Share News

భూములిచ్చినా ఏం లాభం!

ABN , Publish Date - Feb 17 , 2025 | 11:49 PM

ఆ రైతుల త్యాగాలు వృథా పోయాయి. చిన్న కాళేశ్వరం ఎత్తిపో తల పథకంలో భాగంగా గారెపల్లి నూతన రిజర్వా యర్‌, స్టేజ్‌-2 పంప్‌హౌస్‌ నిర్మాణం చేపడుతున్న ప్రభుత్వానికి తమ భూములను కట్టబెట్టారు. తమకు కొంత నష్టం జరిగినా రైతులందరికీ ప్రయోజనం చేకూరుతుందని భావించి జీవనాధారమైన వ్యవసా య భూములను ఇచ్చేశారు.

భూములిచ్చినా ఏం లాభం!
గారెపల్లి నూతన రిజర్వాయర్‌

పరిహారం రాక రైతుల పరేషాన్‌

చిన్నకాళేశ్వరం ప్రాజెక్టుకు భూములు సేకరించిన నాటి వైఎస్‌ సర్కారు

16 ఏళ్లుగా తప్పని నిరీక్షణ

దళారులదే ఇష్టారాజ్యం

రూ. 2కోట్ల మేర అవకతవకలు

అసలైన అన్నదాతలకు అందని పైకం

కాటారం, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): ఆ రైతుల త్యాగాలు వృథా పోయాయి. చిన్న కాళేశ్వరం ఎత్తిపో తల పథకంలో భాగంగా గారెపల్లి నూతన రిజర్వా యర్‌, స్టేజ్‌-2 పంప్‌హౌస్‌ నిర్మాణం చేపడుతున్న ప్రభుత్వానికి తమ భూములను కట్టబెట్టారు. తమకు కొంత నష్టం జరిగినా రైతులందరికీ ప్రయోజనం చేకూరుతుందని భావించి జీవనాధారమైన వ్యవసా య భూములను ఇచ్చేశారు. భూసేకరణ సేకరణకు తీవ్ర జాప్యమైంది. ఈ క్రమంలో కొందరు దళారులు రంగ ప్రవేశం చేశారు. వీరికి లంచావతారులైన అధికారులు తోడయ్యారు. కొందరు రైతులకు మాత్ర మే పరిహారం అందగా, అనర్హులు సైతం అందులో లబ్ధిపొందారు. నిఖార్సైన 50-60 మంది రైతులకు మాత్రం పరిహారం అందలేదు. 15 ఏళ్లుగా వీరు నిరీక్షిస్తున్నారు. చెప్పులు అరిగేలా అధికారులు, నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. అయినా వీరి ఆవేదనను ఆలకించే వారే కరువయ్యారు.

397 ఎకరాల భూమి సేకరణ

కాళేశ్వర-ముక్తీశ్వర ఎత్తిపోతల పథకం (చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు)లో భాగంగా గారెపల్లి నూతన రిజర్వాయర్‌, స్టేజ్‌-2 పంప్‌హౌస్‌ నిర్మాణం చేయడా నికి అధికారులు ప్రతిపాదించారు. 2008లో అప్పటి సీఎం దివంగత వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ఈ పథకానికి శంకుస్థాపన చేశారు. దీంతో గారెపల్లి రిజర్వాయర్‌, పంప్‌హౌస్‌ నిర్మాణం కోసం గారెపల్లి, చిద్నెపల్లి రెవెన్యూ శివారుల్లోని సుమారు 397 ఎకరాల భూమిని సేకరించడానికి అధికారులు ప్రతిపాదించా రు. అప్పట్లో ఎకరాకు రూ. 3.50 లక్షల పరిహారం చెల్లించడానికి అధికారులు నిర్ణయించారు. సేకరించి న భూమిలో పట్టా భూములతోపాటు పెద్ద ఎత్తున లావణీ పట్టా, ప్రభుత్వ అసైన్డ్‌ భూములు ఉన్నాయి. దీంతో అధికారులు ఎంజాయ్‌మెంట్‌ సర్వే జరిపి పరిహారం ఇవ్వడానికి పూనుకున్నారు.

