సాగునీటి చిక్కులు ‘సమ్మక్క’ తీర్చేనా!?
ABN , Publish Date - Sep 25 , 2025 | 12:26 AM
సమ్మక్క సాగర్ బ్యారేజీకి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌వోసీ) ఇవ్వడానికి చత్తీ్‌సగడ్ సానుకూలత వ్యక్తం చేయటం రైతుల్లో హర్షం వ్యక్తం అవుతుండగా.. కొత్త ఆయకట్టుపై సీడబ్ల్యుసీ అభ్యంతరాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కింద చూపించిన ఎస్సారెస్పీ-2 ఆయకట్టును సమ్మక్క సాగర్ కింద చూపించటం ఏమిటని సీడబ్ల్యుసీ ప్రశ్నిస్తోంది. సమ్మక్కసాగర్‌కు కొత్త ఆయకట్టు చూపించాలని సీడబ్ల్యుసీ కోరుతోంది.
సమ్మక్క సాగర్‌కు ఎన్‌వోసీకి చత్తీ్‌సగడ్ సానుకూలతపై హర్షం
కాళేశ్వరం, సమ్మక్క సాగర్ కింద ఎస్సారెస్పీ-2 రెండు లక్షల ఎకరాల ఆయకట్టు
రెండు ప్రాజెక్టుల కింద ఒకే ఆయకట్టును చూపటంపై సీడబ్ల్యుసీ అభ్యంతరాలు
ఎన్‌వోసీ వచ్చినా.. కొత్తగా 2లక్షల ఎకరాల ఆయకట్టు చూపిస్తేనే అనుమతులు
కాళేశ్వరం ఎత్తిపోతలు నిలిచిపోవటంతో ఎస్సారెస్పీ-2కింద సాగునీటికి కొరత
సీతారామ ప్రాజెక్టుకొత్త డిజైన్‌లో మహబూబాబాద్, డోర్నకల్‌కు దక్కని చోటు
పాకాల నుంచి బయ్యారం వరకు గోదావరి జలాలను మళ్లించాలంటున్న రైతులు
సమ్మక్క నీళ్లు ఎస్సారెస్పీ-2 స్థిరీకరణ, పాకాల-బయ్యారం కొత్త ఆయకట్టుకా..?
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, వరంగల్ : సమ్మక్క సాగర్ బ్యారేజీకి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌వోసీ) ఇవ్వడానికి చత్తీ్‌సగడ్ సానుకూలత వ్యక్తం చేయటం రైతుల్లో హర్షం వ్యక్తం అవుతుండగా.. కొత్త ఆయకట్టుపై సీడబ్ల్యుసీ అభ్యంతరాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కింద చూపించిన ఎస్సారెస్పీ-2 ఆయకట్టును సమ్మక్క సాగర్ కింద చూపించటం ఏమిటని సీడబ్ల్యుసీ ప్రశ్నిస్తోంది. సమ్మక్కసాగర్‌కు కొత్త ఆయకట్టు చూపించాలని సీడబ్ల్యుసీ కోరుతోంది. దీంతో ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టుకు అలైన్‌మెంట్ మార్పులతో మహబూబాబాద్, డోర్నకల్, ఇల్లందు నియోజకవర్గాలకు సాగునీరు అందే పరిస్థితి లేనందున, పాకాల వరకు వెళుతున్న గోదావరి జలాలను బయ్యారం వరకు మళ్లించి కొత్తగా సమ్మక్కసాగర్‌కు ఆయకట్టును సృష్టించవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే సమ్మక్క నీళ్లను పాకాల నుంచి బయ్యారం మళ్ళిస్తే.. కాళేశ్వరం ఎత్తిపోతలు లేకపోవటంతో ఎస్పారెస్పీ-2 కింద రైతులకు సాగునీటి పరిస్థితి ఏమిటనే ఆందోళన వ్యక్తం అవుతోంది. దీంతో సమ్మక్కసాగర్ నీటితో ఎస్సారెస్పీ-2 ఆయకట్టును స్థిరీకరించాలా? లేక పాకాల- బయ్యారం లింకులో కొత్త ఆయకట్టు సృష్టించాలానే సందిగ్ధం అధికారయంత్రాంగంలో నెలకొంది.
