Share News

గుయ్‌.. గుయ్‌..

ABN , Publish Date - Aug 25 , 2025 | 12:06 AM

వరంగల్‌ నగరంలో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు డ్రైనేజీలు, ఖాళీ ప్లాట్లు, చెరువులు, కుంటలలో నీరు నిలిచి ఉండడం వల్ల దోమల లార్వా వృద్ధి చెంది ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

గుయ్‌.. గుయ్‌..

  • వరంగల్‌ నగరంలో దోమల స్వైర విహారం

  • విషజ్వరాల పాలవుతున్న ప్రజలు

  • రాత్రిళ్లు లోతట్టు ప్రాంతాల ప్రజల జాగారం

  • నిర్లక్ష్యంలో మునిసిపల్‌ మలేరియా విభాగం

  • నామమాత్రంగా నాసిరకం మందు ఫాగింగ్‌

  • ఆరు మాసాలుగా బయాలజిస్ట్‌ పోస్టు ఖాళీ

  • మేయర్‌, కమిషనర్‌ పట్టించుకోవాలని ప్రజల వేడుకోలు

వరంగల్‌ కార్పొరేషన్‌, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి) : వరంగల్‌ నగరంలో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు డ్రైనేజీలు, ఖాళీ ప్లాట్లు, చెరువులు, కుంటలలో నీరు నిలిచి ఉండడం వల్ల దోమల లార్వా వృద్ధి చెంది ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కొన్ని కాలనీలతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలు రాత్రి సమయంలో జాగారం చేయాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. వర్షాకాలంలో డెంగీ, మలేరియా, విషజ్వరాలు పెరుగుతాయని రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే హెచ్చరించినా ఇక్కడి సిబ్బంది పట్టించుకోకపోవడంతో దోమల బెడద అధికమవున్నట్టు తెలుస్తోంది.

ఇంటింటికీ జ్వర పీడితులు

మునిసిపల్‌ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ప్రజలు వరంగల్‌ ట్రైసిటీ్‌సతోపాటు విలీన గ్రామాల్లో ప్రతీ ఇంటి నిండా జ్వరపీడితులే కనిపిస్తున్నారు. గత యేడాది ట్రైసిటీలో 128 డెంగీ, 24 మలేరియా కేసులు నమోదు కాగా, ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటికే నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు ప్రజలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే 55 డెంగీ కేసులు నమోదైనట్టు తెలిసింది. ఇంట్లో ఒక్కరికి జ్వరం సోకిందంటే అందరికీ సోకుతోంది. కొన్ని ఇళ్లలో డెంగీ, మలేరియా, చికెన్‌గున్యా, జలుబు, దగ్గుతోపాటు చివరికి ప్లేట్‌లైట్స్‌ తగ్గిపోయి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మలేరియా సిబ్బంది బాధ్యతారాహిత్యంతో ఇదంతా జరుగుతోందని ప్రజలు భావిస్తున్నారు.

ప్రస్తుతం 14 లక్షల పైచిలుకు జనాభా కలిగిన వరంగల్‌ నగరంలో ప్రజలకు సరిపడా సిబ్బంది లేకపోవడం.. ఉన్న సిబ్బందిలో కూడా చాలామంది విధులకు డుమ్మా కొట్టడం వల్ల దోమలను నియంత్రించేందుకు చేయాల్సిన ఫాగింగ్‌, స్ర్పే, ఆయిల్‌ బాల్స్‌ పనులు కుంటుపడుతున్నాయి. ఇటీవల ప్రతీ డివిజన్‌లో ఫాగింగ్‌ చేసే హ్యాండ్‌ మిషన్‌లను రికవరీ చేసుకుని నగరం మొత్తం నాలుగు ఆటోలతో ఫాగింగ్‌ చేయడంతో దోమలు విజృంభిస్తున్నట్టు ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రతీ నెల డీజిల్‌, పెట్రోల్‌తో పాటు దోమలు వృద్ధి చెందకుండా వాడే బెటెక్స్‌ టెమోపాస్‌, మలాథిన్‌ స్ర్పే చేయకుండా, ఆయిల్‌ బాల్స్‌, గంబూషియా చేపలు వేయకుండానే బిల్లులు కాజేస్తూ బల్దియా ఆదాయానికి గండికొడుతున్నట్టు తెలుస్తోంది.