16 ఏళ్లుగా ఎదురుచూపులు

నూతన రిజర్వాయర్‌, పంప్‌హౌస్‌ నిర్మాణం కోసం 2009లో భూసేకరణ చేపట్టారు. అయినా కొం దరికి నేటికీ పరిహారం అందలేదు. 16ఏళ్లయినా పరి హారం అందలేదని పలువురు భూనిర్వాసిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా సుమారు 50 ఎక రాల భూములకు సంబంధించిన పరిహారం 50-60 మందికి అందలేదని రైతులు అంటున్నారు. గతంలో ఎకరాకు పరిహారం కింద రూ. 3.50 లక్షలు చెల్లిం చగా ఇవి సరిపోవని పలువురు రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఐదేళ్ల క్రితం నూతన భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో పనులు నిలిపేయగా అధికా రులు స్పందిస్తూ ఎకరాకు రూ. 9 లక్షలు చెల్లిస్తామ ని హామీ ఇచ్చారు. దీంతో రైతులకు సు మారు రూ.4 కోట్ల మేర పరి హారం రావాల్సి ఉంది. అయితే.. అధికారులు, నాయకుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా ఫలితం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వే నంబర్లు 41, 42, 44, 48, 49, 53, 54, 60, 192, 196, 197, 199లలో సుమారు 50ఎకరాల మేర భూమికి పరిహా రం రావాల్సి ఉందని, ఒక్క 41 సర్వే నంబర్‌లోనే 33 ఎకరాలకు పరిహారం అందలేదని రైతులు అంటున్నారు. అధికారులేమో 41 సర్వే నంబర్‌లో మొత్తం డబ్బులు ముట్టాయని అనధికారికంగా చెప్పడం గమ నార్హం. దంతెలపల్లికి చెందిన ఓ నిరుపేద దళిత దం పతులు ఎదురు చూసి చూసి మరణించగా అనాఽథగా మారిన వారి కుమారుడికి ఇంకా పరిహారం దక్కలేదు.

భారీ అవకతవకలు

భూసేకరణలో కొందరు దళారులు, నాయకులు చేతివాటం ప్రదర్శించారనే ఆరోపణలు ఉన్నాయి. పాత రెవెన్యూ రికార్డుల్లో భూమి ఉండగా క్షేత్రస్థా యిలో భూమి లేని వారికి పరిహారం అంది నట్లు పలువురు ఆరోపి స్తున్నారు. భూమి పట్టా ఒకరి పేరిట ఉండగా కాస్తు లో వేరే వాళ్లు ఉండటంతో అవకతవకలు చోటుచేసు కున్నట్లు, అప్పటి కొందరు అధికారులు దళారులకు సహకరించినట్లు బహిరంగ ఆరోపణులున్నాయి. లావణీ పట్టా, అసైన్డ్‌ భూములు ఉండటంతో రికా ర్డుల ప్రకారం పేర్లు ఉన్నవారు, భూములను సాగు చేసుకుంటున్న వారి మధ్య ఒప్పందం చేయిస్తామని, పరిహారం ఇప్పిస్తామని కొందరు దళారులు రైతుల వద్ద లక్షలాది రూపాయలు డబ్బులు దండుకోవడం, అనర్హులకు పరిహారం అందేలా చూడటం వంటి పనులతో తమ పంట పండించుకున్నారు. ఓ దళారీ పరిహారం వచ్చేలా చూస్తామని చెప్పి ఎకరాకు రూ. లక్ష చొప్పున వసూలు చేశాడని రైతులు ఆరోపిస్తు న్నారు. అప్పటి అధికారుల సహకారంతో భూమి లేని వారి పేరిట, గుంటల్లో భూమి ఉన్న వారికి ఎకరాల్లో పరిహారం అందేలా దళారులు స్కెచ్‌ వేసి కోట్లు కొల్లగొట్టారు. వీరికి పలు పార్టీల నాయకులు తానాతందానా అంటూ సహకరించారనే ఆరోపణులు వినిపిస్తున్నాయి. కొందరు తక్కువ భూమి కలిగిన వారికి అప్పటి సర్వే, రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు, కొందరు నాయకులు అండదండలుగా ఉండటంతో రూ.2కోట్లకు పైగా స్వాహాపర్వం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. సర్వే నంబర్‌ 41లో 33ఎకరాలకు పైగా పరిహారం రాలేదని అర్హులైన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తుండగా అధికారులు మాత్రం ఆ సర్వే నంబర్‌ మొత్తానికి పరిహారం ముట్టినట్లు రికార్డుల్లో ఉందని చెబుతున్నారు. ఇటీవల మంత్రి శ్రీధర్‌బాబుకు పలువురు భూనిర్వాసిత రైతులు పరిహారం అందలేదని తమ బాధలు తెలపగా అధికారులను ప్రశ్నించడంతో సర్వే నెంబర్‌ 41లోనే కాకుండా పూర్తి స్థాయిలో భూసేకరణకు పరిహారం డబ్బులు ముట్టాయని చెప్పినట్లు, దీంతో మంత్రి అనర్హుల నుంచి రెవెన్యూ రికవరీ యాక్ట్‌ ప్రయోగించైనా డబ్బులు వసూలు చేసి అర్హులకు పరిహారం ఇవ్వాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు స్పందించి అర్హులమైనా ఇంకా పరిహారం అందని రైతులకు వెంటనే పరిహారం చెల్లించడంతో పాటు భారీ అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు, ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