ఎస్సారెస్పీ-2పై అభ్యంతరాలు
దేవాదుల ఎత్తిపోతలను పెంచేందుకు ప్రభు త్వం 2018లో తుపాకులగూడెం వద్ద గోదావరి పై సమ్మక్కసాగర్‌ను నిర్మించింది. ఈ బ్యారేజీతో 6.94 టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉంది. ఈ ప్రాజెక్టుకు ఇన్నాళ్లు కొర్రీలు పెట్టిన చత్తీ్‌సగడ్ ప్రభుత్వం ఇటీవలే సానుకూల వ్యక్తం చేయటం రైతుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. దేవాదులు మూడు దశల పనులు పూర్తి కావస్తుడటంతో పాటు భూసేకరణపై ప్రభుత్వం దృష్టి సారించటంతో దేవాదుల కల సాకారం అవుతుందనే ఆనందం రైతుల్లో వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలో సాగునీటిపై కొత్త చిక్కులు తెరపైకి వస్తున్నాయి. సమ్మక్కసాగర్ నుంచి 2,51,310 హెక్టార్లకు సాగునీటితో పాటు ఎస్సారెస్పీ ఫేస్-2లో 1,78,000హెక్టార్ల (4.45లక్షల ఎకరాలు) ఆయకట్టును స్థిరీకరించనున్నట్లుగా సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)లో పేర్కొన్నారు. అయితే ఇదే ఆయకట్టును కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్‌లో ప్రభుత్వం చూపించింది. ఎస్సారెస్పీ-2 పరిధిలోని ఆయకట్టును కాళేశ్వరం ప్రాజెక్టు, సమ్మక్కసాగర్‌లకు రెండింటికి డీపీఆర్‌లో చూపించటంపై కేంద్ర జలవనరుల సంఘం అభ్యంతరాలు తెలిపింది. ఎస్సారెస్పీ రెండో దశ ఆయకట్టును కాళేశ్వరం ప్రాజక్టుకే పరిమితం చేస్తే, సమ్మక్కసాగర్ సంబంధించిన ప్రాజెక్టు ప్రయోజనాల వ్యయం(కాస్ట్ బెనిఫిట్‌రేషియో) తగ్గుతోంది. ప్రస్తుత డీపీఆర్‌లో ఒక రూపాయి ఈ ప్రాజక్టుపై ఖర్చు చేస్తే.. కొత్త పాత ఆయకట్టుల ద్వారా రూ.1.67 లాభం వస్తుందని సీడబ్ల్యుసీకి తెలిపారు. కానీ ఎస్సారెస్పీ-2 ఆయకట్టును తొలగిస్తే రూపాయిన్నర ఖర్చుకు రూపాయి వరకు కూడా ప్రయోజనం కనిపించడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో సమ్మక్క బ్యారేజ్ కింద కొత్తగా రెండు లక్షల ఆయకట్టును చూపాలంటూ కేంద్ర జల సంఘం సూచించింది.
సీతారామ కష్టాలను సమ్మక్క తీర్చేనా..?
భద్రాద్రి కొత్తగూడెంలో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టును ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల్లో 6.74 లక్షల ఎకరాలకు గోదావరి నీరు అందించేందుకు ప్రభుత్వం చేపట్టింది. అయితే కిన్నెరసాని అభయారణ్యం కారణంగా అనుమతులు రావడంలో ఆలస్యం జరుగుతోంది. దీంతో ప్రభుత్వం ఇటీవల సీతారామ ప్రాజెక్టు అలైన్‌మెంట్‌లో మార్పులు చేసింది. ఈ మార్పులతో మహబాబూబాద్, డోర్నకల్, ఇల్లెందు నియోజకవర్గాలోని బీడు భూములకు గోదావరి నుంచి నీరందే పరిస్థితి లేదు. సీతారామ ప్రాజెక్టుకు 2016లో శంకుస్థాపన చేసినప్పుడు టేకులపల్లి మండలంలోని రోళ్లపాడు వద్ద 16 టీఎంసీల సామర్ధ్యంతో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను ప్రతిపాందించారు. ఈ రిజర్వాయర్ నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారానే ఇల్లెందు, మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాలకు నీరందించే వీలుంది. ఎలాంటి చిక్కులు లేకుండా సమ్మక్క బ్యారేజీ నుంచి మహబూబాబాద్ జిల్లా బయ్యారం నుంచి రోళ్లపాడుకు నీరందించి, ఆ లోటును భర్తీ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా సమాచారం. ఇప్పటికే సమ్మక్క సాగర్ నీరు దేవాదుల ద్వారా రామప్ప వరకు చేరుతోంది. రామప్ప నుంచి వరంగల్ జిల్లా పాకాల సరస్సులోకి మళ్లిస్తున్నారు. పాకాల నుంచి మహబూబాబాద్ జిల్లా బయ్యారం పెద్ద చెరువులోకి మళ్లించి, అక్కడి నుంచి ఇల్లందులోని రోళ్లపాడు రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలను మళ్లిస్తే.. సీతారామ ప్రాజెక్టు లక్ష్యం నెరవేరే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే అంశంపై ఇటీవల మంత్రి ఽసీతక్క, ప్రభుత్వం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. కొత్తగా లక్ష ఎకరాలకు వరకు సాగునీరు అందించటంతో పాటు మరో లక్ష ఎకరాల ఆయకట్టు స్థిరీకరించవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఎస్సారెస్పీ-2 ఆయకట్టుకు నీటి కష్టాలేనా..?
శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు రెండు దశల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 4.74లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఇందులో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎస్సారెస్పీ-1 కింద 3,64,078 ఎకరాల్లో, ఎస్సారెస్పీ-2 కింద 1,09,512 ఎకరాల ఆయకట్టు ఉందని అంచనా. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఈ ఆయకట్టును స్థిరీకరిస్తున్నట్లుగా గత ప్రభుత్వం కేంద్ర జలమండలికి నివేదిక ఇచ్చింది. అయితే సమ్మక్క సాగర్ నిర్మాణంతో దేవాదుల ఎత్తిపోతల కింద కొత్త ఆయకట్టును ఏర్పాటు చేయాల్సి వస్తోంది. దీంతో ఎస్సారెస్పీ-2 కింద రెండు లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరిస్తున్నట్లుగా ప్రభుత్వం సీడబ్ల్యుసీకి డీపీఆర్‌లో చూపించింది. రెండు ప్రాజెక్టుల కింద ఎస్సారెస్పీ ఆయకట్టును చూపించటంతో సీడబ్ల్యుసీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో కొత్తగా పాకాల-బయ్యారం- రోళ్లపాడు వరకు సమ్మక్కసాగర్ నీటిని ఎత్తిపోయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. మహబూబాబాద్, డోర్నకల్, ఇల్లందు నియోజకవర్గాలోని రైతులకు ప్రయోజనం చేకూరుతందని అంచనా వేస్తున్నారు. దీంతో ఎస్సారెస్పీ-2 కింద ఆయకట్టు రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వం పక్కన పెట్టింది. రెండేళ్లుగా కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోయటం లేదు. ఎస్సారెస్పీ-2 కింద ఉన్న సమ్మక్క సాగర్ నీటిని పాకాల- బయ్యారం మళ్లిస్తే.. తమ పరిస్థితి ఏమిటనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాలకుర్తి నియోజకవర్గంలో 44,942 ఎకరాలు, వర్ధన్నపేటలో 9,012 ఎకరాలు, డోర్నకల్‌లో 55,558 ఎకరాలకు ఎస్సారెస్పీ-2 ద్వారా గోదావరి జలాలు అందుతున్నాయి. భవిష్యత్తులో కూడా కాళేశ్వరం ఎత్తిపోతల చేపట్టే సూచనలు కనిపించటం లేదని, దీంతో ఎస్సారెస్పీ-2 కింద 1,09,512 ఎకరాల ఆయకట్టుకు మళ్లీ కరువు వస్తుందనే ఆవేదనలో రైతులు ఉన్నారు. దీంతో సీడబ్ల్యుసీ అభ్యంతరాలకు సమాధానం ఇచ్చి ఎస్పారెస్పీ-2 ఆయకట్టుకు నీటిని మళ్లించాలా? లేక కొత్త ఆయకట్టు కోసం పాకాల- బయ్యారం వరకు సమ్మక్కసాగర్ నీటిని ఎత్తిపోసేలా కొత్త డీపీఆర్‌ను తయారు చేయాలా అనే సందిగ్ధం అధికారుల్లో నెలకొంది.