Share News

కవిత వెంట నడిచేదెవరు!?

ABN , Publish Date - Sep 03 , 2025 | 12:38 AM

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ, కేసీఆర్‌ తనయ కల్వకుంట్ల కవిత సస్పెన్షన్‌ ఎపిసోడ్‌... ఉమ్మడి జిల్లాలో ఉత్కంఠ రాజకీయాలకు తెరతీసింది. ఊహించినట్టుగానే బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం కవితను పార్టీ నుంచి గెంటేయడంతో అటు బీఆర్‌ఎస్‌, ఇటు జాగృతి శ్రేణులు అయోమయంలో పడిపోయాయి. తాజా పరిణామాలతో గులాబీ కండువాతో పాటు జాగృతి కండువా కప్పుకుని పని చేసిన నేతలు.. ఎటుపోవాలో తేల్చుకోలేని సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు.

కవిత వెంట నడిచేదెవరు!?

  • బీఆర్‌ఎస్‌ నుంచి సస్పెన్షన్‌తో అయోమయంలో గులాబీ, జాగృతి కేడర్‌

  • ఇన్నాళ్లు కలిసి పని చేసిన గులాబీ, జాగృతి శ్రేణులు

  • బీఆర్‌ఎ్‌సలో కొనసాగడమా..? కవిత వెంట వెళ్లడమా..?

  • సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్న నాయకులు, శ్రేణులు

  • జాగృతిలో కీలక నేతగా ఉన్న దాస్యం విజయ్‌భాస్కర్‌ బీఆర్‌ఎస్‌ వైపే..

  • ఇప్పటికే సింగరేణి టీజీబీకేఎస్‌ నుంచి కవితకు చెక్‌

  • ముఖ్య నేతలతో కవితకు సత్సంబంధాలు అంతంత మాత్రమే

  • తాజా పరిణామాలపై ఓరుగల్లు గులాబీ శ్రేణుల్లో ఉత్కంఠ

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ, కేసీఆర్‌ తనయ కల్వకుంట్ల కవిత సస్పెన్షన్‌ ఎపిసోడ్‌... ఉమ్మడి జిల్లాలో ఉత్కంఠ రాజకీయాలకు తెరతీసింది. ఊహించినట్టుగానే బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం కవితను పార్టీ నుంచి గెంటేయడంతో అటు బీఆర్‌ఎస్‌, ఇటు జాగృతి శ్రేణులు అయోమయంలో పడిపోయాయి. తాజా పరిణామాలతో గులాబీ కండువాతో పాటు జాగృతి కండువా కప్పుకుని పని చేసిన నేతలు.. ఎటుపోవాలో తేల్చుకోలేని సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. బీఆర్‌ఎ్‌సలో కొనసాగటమా..? జాగృతి వెంట నడవటమా..? అనేది ఉత్కంఠగా మారింది. మాజీ ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయభాస్కర్‌ సోదరుడు విజయభాస్కర్‌ ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో జాగృతి కీలక నేతగా ఉన్నారు. కవితకు సన్నిహితుడిగా పేరుపొందారు. తాజా పరిణామాల్లో ఆయన గులాబీ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నట్లుగా సమాచారం. విభజిత జిల్లాల్లోని కవిత అనుచర నేతల స్టాండ్‌ ఏమిటనేది ఇంకా తేలాల్సివుంది. బీఆర్‌ఎ్‌సలోని కీలక నేతలు, అసంతృప్తనేతలు కవిత వెంట నడుస్తారా? అనేది కూడా చర్చనీయాంశంగా మారింది.

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, వరంగల్‌ : బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ కుమార్తె, ఎమ్మెల్సీ కవితపై పార్టీ అధిష్ఠానం వేటు వేయడం కలకలం రేపుతోంది. పార్టీ వ్యతరేక కలాపాలకు పాల్పడుతుండటంతో కవితను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లుగా బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ప్రకటించింది. దీంతో ఉమ్మడి వరంగల్‌ గులాబీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి తెలంగాణ జాగృతి పేరుతో కవిత బీఆర్‌ఎ్‌సతో కలిసి పని చేశారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో తెలంగాణ జాగృతికి బలమైన కేడర్‌ ఉండేవారు. మాజీ ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ సోదరుడు దాస్యం విజయ్‌భాస్కర్‌తో పాటు అనేక మంది కీలక నేతలు తెలంగాణ జాగృతి కార్యక్రమాలు చేపట్టారు. ఏటా ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించటంతో మహిళలకు బాగా చేరువైంది. విద్యార్థులను కలుపుకుని తెలంగాణ ఉద్యమంలో జాగృతి కార్యకర్తలు చురుకుగా పాల్గొన్నారు. కాకతీయ యూనివర్సిటీ సమస్యలపైన జాగృతి కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. కొన్నేళ్లుగా బీఆర్‌ఎ్‌సతో కలిసి జాగృతి కార్యకర్తలు అనేక ఉద్యమాల్లో పాల్గొన్న చరిత్ర ఉంది. అయితే చాలామంది కార్యకర్తలు, నాయకులు జాగృతి కార్యక్రమాల్లో పాల్గొంటూనే బీఆర్‌ఎస్‌ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. కవితను పార్టీ నుంచి బహిష్కరించటంతో పార్టీ, జాగృతిలో పని చేస్తున్న కేడర్‌ సందిగ్ధంలో పడిపోయింది. కవిత కొత్తగా పార్టీని ఏర్పాటు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో కవితతో పాటు కొత్త పార్టీలోకి వెళ్లాలా? లేక ఉద్యమం నుంచి కొనసాగుతున్న బీఆర్‌ఎ్‌సలోనే ఉండిపోవాలా? అనే అయోయం నెలకొంది.

