గాంధీభవన్‌లోకి గొర్రెలు, మేకలు తోలి నిరసన
ABN , Publish Date - Jun 24 , 2025 | 04:40 AM
రాష్ట్ర మంత్రివర్గంలో గొల్ల, కురుమలకు చోటు కల్పించాలని.. పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టుల్లోనూ ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ యాదవ సంఘం నేతలు వినూత్న నిరసనకు దిగారు.
గొల్ల, కురుమలకు మంత్రివర్గంలో చోటు, పార్టీ పదవులివ్వాలంటూ యాదవ సంఘం నేతల డిమాండ్
హైదరాబాద్, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రివర్గంలో గొల్ల, కురుమలకు చోటు కల్పించాలని.. పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టుల్లోనూ ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ యాదవ సంఘం నేతలు వినూత్న నిరసనకు దిగారు. ఓ వైపున టీపీసీసీ కమిటీలతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌లు భేటీలు పెట్టుకోగా.. మరోవైపు గాంధీభవన్‌లోకి గొర్రెలు, మేకలను తోలుకొచ్చి యాదవ సంఘాల నేతలు నిరసన తెలిపారు.
విషయం తెలుసుకున్న మహేశ్‌గౌడ్.. యాదవ సంఘాల నేతలను పిలిచి మాట్లాడారు. రానున్న స్థానిక ఎన్నికల్లోనూ, కార్పొరేషన్ చైర్మన్ పోస్టుల్లోనూ గొల్ల కురుమలకు అవకాశం కల్పిస్తామని హామీనిచ్చారు. గొల్ల, కురుమలకు మంత్రివర్గంలో చోటు కల్పించే విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానన్నారు. గొల్ల, కురుమల వృత్తిపరమైన సమస్యలపై పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో మాట్లాడిన మహేశ్ గౌడ్.. వాటిని వెంటనే పరిష్కరించాలని సూచించారు.