గా ఐజీ/డీఐజీ స్థాయి అధికారిని నియమించనున్నారు. నేరాల దర్యాప్తు, ట్రాఫిక్‌, మహిళా భద్రత, సైబర్‌ నేరాల నియంత్రణకు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయనున్నారు. గుంటూరులో 2022లో 12,509 ఎఫ్‌ఐఆర్‌లు నమోదుకాగా.. 2023లో 10,885.. 2024లో 10,259.. 2025లో 11,214 నమోదయ్యాయి.

కర్నూలులో 38 స్టేషన్లు

కర్నూలు కమిషనరేట్‌ను రెండు లా అండ్‌ ఆర్డర్‌ జోన్లుగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. జోన్‌ 1లో రెండు సబ్‌డివిజన్లు, 12 స్టేషన్లు.. జోన్‌ 2లో మూడు సబ్‌డివిజన్లు, 26స్టేషన్లు ఉంటాయి. కర్నూలు అర్బన్‌, కర్నూలు రూరల్‌, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ ప్రాంతాలకు ఏసీపీలను నియమించనున్నారు. కర్నూలులో సైబర్‌ నేరాల పెరుగుదలను ఈ ప్రతిపాదనలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. 2022లో 118 కేసులు నమోదు కాగా 2025 నాటికి 2,729కి పెరిగాయి.

రాజమహేంద్రవరంలో మూడు జోన్లు

రాజమహేంద్రవరం కమిషనరేట్‌ను 3 లా అండ్‌ ఆర్డర్‌ జోన్లుగా ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర, దక్షిణ ప్రాంతాలతో జోన్‌-1లో 7 స్టేషన్లు, ఉత్తర, తూర్పుప్రాంతాలతో జోన్‌-2లో 12 స్టేషన్లు, కొవ్వూరు పరిధిలో(జోన్‌-3)లో 11 స్టేషన్లు ఉండేలా ప్రతిపాదించారు. మొత్తం 30 పోలీస్‌ స్టేషన్లు కమిషనరేట్‌ పరిధిలోకి రానున్నాయి. సెంట్రల్‌, సౌత్‌, నార్త్‌ ఈస్ట్‌, కొవ్వూరు ప్రాంతాలకు ఏసీపీలను నియమించనున్నారు. మహిళా పోలీస్‌ స్టేషన్‌, కైరమ్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ యూనిట్లు, ట్రాఫిక్‌, సిటీ ఆర్మ్డ్‌ రిజర్వ్‌, కంట్రోల్‌ రూమ్‌, ఐటీ కోర్‌, కమాండ్‌ కంట్రోల్‌, క్లూస్‌, ఫింగర్‌ప్రింట్‌ విభాగాలను ఏర్పాటు చేస్తారు. రాజమహేంద్రవరంలో ఎఫ్‌ఐఆర్‌ల సంఖ్య 2022లో 11,198 ఉండగా 2025కు 7,685కు తగ్గింది.

Updated Date - Sep 24 , 2026 | 07:02 AM