స్కూల్ గేమ్స్‌పై నిర్లక్ష్యమేల?!
ABN , Publish Date - Sep 12 , 2025 | 12:39 AM
స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌జీఎ్‌ఫఐ) క్రీడా పోటీల నిర్వహణలో జాప్యం జరుగుతోంది. ఎస్‌జీఎ్‌ఫఐ తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు మొదటి, రెండో వారంలో మండలస్థాయి టోర్నమెంట్లు పూర్తి కావాలి. మూడో వారంలో జోనల్ (అంతర్‌మండల) టోర్నమెంట్స్‌తో పాటు జిల్లా టీమ్‌ల ఎంపిక జరగాలి.
ఇంకా ప్రారంభం కాని ఎస్‌జీఎ్‌ఫఐ క్రీడా పోటీల నిర్వహణ
కానరాని సన్నద్ధత.. అటకెక్కిన తొలి షెడ్యూల్..
ఎట్టకేలకు ఎస్‌జీఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీల నియామకం
మొదలుకాని మండల ఎస్‌జీఎఫ్ సెక్రెటరీల నియామకం
తాజా షెడ్యూల్‌కు మోక్షమెప్పుడు?
ఎదరుచూస్తున్న ఉమ్మడి వరంగల్ జిల్లా పాఠశాలల క్రీడాకారులు
హనుమకొండ, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌జీఎ్‌ఫఐ) క్రీడా పోటీల నిర్వహణలో జాప్యం జరుగుతోంది. ఎస్‌జీఎ్‌ఫఐ తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు మొదటి, రెండో వారంలో మండలస్థాయి టోర్నమెంట్లు పూర్తి కావాలి. మూడో వారంలో జోనల్ (అంతర్‌మండల) టోర్నమెంట్స్‌తో పాటు జిల్లా టీమ్‌ల ఎంపిక జరగాలి. సెప్టెంబర్ 2వవారంలో జిల్లా స్పోర్ట్స్ జోన్ టోర్నమెంట్స్‌తో పాటు ఎంపికలు, నాలుగోవారంలో రాష్ట్ర స్థాయి జిల్లా స్పోర్ట్స్ జోన్స్ టోర్నమెంట్‌తో పాటు ఎంపికలు జరగాలి. రాష్ట్రస్థాయి టీమ్‌ల ఎంపికలో పది ఉమ్మడి జిల్లాల స్పోర్ట్స్ జోన్స్ క్రీడాకారులు పాల్గొంటారు. ఇవి అక్టోబర్ మొదటి వారంలో జరగాలి.
అటకెక్కిన తొలి షెడ్యూల్
గత జూన్ 27న పాఠశాల విద్యా కమిషనర్ నవీన్ నికోలస్ ప్రకటించిన ఈ షెడ్యూల్ రాష్ట్రస్థాయిలో, జిల్లాల స్థాయిలో ఎస్‌జీఎ్‌ఫజీ సెక్రెటరీల నియామకం జరగకపోవడంతో అటకెక్కింది. వాస్తవంగా ఎస్‌జీఎఫ్ సెక్రెటరీల కాలపరిమితి రెండేళ్లు. ఈ యేడు మార్చినెలాఖరుతోనే ముగిసింది. ఆ వెంటనే ఏప్రిల్, లేదా మే నెలలో కొత్తవారి నియామకాల ప్రక్రియ పూర్తికావాలి. కానీ వీటిని ఆగస్టు వరకు నానబెట్టారు. 2025-26 సంవత్సరానికి ఎస్‌జీఎఫ్ క్రీడా పోటీల నిర్వహణకు షెడ్యూల్ జారీ అయినా కదలిక లేదు. ఆయా జిల్లాల స్థాయిలో ఎస్‌జీఎఫ్ క్రీడా పోటీల నిర్వహణ బాధ్యత సెక్రెటరీలది. వారే లేకపోవడంతో జూన్‌లో జారీ అయిన షెడ్యూల్ బట్టదాఖలైంది.
ఎట్టకేలకు..
5 నెలల తర్వాత ఎట్టకేలకు ఇటీవల నాలుగు జిల్లాలు హనుమకొండ, వరంగల్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు కొత్తగా ఎస్‌జీఎఫ్ సెక్రెటరీల నియామకం జరిగింది. మిగతా రెండు జిల్లాలు మహబూబాబాద్, ములుగు జిల్లాలకు ప్రస్తుతం ఉన్న సెక్రెటరీల కాలపరిమితి ఇంకో యేడు ఉండడంతో వారే కొనసాగుతున్నారు. హనుమకొండ జిల్లాకు కాజీపేట మండలం తరాలపల్లి హైస్కూల్ పీడీ వెలిశెట్టి ప్రశాంత్ కుమార్, వరంగల్ జిల్లాకు సారంగపాణి, జనగామ జిల్లాకు జనగామ జిల్లా పరిషత్ బాలికల పాఠశాల పీడీ ఆడెపు శ్రీనివాస్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు జయపాల్ నియమితులయ్యారు. మహబూబాబాద్ జిల్లాకు నెల్లికుదురు మండలం మునిగలవీడు ఉన్నత పాఠశాల పీడీ గండి సత్యనారాయణ, ములుగు జిల్లాకు వెంకటాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పీడీ బలుగు వేణు కొనసాగుతున్నారు.
