Suicide Attempt: నాలుగో అంతస్తు కిటికీలోంచి దూకి..
ABN , Publish Date - Aug 07 , 2025 | 04:14 AM
తల్లిదండ్రుల ఇంట్లోంచి బయటపడేందుకు ఓ వివాహిత విఫలయత్నం చేసింది. నాలుగో అంతస్తు గదిలోని కిటికీలోంచి చీరను ఆసరాగా చేసుకొని దిగేందుకు ప్రయత్నించి తీవ్రంగా గాయపడి..
కన్నవారి ఇంట్లోంచి బయటపడేందుకు వివాహిత విఫలయత్నం.. తీవ్రగాయాలతో బ్రెయిన్‌డెడ్
ప్రేమ పెళ్లి.. భర్త వేధింపులతో గతంలోనే ఆత్మహత్యాయత్నం
ఇంటికి తెచ్చుకొని గదిలో పెట్టిన తల్లిదండ్రులు.. ఎస్సార్‌నగర్‌లో ఘటన
అమీర్‌పేట, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): తల్లిదండ్రుల ఇంట్లోంచి బయటపడేందుకు ఓ వివాహిత విఫలయత్నం చేసింది. నాలుగో అంతస్తు గదిలోని కిటికీలోంచి చీరను ఆసరాగా చేసుకొని దిగేందుకు ప్రయత్నించి తీవ్రంగా గాయపడి.. బ్రెయిన్ డెడ్ అయింది. మృతురాలు 33 ఏళ్ల రజిత. సనత్‌నగర్‌లో ఉంటున్న ఓ ఎస్సై కుమార్తె! ఎస్‌ఆర్‌నగర్ పోలీసుల వివరాల ప్రకారం.. రజిత సైకాలజీతో డిగ్రీ పూర్తిచేసింది. సైకాలజీ ఇంటర్న్‌షి్‌పలో భాగంగా బంజారాహిల్స్‌లోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్న రోజుల్లో ఆమెకు అక్కడ కేపీహెచ్‌బీకి చెందిన రోహిత్ (33)తో పరిచయమైంది. తాను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అంటూ అబద్ధం చెప్పి ఆమెకు రోహిత్ దగ్గరయ్యాడు. ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లయ్యాక.. రోహిత్ ఏ పనీ చేయకుండా జల్సాలకు అలవాటు పడ్డాడు. నగరంలోని ప్రముఖ ఇంటర్నేషనల్ పాఠశాలలో రజిత పనిచేస్తోంది.
ఆమె జీతం డబ్బులను కూడా రోహిత్ తీసుకొని ఖర్చు చేసేవాడు. చెడు అలవాట్లు మానుకోవాలని రజిత ఎన్నోసార్లు చెప్పినా కూడా అతడిలో మార్పు రాలేదు. రోహిత్ తల్లిదండ్రులు, సోదరుడు మోహిత్ అతడికే మద్దతు పలుకుతూ రజితను వేధించేవారు. రోహిత్ వేధింపులు భరించలేక రజిత గత నెల 16న నిద్రమాత్రలు మింగింది. ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స అనంతరం కోలుకున్న ఆమెను తల్లిదండ్రులు తమ ఇంటికి తీసుకెళ్లారు. అయితే ఆమెను బయటకు వెళ్లకుండా నాలుగో అంతస్తులో ఉన్న తమ ఇంట్లోని గదిలో ఉంచారు.. గత నెల 28న ఆమె ఇంట్లోంచి బయటపడేందుకు గదిలోని బాత్రూం కిటికీలోంచి చీరను తాడుగా చేసుకొని.. దాని ఆసరాగా కిందకు దిగేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో పట్టు తప్పడంతో నేరుగా కిందపడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను తల్లిదండ్రులు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదైంది.