ఏపీ థియేటర్లలో తనిఖీలు
ABN , Publish Date - May 29 , 2025 | 03:37 AM
ఏపీవ్యాప్తంగా సినిమా థియేటర్లలో మంగళవారం మొదలైన తనిఖీలు బుధవారం మరింత విస్తృతంగా కొనసాగాయి. రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.
కృష్ణాలో మంచినీటి బాటిల్ రూ.50కి విక్రయం
‘తూర్పు’లోని హాళ్లలో అధ్వానంగా పారిశుధ్యం
విజయనగరంలోని థియేటర్‌లో చిప్స్ ప్యాకెట్‌పై
తయారీ తేదీ జూన్ 1గా ముద్రణ.. నిలదీసిన జేసీ
చిత్తూరులో లైనెస్స్ లేకుండా నడుస్తున్న థియేటర్
పలుచోట్ల టికెట్ కన్నా పాప్‌కార్న్ ధరే ఎక్కువ
యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసిన అధికార్లు
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్) : ఏపీవ్యాప్తంగా సినిమా థియేటర్లలో మంగళవారం మొదలైన తనిఖీలు బుధవారం మరింత విస్తృతంగా కొనసాగాయి. రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. గుంటూరు జిల్లాలోని కొన్ని థియేటర్ల వద్ద తగినంత పార్కింగ్ ప్రదేశం లేకపోవడంతో వాహనదారులు వాటి ఎదుట రోడ్ల పైనే పార్కింగ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని పీవీఆర్ థియేటర్‌లో వాటర్ బాటిల్‌ను రూ.50కు విక్రయిస్తున్నట్లు తేలింది. తూర్పుగోదావరి జిల్లాలోని పలు థియేటర్లలో టికెట్లు, అల్పాహారం, కూల్‌డ్రింక్స్ ధరలు అధికంగా ఉన్నాయని, పారిశుధ్య నిర్వహణ సరిగాలేదని జేసీ చిన్న రాముడు తెలిపారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలోని థియేటర్లలో ఆహార పదార్థాలు, కూల్‌డ్రింక్స్ అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు పలువురు ప్రేక్షకులు అధికారులకు ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లాలో నిర్వహించిన తనిఖీల్లో కొన్ని థియేటర్లు లైసెన్స్ లేకుండా నడుస్తుంటే మరికొన్ని ఫైర్ సర్టిఫికెట్ లేకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ప్రేక్షకులకు కనీసం తాగునీరు ఏర్పాటు చేయడం లేదు.
మరుగుదొడ్ల దుర్వాసన వెదజల్లుతున్నాయి. సినిమా టికెట్ రేట్ల కన్నా పాప్‌కార్న్, తినుబండారాల ధరలు అధికంగా ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ ఫీజు ద్విచక్రవాహనానికి రూ.20, కారుకు రూ.40 చొప్పున వసూలు చేస్తున్నట్లు తేలింది. శ్రీకాకుళంలో ‘సూర్య మహల్’ థియేటర్‌లో పారిశుధ్యం మెరుగ్గా లేకపోవడం.. కూల్‌డ్రింక్‌లను విడిగా విక్రయిస్తుండటం.. ధరలు పట్టిక లేకపోవడం వంటి లోపాలను గుర్తించారు. అలాగే థియేటర్‌లో ఫుడ్ లైసెన్స్ కాలపరిమితి తీరిపోవడంతో థియేటర్ యాజమాన్యానికి నోటీసులు జారీచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. విజయనగరంలోని ఎన్‌సీఎ్‌స థియేటర్‌లో చిప్స్ ప్యాకెట్‌పై తయారీ తేదీ జూన్ 1గా ముద్రించి ఉండడం చూసి జేసీ సేతుమాధవన్ ఆశ్చర్యపోయారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని చాలా థియేటర్లలో నిబంధనలు అమలు కావడం లేదని, అధిక ధరలకు టికెట్లు, తినుబండారాలు విక్రయిస్తున్నారని తనిఖీల్లో వెల్లడైంది. అనంతపురంలోని గౌరీ సినీ కాంప్లెక్స్ నిర్వహణకు అనుమతి 2023 వరకే ఉన్నట్లు గుర్తించారు. అయితే తనిఖీల విషయం ముందస్తుగానే తెలిసిపోవడంతో కొన్ని థియేటర్ల యాజమాన్యాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిసింది.