Mahesh Goud: స్థానికంలో మహిళా నేతలకు ప్రాధాన్యం
ABN , Publish Date - Aug 19 , 2025 | 04:17 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళా కాంగ్రెస్ నేతలకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పారు...
పదవులు రాలేదని నిరాశ వద్దు: మహేశ్ గౌడ్
హైదరాబాద్, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళా కాంగ్రెస్ నేతలకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు కచ్చితంగా గుర్తింపునిస్తామన్నారు. సోమవారం గాంధీభవన్‌లో జరిగిన మహిళా కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మహేశ్ గౌడ్ మాట్లాడారు. పదవులు రాలేదని నిరాశ చెందవద్దని, మహిళా కాంగ్రెస్ నేతలకు పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. స్థానిక ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఉన్నందున.. మహిళా కార్యకర్తలంతా కలిసి సమన్వయంతో ముందుకు సాగాలని మహిళా కాంగ్రెస్ తెలంగాణ పరిశీలకులు కమలాక్షి చెప్పారు. కాగా, సుభాష్ చంద్రబోస్ వర్ధంతి సందర్భంగా గాంధీభవన్‌లో ఆయన చిత్రపటానికి మహేశ్ గౌడ్ నివాళులర్పించారు.