Share News

సారథులెవరో!?

ABN , Publish Date - Oct 11 , 2025 | 12:32 AM

అధికార కాంగ్రె్‌సలో సంస్థాగత సందడి మొదలైంది. జిల్లా కమిటీల కార్యవర్గాలను ఎంపిక చేసేందుకు టీపీసీసీ కసరత్తు చేస్తోంది. డీసీసీ అధ్యక్ష పదవికి పోటీ పడే వారి నుంచి శనివారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడటంతో పార్టీ సంస్థాగత ఎన్నికలను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని అధిష్ఠానం భావిస్తోంది.

సారథులెవరో!?

  • కాంగ్రెస్‌ జిల్లా కార్యవర్గాల భర్తీకి అధిష్ఠానం కసరత్తు

  • నేటి నుంచి డీసీసీ అధ్యక్ష పదవులకు దరఖాస్తుల స్వీకరణ

  • హనుమకొండకు ఎమ్మెల్యే నాయిని వైపే అధిష్ఠానం మొగ్గు..?

  • వరంగల్‌ డీసీసీకి స్వర్ణతో పాటు మరో నలుగురైదుగురు ఆశావహులు

  • జనగామ జిల్లా అధ్యక్ష రేసులో ఝాన్సీరెడ్డి, ప్రశాంత్‌రెడ్డి

  • ములుగు జిల్లా అధ్యక్ష పదవి తెరపైకి పైడాకుల, సూర్య

  • భూపాలపల్లి, మహబూబాబాద్‌ జిల్లా అధ్యక్ష పీఠం దక్కేదెవరికో?

  • ఎమ్మెల్యేలు, సీనియర్లకు అవకాశం ఇవ్వాలనే యోచనలో అధిష్ఠానం

అధికార కాంగ్రె్‌సలో సంస్థాగత సందడి మొదలైంది. జిల్లా కమిటీల కార్యవర్గాలను ఎంపిక చేసేందుకు టీపీసీసీ కసరత్తు చేస్తోంది. డీసీసీ అధ్యక్ష పదవికి పోటీ పడే వారి నుంచి శనివారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడటంతో పార్టీ సంస్థాగత ఎన్నికలను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని అధిష్ఠానం భావిస్తోంది. అయితే పదేళ్ల తరువాత కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావటంతో పార్టీ పదవులపై నాయకులు ఆశతో ఉన్నారు. ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్‌ నేతలకే డీసీసీ అధ్యక్ష పదవిని కట్టబెట్టేందుకు అధిష్ఠానం సుముఖంగా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం ఉన్న డీసీసీ అధ్యక్షుల్లో వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డిని మరో టర్మ్‌ కొనసాగించాలని అధిష్ఠానం భావిస్తున్నట్లుగా ప్రచారం ఉంది. మిగతా జిల్లాల్లో కూడా పాత, కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. పార్టీ పదవుల పందేరం ఇప్పుడు కాంగ్రె్‌సలో హాట్‌ టాపిక్‌గా మారింది.

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, వరంగల్‌ : కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్ష పదవులను భర్తీ చేసేందుకు అధిష్ఠానం కసరత్తు ప్రారంభించింది. శనివారం నుంచి వారంపాటు జిల్లా అధ్యక్ష పదవిని ఆశించే వారి నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు ఏఐసీసీ నుంచి ప్రతీ జిల్లాకు డీసీసీ ఎన్నికల పర్యవేక్షులను నియమించారు. శనివారం హనుమకొండ, వరంగల్‌ జిల్లా పార్టీ సమావేశాలను డీసీసీ భవన్‌లో నిర్వహిస్తున్నారు. సోమవారం భూపాలపల్లి పార్టీ కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అధ్యక్ష పదవిని ఆశించేవారు తమ దరఖాస్తుతో పాటు పార్టీ వారు చేసిన సేవలు, అనుభవం, గతంలో నిర్వహించిన బాధ్యతలు, తదితర వివరాలతో స్పష్టంగా పేర్కొంటూ ఏసీసీఐ పర్యవేక్షకులకు ఇవ్వాలని అధిష్ఠానం సూచించింది. దీంతో డీసీసీ అధ్యక్ష పదవిని ఆశించే నేతలు దరఖాస్తులు సిద్ధం చేసుకుంటున్నారు.

హనుమకొండ నాయినికేనా..