కవిత వెంట నడిచేదెవరు..?

పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్సీ కవితకు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మద్దతుగా నిలిచే బలమైన నాయకులు ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. ఓరుగల్లు నుంచి జాగృతి కార్యక్రమాలను పర్యవేక్షించే దాస్యం విజయ్‌భాస్కర్‌.. కవిత వెంట నడిచేందుకు సుముఖంగా లేనట్లుగా సమాచారం. ఇటీవలకాలంలో కవిత నిర్వహించిన చాలా కార్యక్రమాలకు విజయ్‌భాస్కర్‌ దూరంగానే ఉంటున్నారు. హైదరాబాద్‌లో కవిత ప్రెస్‌మీట్‌కు ఆయన హాజరుకాలేదు. అలాగే ఆయన సోదరుడు వినయ్‌భాస్కర్‌ బీఆర్‌ఎస్‌ హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా ఉండటంతోపాటు కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో విజయ్‌భాస్కర్‌ గులాబీ గూటిలోనే కొనసాగనున్నారని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు.

ఇక భూపాలపల్లి జిల్లా నుంచి మాడ హరీ్‌షరెడ్డి, మహబూబాబాద్‌ జిల్లా నుంచి ఎన్‌.శ్రీకాంత్‌గౌడ్‌, జాగృతి మహిళ రాష్ట్ర కన్వీనర్‌ మాధవీలత, ములుగు జిల్లా నుంచి రాము, వరంగల్‌ జిల్లా నుంచి యార బాలకృష్ణ, హనుమకొండ జిల్లా నుంచి పర్లపల్లి శ్రీశైలం, జనగామ జిల్లా నుంచి మురళి తదితరులు జాగృతికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే వీరిలో చాలామందికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న విజయ్‌భాస్కర్‌.. బీఆర్‌ఎ్‌సలో కొనసాగడానికి మొగ్గు చూపటంతో మిగతా వారి పరిస్థితి ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది. భూపాలపల్లికి చెందిన మాడ హరీ్‌షరెడ్డి తాను జాగృతిలోనే కొనసాగుతానని సోషల్‌ మీడియాలో ప్రకటించుకున్నారు. మిగతా నేతలు కవిత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని వేచి చూస్తున్నారని సమాచారం.

కవిత సొంత పార్టీ పెడుతుందా? లేక ఇతర పార్టీలో చేరుతుందా? అనే ఉత్కంఠ జాగృతి కార్యకర్తల్లో ఉంది. సొంత పార్టీ పెడితే ఏం చేయాలి..? వేరే పార్టీలో చేరితే ఏం చేయాలనేది కవిత తీసుకునే నిర్ణయంపై తాము అడుగులు వేస్తామని కవిత జాగృతి నేతలు పేర్కొంటున్నారు. గతంలో మాజీ మంత్రి సత్యవతిరాథోడ్‌, మహబూబాబాద్‌ మాజీ ఎంపీ కవితలు ఎమ్మెల్సీ కవిత వెంట అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే కవిత బీఆర్‌ఎ్‌సపై చేసిన ఆరోపణలపై మంగళవారం హైదరాబాద్‌లో సత్యవతిరాథోడ్‌ కౌంటర్‌ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. బీఆర్‌ఎస్‌ కీలక మహిళ నేతలు ఎవరూ కూడా కవిత వెంట వెళ్లే అవకాశం లేదని గులాబీ శ్రేణులు పేర్కొంటున్నాయి.

ఇక ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో బీఆర్‌ఎ్‌సకు చెందిన మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల్లో ఎవరికీ కవితతో పెద్దగా సత్సంబంధాలు లేవు. పార్టీలో చెప్పుకో తగిన నేతలు కూడా కవితతో టచ్‌లో ఉన్నట్లుగా సమాచారం కూడా లేదు. దీంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి ఎమ్మెల్సీ కవిత వెంట నడిచేవారు పెద్దగా ఎవరూ లేరనే చర్చ జరుగుతోంది. అలాగే కవిత సింగరేణిలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎ్‌స)కు గౌవర అధ్యక్షురాలిగా కొనసాగారు. ఇటీవల పార్టీలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా కవితను గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి తొలగించి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు అప్పగించారు. అయితే దీంతో కవిత వర్గం వారు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కవిత సింగరేణిలో హెచ్‌ఎంఎ్‌సకు గౌరవ అధ్యక్షురాలిగా నియామకం అయ్యారు. అయితే కవితతో పాటు టీబీజీకేఎస్‌ నుంచి పెద్దగా హెచ్‌ఎంఎ్‌సలోకి కేడర్‌ వెళ్లలేదని టీబీజీకేఎస్‌ నేతలు పేర్కొంటున్నారు. మొత్తంగా కల్వకుంట్ల కవితతో ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి బీఆర్‌ఎస్‌ నేతలు, అనుబంధ సంఘాల నేతలు బయటకు వెళ్లే అవకాశాలు లేవనే చర్చ జరుగుతోంది.

Updated Date - Sep 03 , 2025 | 12:38 AM