రీ సర్వే పేరిట కొత్త ప్లాన్‌

ఓ వైపు అర్హులైన తమకు పరిహారం అందలేదని కొందరు రైతులు వ్యయప్రయాసలకు లోనవుతుండగా, ఇదే అదనుగా వారికి పరిహారం వచ్చేందుకంటూ కొందరు రీ సర్వే పేరిట అధికారులతో కుమ్మక్కై కొత్తగా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. క్షేత్ర స్థాయిలో పర్యటించకుండానే కొందరు చెప్పినట్లు ఒకరిద్దరు అధికారులు గుడ్డిగా రీ సర్వే పేరిట 14గుంటలున్న వారికి ఎకరానికి పైగా ఉన్నట్లు, ఇలా చాలామంది పేరిట పరిహారం కోసం ప్రతిపాదనలు తయారుచేశారని పలువురు ఆరోపిస్తున్నారు. ఓవైౖపు అవకతవకలు జరిగి కోట్లాది పరిహారం డబ్బులు స్వాహా అయ్యాయని రైతులు అంటుండగా, సేకరించిన భూములన్నింటికీ డబ్బులు చెల్లించినట్టు అధికారులు చెబుతున్నారు. ఇంకోవైపు కొత్త ప్రతిపాదనలతో మరోసారి ప్రభుత్వాన్ని బోల్తాకొట్టించి ప్రజాధనం స్వాహా చేయాలని మరికొందరు ప్లాన్‌ చేస్తున్నారని తెలుస్తోంది.

1.16 ఎకరాలకు పరిహారం రాలేదు..

- తైనేని రాజక్క, సబ్‌స్టేషన్‌పల్లి

గారెపల్లి నూతన రిజ ర్వాయర్‌ ని ర్మాణం కోసం భూమిని తీసుకున్నారు. భూమి తీసుకున్నారు గానీ డబ్బులు ఇవ్వలేదు. 16ఏళ్లుగా పరిహారం అందక ఎదురుచూస్తున్నాం. గారెపల్లి శివారు 49సర్వే నంబర్‌లో ఎకరం 16 గుంటల భూమికి సంబంధించి డబ్బులు రావాల్సి ఉంది. జీవనాధారమైన భూములను కోల్పోయి పరిహారం కూడా అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.

పైసలు రాక పరేషాన్‌ అవుతున్నం..

- బౌతు ఆశమ్మ, దంతెలపల్లి

మా కుటుంబానికి చెందిన రెండెకరాల భూమి రిజర్వాయర్‌ కింద పోయింది. గారెపల్లి శివారు 41 సర్వే నంబర్‌లో రెండెకరాల మంచి పంటలు పండే భూమిని కోల్పోయినాం. పరిహారం వస్తే ఎక్కడైనా భూమి కొనుక్కొని బతుకుదామని అనుకున్నాం. 16 ఏళ్లు అవుతున్నా ఇప్పుడు, అప్పుడు అంటూ కాలం గడుపుతున్నారు. కలెక్టర్‌ స్పందించి భూములు ఇచ్చిన రైతులకు పరిహారం అందియ్యాలే.

Updated Date - Feb 17 , 2025 | 11:49 PM