Vikarabad: తాను నీళ్లలోకి దూకి.. ఇద్దరిని చావులోకి నెట్టింది
ABN , Publish Date - Aug 06 , 2025 | 04:18 AM
ఆత్మహత్య చేసుకునేందుకు బావిలో దూకిన ఆమె ప్రాణాలతో బయటపడింది. ఆమెను రక్షించేందుకు నీళ్లలోకి దూకిన ఆమె భర్త, సోదరి మాత్రం ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది.
భర్తతో గొడవ పడి బావిలో దూకిన భార్య.. సురక్షితంగా ఒడ్డుకు
కాపాడేందుకు నీళ్లలో దూకిన భర్త, సోదరి మృతి
మోమిన్‌పేట్, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): ఆత్మహత్య చేసుకునేందుకు బావిలో దూకిన ఆమె ప్రాణాలతో బయటపడింది. ఆమెను రక్షించేందుకు నీళ్లలోకి దూకిన ఆమె భర్త, సోదరి మాత్రం ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది. నాగర్‌కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి గ్రామానికి చెందిన గగ్గుల మాసయ్య (60), అలివేలు భార్యాభర్తలు. ఈ దంపతులు, వారి కుటుంబ సభ్యులు మూడు నెలల క్రితం మోమిన్‌పేట్ మండలంలోని చీమలదరి గ్రామ సమీపంలోని ఓ ప్రైవేటు వెంచర్‌లో పని చేసేందుకు వచ్చారు. సోమవారం రాత్రి మాసయ్య, అలివేలు గొడవపడ్డారు.
భర్త తీరుతో మనోవేదనకు గురైన ఆలివేలు ఆ వెంచర్‌కు ఆనుకొని ఉన్న బావిలోకి దూకింది. భార్యను కాపాడేందుకు మాసయ్య..ఆ వెంటనే అలివేలు చెల్లెల నాగమణి (50)బావిలోకి దూకారు. గమనించిన వెంచర్ కాంట్రాక్టర్ ప్రసాద్ బావి దగ్గరకు పరుగెత్తుకొచ్చి ముగ్గురినీ బయటకు తీసేందుకు నీళ్లలోకి దూకాడు. అతడు.. అలివేలును సురక్షితంగా ఒడ్డుకు చేర్చాడు. మాసయ్య, నాగమణి అప్పటికే నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. అలివేలును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.