మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించం
ABN , Publish Date - Jan 23 , 2025 | 12:54 AM
రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని నల్లగొండ పట్టణ కాంగ్రెస్ అఽధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి, మునిసపిల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు.
నల్లగొండ, జనవరి 22(ఆంధ్రజ్యోతి): రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని నల్లగొండ పట్టణ కాంగ్రెస్ అఽధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి, మునిసపిల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. జిల్లాకేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భూపాల్‌రెడ్డి ఇప్పటికైనా భాష మార్చుకోవాలని, లేనిపక్షంలో తగిన గుణపాఠం చెబుతామన్నారు. ప్రతిపక్ష పార్టీలు ధర్నాలు, నిరసనలు ప్రజాస్వామ్య పద్ధతిలో చేయాలని, గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పినా మారకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో భూపాల్‌రెడ్డి కనీసం కౌన్సిలర్‌గా కూడా గెలవలేరని, ఆయన వల్ల బీఆర్‌ఎస్ పార్టీ పరువు పోతుందన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఇప్పటికైనా కంచర్లను ఇన్‌చార్జి పదవి నుంచి తొలగిస్తేనే పార్టీ కొంతమేరకైనా ఉంటుందని, లేకపోతే గల్లీ పార్టీగా మారుతుందన్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి మాదిరిగానే భూపాల్‌రెడ్డి గొడవలు సృష్టిస్తే బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్ష పదవి దక్కుతుందని ఆశిస్తున్నారని, ఆయనకు ఆ పదవి ఇస్తే పార్టీ ఊడ్చుకపోతుందని ఎద్దేవా చేశారు. అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే తగిన గుణపాఠం చెబుతామని, అభివృద్ధికి కోమటిరెడ్డి బ్రాండ్ అంబాసిడర్ అని అన్నారు. భూపాల్‌రెడ్డి వెంట గుండాలు, రౌడీలు, గంజాయి బ్యాచ్ ఉంటుందని వారిని వెంట వేసుకునే దౌర్జన్యాలకు పాల్పడతారన్నారు. ఈ సమావేశంలో మునిసిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ జడ్పీటీసీలు వంగూరి లక్ష్మయ్య, పాశం రాంరెడ్డి, బషిరోద్దీన్, పాశం సంపత్ రెడ్డి, మారగోని నవీన్ గౌడ్, కేసాని వేణుగోపాల్ రెడ్డి, జూలకంటి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.