జిల్లాతో పాటు మండల స్థాయిలో క్రీడా పోటీల నిర్వహణకు ప్రతీ మండలానికి ఒక ఎస్‌జీఎఫ్ సెక్రెటరీ ఉంటారు. ఉమ్మడి జిల్లాలోని 75 మండలాలకు ఒక్కొక్కరు చొప్పున నియామకం కావాల్సి ఉంది. ఈ ప్రక్రియ ఇంకా మొదలే కాలేదు. వీరి నియామకాలు పూర్తయితే తప్ప తొలుత మండల స్థాయిలో ఎస్‌జీఎఫ్ క్రీడా పోటీలు నిర్వహించే అవకాశం లేదు. కాగా, అండర్-19 (ఇంటర్మీడియట్ విద్య) విద్యార్థుల ఎస్‌జీఎఫ్ క్రీడా పోటీల నిర్వహణకు ఉమ్మడి జిల్లా అంతటికీ ఒక్కరే ఎస్‌జీఎఫ్ సెక్రెటరీ ఉంటారు. ఉమ్మడి జిల్లా అండర్-19 కళాశాలల ఆర్గనైజింగ్ సెక్రెటరీగా వెలిశెట్టి ప్రశాంత్ కుమారే నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం డీఈవో వాసంతి ఉత్తర్వులను జారీ చేశారు. రాష్ట్ర స్థాయిలో ఎస్‌జీఎఫ్ సెక్రెటరీ పోస్టు ఇటీవలే భర్తీ అయింది. ఐఏఎస్ అధికారిణి ఉషారాణి నియమితులయ్యారు.
కొత్త షెడ్యూల్ ఎప్పుడు?
ఎస్‌జీఎఫ్ క్రీడా పోటీల నిర్వహణకు కొత్త షెడ్యూల్ ఇంకా ఖారారు కాలేదు. జిల్లా ఎస్‌జీఎఫ్ సెక్రెటరీలతో జరిగే సమావేశంలో దీనిని ఖారారు చేస్తారు. క్రీడా పోటీల నిర్వహణపై ఇటీవల జూమ్ సమావేశం మాత్రమే జరిగింది.. కానీ పూర్తిస్థాయి సన్నాహక సమావేశం జరగక పోవడంతో తాజా షెడ్యూల్ ఖరారులో జాప్యం జరుగుతోంది. సెప్టెంబర్ 2వ తేదీన హైదరాబాద్‌లో ఎస్‌జీఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీతో జిల్లా ఎస్‌జీఎఫ్ సెక్రెటరీల సమావేశం జరగనున్నట్టు తెలుస్తోంది. ఇందులో షెడ్యూల్ ఖరారైతే తప్ప.. ఎస్‌జీఎఫ్ క్రీడా పోటీలు ప్రారంభం కావు.
ఆరు నుంచి ఇంటర్ వరకు..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 5800కుపైగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటితో పాటు 250కిపైగా కేజీబీవీలు, గురుకులాలు, ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో పాఠశాల స్థాయిలో చదువుతున్న విద్యార్థులు అండర్ -14, అండర్ -17 విభాగంలో, ఇంటర్ విద్యార్ధులు అండర్-19 విభాగంలో బాల బాలికలకు వేర్వేరుగా వాలీబాల్, ఖోఖో, కబడ్డీ పోటీలు నిర్వహిస్తారు. వీటితో పాటు అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, చదరంగం, టెన్నిస్, బాస్కెట్‌బాల్ తదితర క్రీడల్లో కూడా పోటీలు జరుగుతాయి. ఇక్కడ ప్రతిభ చాటిన విద్యార్థులు జాతీయ స్థాయి వరకు రాణించేందుకు అవకాశం ఉంటుంది. ఏ ఏ క్రీడలు ఎక్కడ నిర్వహించాలి? మండల స్థాయిలో ఎవరికి బాధ్యతలు అప్పగించాలి? నిధుల ఖర్చు తదితర అంశాలపై జిల్లా సమావేశంలో నిర్వహించి కార్యాచరణ రూపొందించాల్సి ఉండగా ఆ దిశగా అడుగులు పడకపోవడంతో బడుల్లో ఎస్‌జీఎఫ్ క్రీడా పోటీల నిర్వహణకు సంబంధించిన సన్నద్ధత కనిపించడం లేదు.