శ్రీసిటీలో భారీ విషాదం.. బాయిలర్ పేలుడులో నలుగురు మృతి
ABN , Publish Date - Oct 03 , 2026 | 10:11 AM
తిరుపతి జిల్లాలోని శ్రీసిటీ పారిశ్రామికవాడలో భారీ పేలుడు కలకలం రేపింది. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలడంతో పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడగా, నలుగురు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం.
తిరుపతి, అక్టోబర్ 3: జిల్లాలోని శ్రీసిటీ పారిశ్రామికవాడలో భారీ పేలుడు తీవ్ర కలకలం రేపింది. సత్యవేడు మండలం శ్రీసిటీలోని టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలినట్లు సమాచారం. నైట్ షిఫ్ట్‌లో విధులు నిర్వహిస్తున్న పలువురు కార్మికులు ఈ ప్రమాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు భయాందోళనకు గురయ్యారు. పేలుడు ధాటికి పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. మొదట ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం అందగా.. ఆ తర్వాత మృతుల సంఖ్య నలుగురికి చేరినట్లు తెలుస్తోంది. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన నెలకొంది.
పేలుడు జరిగిన వెంటనే అప్రమత్తమైన రెస్క్యూ బృందాలు.. సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. పరిశ్రమలో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. శిథిలాల కింద మరెవరైనా చిక్కుకున్నారా అనే అనుమానంతో సహాయక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.
మృతుల వివరాలు ఇవే..
పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 5కి చేరింది. గౌరబ్ రాయ్ (35), చిన్న మస్తాన్ (36), రమేష్ (40) మృతిచెందినట్లు అధికారులు గుర్తించారు. మరో మృతదేహాన్ని గుర్తించాల్సి ఉంది. తీవ్రంగా గాయపడిన వాసు (36) చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. పేలుడు ధాటికి పరిశ్రమ శకలాలు సుమారు 100 మీటర్ల దూరంలో పడిపోయాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో ఎంతమంది కార్మికులు విధుల్లో ఉన్నారు.. పేలుడుకు అసలు కారణం ఏమిటనే విషయాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. బాయిలర్‌లో సాంకేతిక లోపం కారణంగానే పేలుడు జరిగిందా.. మరేదైనా కారణం ఉందా అనే కోణంలో అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడయ్యే వరకు మృతులు, క్షతగాత్రుల సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంది.
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకుంటుంది: మంత్రి లోకేశ్
శ్రీసిటీలోని ప్రైవేటు ఫ్యాక్టరీలో బాయిలర్ పేలిన ఘటనపై మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కార్మికుల మృతి, పలువురు గాయపడటం తీరని విషాదమని పేర్కొంటూ, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించాలని కోరారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.