ఉమ్మడి జిల్లాకు కేంద్రంగా ఉన్న హనుమకొండ డీసీసీ అధ్యక్ష పదవి కాంగ్రె్‌సకు కీలకంగా మారింది. ప్రతిపక్షాలకు కౌంటర్‌ ఇచ్చేందుకు హనుమకొండలో కీలకమైన నేత చేతిలో డీసీసీ పగ్గాలు ఉంచాలని అధిష్ఠానం భావిస్తోంది. ప్రస్తుత అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డికి ఇటీవలే టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా పార్టీ నియమించింది. అయితే తనకు కార్యనిర్వాహక అధ్యక్ష పదవి కావాలని నాయిని అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చారు. కులాల సమీకరణలో నాయిని ఉపాధ్యక్ష పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే డీసీసీ అధ్యక్ష పదవిని వేరే వాళ్లకు అప్పగించాలని నాయిని పీసీసీ అధ్యక్షుడికి లేఖ కూడా రాశారు. దీంతో హనుమకొండ డీసీసీ అధ్యక్ష పదవిపై కూడా చైర్మన్‌ ఇనుగాల వెంకట్రామిరెడ్డి, జంగా రాఘవరెడ్డి, దొమ్మాటి సాంబయ్యతో పాటు మరో నలుగురైదుగురు నజర్‌ వేసినట్లుగా ప్రచారం జరిగింది. అయితే అధిష్ఠానం మరోసారి డీసీసీ అధ్యక్ష పదవిని నాయిని రాజేందర్‌రెడ్డికి అప్పగించేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్షాలకు బలంగా కౌంటర్‌ ఇస్తుండటంతో పాటు రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉండటంతో నాయిని వైపే అధిష్ఠానం మొగ్గు చూపుతోందనే ప్రచారం జరుగుతోంది. జడ్పీ చైర్మన్‌ పదవి ఎస్సీకి రిజర్వుడు కావటంతో దొమ్మాటి సాంబయ్య కూతురు మౌనికకు దాదాపు ఖరారైందనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో నాయిని అధ్యక్ష పదవి చేపట్టేందుకు అయిష్టత చూపిస్తే రెడ్డి సామాజిక వర్గం నుంచి మరొకరికి అవకాశం ఇస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక వరంగల్‌ డీసీసీ అధ్యక్ష పదవిని మరోసారి చేపట్టేందుకు ఎర్రబెల్లి స్వర్ణ సుముఖంగా ఉన్నారనే ప్రచారం ఉంది. అయితే వరంగల్‌ జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖతో పాటు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి.. తమ అనుచరులను బరిలోకి దించేందుకు ప్రణాళిక రూపొందించారని తెలుస్తోంది. మంత్రి కొండా దంపతులు తమ అనుచరులు గోపాల నవీన్‌రాజు, మీసాల ప్రకా్‌షతో పాటు మరో ఇద్దరు ముగ్గురు పేర్లను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లుగా ప్రచారం జరుగుతోంది. హనుమకొండ డీసీసీ అధ్యక్ష పదవి ఓసీలకు ఇస్తే, వరంగల్‌ డీసీసీ అధ్యక్ష పదవిని బీసీలకు ఇవ్వాలని కొండా దంపతులు పట్టుబడుతున్నారని సమాచారం. అలాగే దొంతి మాధవరెడ్డి ఈ సారి తన అనుచరులకే డీసీసీ పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నారని తెలుస్తోంది. దీంతో వరంగల్‌ డీసీసీ అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా జరుగనుందనే చర్చ సాగుతోంది.

ములుగుపై సూర్య.. జనగామపై ఝాన్సీ నజర్‌..

కాంగ్రెస్‌ అధ్యక్ష పదవులపై కీలక నేతలు దృష్టి పెట్టారు. 2028లో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుండటంతో కొత్త నియోజకవర్గాలు, పాత నియోజకవర్గాల రిజర్వేషన్లు, సరిహద్దులు మారనుండంటంతో డీసీసీ అధ్యక్ష పదవిలో ఉంటే ఎమ్మెల్యే సీటుకు కర్చీఫ్‌ వేసుకున్నట్లే అనే భావనలో కొందరు సీనియర్‌ నేతలు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పినపాక అసెంబ్లీ స్థానం నుంచి తన వారసుడిని బరిలోకి దించాలని మంత్రి సీతక్క తీవ్ర ప్రయత్నాలు చేశారు. అప్పట్లో రాజకీయ సమీకరణలతో అవకాశం చేజారింది. అయితే వచ్చే అసెంబ్లీ నాటికి తన వారసుడిని క్రియాశీలక రాజకీయాల్లో ఉంచాలనే లక్ష్యంతో సీతక్క వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్‌ను కొనసాగించకుంటే సూర్యను డీసీసీ పీఠంపై కూర్చోపెట్టవచ్చుననే చర్చ జరుగుతోంది.

