Water Resources Department: నీటిపారుదలలో ముగిసిన పదోన్నతులు
ABN , Publish Date - Aug 30 , 2025 | 01:36 AM
రాష్ట్ర నీటి పారుదల శాఖలో 33 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత.. శాఖాపరమైన పదోన్నతుల కమిటీ (డీపీసీ) ద్వారా చేపట్టిన పదోన్నతుల ప్రక్రియ ముగిసింది.
33 ఏళ్ల తర్వాత డీపీసీ ద్వారా ప్రక్రియ
మంత్రి ఉత్తమ్ చొరవతో వీడిన ‘సీనియారిటీ’ వివాదం
హైదరాబాద్, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర నీటి పారుదల శాఖలో 33 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత.. శాఖాపరమైన పదోన్నతుల కమిటీ (డీపీసీ) ద్వారా చేపట్టిన పదోన్నతుల ప్రక్రియ ముగిసింది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా (ఏఈఈ) ఉన్న 91 మందికి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు (డీఈఈ)గా, డీఈఈలుగా ఉన్న 91 మందికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు(ఈఈ)గా పదోన్నతికి డీపీసీ ఆమోదం తెలిపింది. చీఫ్ ఇంజనీర్(ఎంక్వయిరీ్‌స)గా పనిచేస్తున్న మహ్మద్ అంజద్ హుస్సేన్‌కు రెగ్యులర్ ఈఎన్‌సీ(జనరల్)గా పోస్టింగ్ ఇచ్చారు. దీంతో నీటిపారుదలశాఖలో ప్రతీ దశలో పదోన్నతుల ప్రక్రియ పూర్తయినట్లైయింది. కాగా, గత మూడు దశాబ్దాల కాలంలో డీపీసీ లేకుండా, నిబంధనలు సవరించి తాత్కాలిక ప్రాతిపదికన పదోన్నతులు ఇస్తూ వచ్చారు.
ఈసారి మాత్రం డీపీసీని ఏర్పాటు చేసి ఆ ప్రక్రియ పూర్తి చేశారు. నీటిపారుదలశాఖలో మూడు దశాబ్దాలుగా డీపీసీ లేకపోవటానికి సీనియారిటీ వివాదమే కారణమని తేలటంతో ఈ అంశంపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చొరవ చూపారు. జనవరి 10వ తేదీన ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు తీర్పు వెలువడింది. దాంతో వెనువెంటనే అన్ని స్థాయిల్లో పదోన్నతులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం కుంగుబాటుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేయడంతో.. ఆ జాబితాలో ఉన్నవారందరికీ ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. షోకాజ్ నోటీసులు అందుకున్న వారిని పదోన్నతుల ప్రక్రియ నుంచి తప్పించి.. మిగిలిన వారికి ప్రమోషన్లు ఇచ్చారు.