ఇక జనగామ డీసీసీ పదవిపై టీపీసీసీ రాష్ట్ర ఉపాఽధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి నజర్‌ వేశారనే ప్రచారం ఉంది. మొదటి నుంచి జిల్లా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండాలని ఝాన్సీరెడ్డి భావిస్తున్నారు. అయితే టీపీసీసీ నుంచి వైస్‌ప్రెసిడెంట్‌ పదవి వచ్చినప్పటికీ తనకు జడ్పీ చైర్మన్‌ లేదా డీసీసీ అధ్యక్ష పదవుల్లో ఏదో ఒకటి ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరినట్లుగా సమాచారం. అయితే ప్రస్తుత అధ్యక్షుడు కొమ్మూరి ప్రతా్‌పరెడ్డిని కొనసాగించకపోతే ఝాన్సీరెడ్డికి డీసీసీ అవకాశం దక్కవచ్చుననే ప్రచారం జరుగుతోంది. మరోవైపు కొమ్మూరి ప్రతా్‌పరెడ్డి వారసుడిగా కొమ్మూరి ప్రతా్‌పరెడ్డి సైతం డీసీసీ అధ్యక్ష పదవిపై కన్నేశారనే చర్చ నెలకొంది.

మానుకోట, భూపాలపల్లి జిల్లా పగ్గాలెవ్వరికో..?

సీఎం సలహాదారుడు, వేం నరేందర్‌రెడ్డి సొంత జిల్లా మహబూబాబాద్‌లో డీసీసీ అధ్యక్ష పదవిపై పలువురు నేతలు కన్నేశారు. ప్రస్తుత అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్‌చంద్రారెడ్డి మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరుతున్నట్లుగా సమాచారం. సుదీర్ఘకాలం కాంగ్రె్‌సకు సేవలు అందిస్తున్న భరత్‌చంద్రారెడ్డికి ఏదైనా నామినేటెడ్‌ పదవిని ఇస్తే.. మరొకరికి డీసీసీ అధ్యక్ష పదవికి లైన్‌క్లియర్‌ అవుతుందని చర్చ జరుగుతోంది. అలాగే కాంగ్రెస్‌ యువనేత, వేం నరేందర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న వెన్నం శ్రీకాంత్‌రెడ్డి పేరు కూడా డీసీసీ అధ్యక్ష పదవికి ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే జడ్పీ చైర్మన్‌గా శ్రీకాంత్‌రెడ్డికి అవకాశం ఇస్తే.. డీసీసీ రేసు నుంచి తప్పుకుంటారని సమాచారం. అలాగే బీసీలకు అవకాశం ఇవ్వాలని మహబూబాబాద్‌ సిటీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఘణపురపు అంజయ్య కోరుతున్నారు. వీరితో పాటు మరో ఇద్దరు ముగ్గురు కూడా మానుకోట హస్తం పగ్గాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సొంత జిల్లా భూపాలపల్లి డీసీసీ అధ్యక్ష పదవి ఉత్కంఠగా మారింది. ప్రస్తుత అధ్యక్షుడు ప్రకా్‌షరెడ్డి మంత్రి శ్రీధర్‌బాబు అనుచరుడే. ప్రకా్‌షరెడ్డికి కార్పొరేషన్‌ పదవి రావటంతో డీసీసీ అధ్యక్ష పదవికి శ్రీధర్‌బాబు సోదరుడు శ్రీనుబాబు పేరు తెరపైకి వస్తోంది. అయితే ప్రస్తుత అధ్యక్షుడు ప్రకా్‌షరెడ్డితోపాటు గ్రంథాలయ చైర్మన్‌ పదవికి కూడా మంథని నియోజకవర్గానికే దక్కింది. మరోసారి డీసీసీ అధ్యక్ష పదవి కూడా శ్రీధర్‌బాబు నియోజకవర్గానికే దక్కితే, తమ పరిస్థితి ఏమిటని భూపాలపల్లి నియోజకవర్గ నేతలు ప్రశ్నిస్తున్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుకు ప్రధాన అనుచరుడిగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధికార ప్రతినిధి, మాజీ మావోయిస్టు నేత గాజర్ల అశోక్‌ అలియాస్‌ ఐతూ పేరు కూడా డీసీసీ అధ్యక్ష పదవికి ప్రముఖంగా వినిపిస్తోంది. అశోక్‌తో పాటు చల్లూరి మధు కూడా డీసీసీ పదవికి దరఖాస్తు చేయమని అధిష్ఠానం నుంచి ఆదేశాలు వచ్చినట్లుగా సమాచారం. అలాగే ప్రముఖ వ్యాపారి ఎన్‌.సంపత్‌రావు (ఎన్‌ఎ్‌సఆర్‌) పేరును కూడా అధిష్టానం పరిశీలిస్తోందనే చర్చ జరుగుతోంది.

Updated Date - Oct 11 , 2025 | 12:32 AM