సిబ్బంది ఫుల్‌.. పనులు నిల్‌..

గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలోని 66 డివిజన్‌లకు డివిజన్‌కు ఒకటి చొప్పున బల్దియా నిధుల నుంచి రూ.50లక్షలు వెచ్చించి చిన్న ఫాగింగ్‌ మిషన్లు, రూ.30లక్షలతో 4 ఫాగింగ్‌ ఆటోలు కొనుగోలు చేశారు. ప్రజల ఆరోగ్యం కోసం నగరంలో దోమలు, క్రిమికీటకాలను నియంత్రించేందుకు 60 మంది ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది, 90 మంది కాంట్రాక్టు సిబ్బంది, 25 మంది ప్రభుత్వ సిబ్బంది మలేరియా విభాగంలో పనిచేస్తున్నారు. వీరితో పని చేయించేందుకు ప్రధాన భూమికను పోషించే బయాలజిస్ట్‌ లేక పోవడంలో సీఎంహెచ్‌వో రాజారెడ్డి అదనపు బాఽధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. కాగా, ఇద్దరు హెల్త్‌ ఇన్‌స్పెక్టర్లు, 8మంది హెల్త్‌ అసిస్టెంట్లు, ఇ ద్దరు కంప్యూటర్‌ ఆపరేటర్లు పని చేస్తున్నారు. అయితే గతంలో చిన్న ఫాగింగ్‌ మిషన్‌లకు రోజుకు 5 లీటర్లు డీజిల్‌, ఒక లీటర్లు పెట్రోల్‌ ఇచ్చి ఇద్దరు సిబ్బందిని కేటాయించేవారు. కానీ ప్రస్తు తం 4 పెద్ద ఫాగింగ్‌ ఆటోలను కొనుగోలు చేసి ఒక్కో ఆటోకు 8 డివిజన్‌లలో ఫాగింగ్‌ చేసేందుకు పురమాయించారు. ఒక్క ఫాగింగ్‌ ఆటోకు 75 లీటర్ల డీజిల్‌తో పాటు 10 లీటర్ల పెట్రోల్‌ ఫిల్లింగ్‌ చేసే పంపిస్తుండగా ఆటోలు ఒక్కడ ఫాగింగ్‌ చేస్తున్నాయో అధికారులకు తప్ప ప్రజలకు కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇంకా 66 డివిజన్‌లలో సిబ్బంది బావులలో (ప్యారా రత్నం) మందు, డ్రైనేజీలలో దోమల స్ర్పే, నీటి గుంతలు, చిన్న పాటి కుంటలలో ఆయిల్‌ బాల్స్‌ వేయాలి. ఇంకా దోమల నివారణకు వినియోగించే మలాథిన్‌, బెటెక్స్‌, ఆయిల్‌బాల్స్‌ నాసిరకం మందులను తెచ్చి అక్కడక్కడా పిచికారి చేసినా ప్రయోజనం లేకుండా పోతోందని ప్రజలు వాదిస్తున్నారు.

లీడర్‌గిరి

మలేరియా విభాగంలో పని చేసే ఔట్‌సోర్సింగ్‌, ప్రైవేటు, కాంట్రాక్ట్‌ (అవసర నిమిత్తం) నియమించబడిన కొందరు సిబ్బంది సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులుగా విధులకు డుమ్మా కొట్టి అధికారులను సైతం బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నట్టు తెలిసింది. ఇంకా కొందరు వైట్‌కాలర్‌ నాయకులు విధుల్లో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క రోజు కూడా ఫాగింగ్‌ చేయకుండా ఉన్నారు. ప్రధానంగా లష్కర్‌సింగారం, ఆరెపల్లి, కొత్తపేట, మామునూరు, సింగారం గ్రామాలకు చెందిన వారు అధికారులకు దగ్గరగా ఉండి పని చేయకున్నా నెలకు ఠంఛన్‌గా వచ్చే జీతాన్ని నొక్కేస్తున్నారు. కొందరు సిబ్బంది అధికారులు, ప్రజాప్రతినిధుల పేరు చెప్పి మరీ విధులకు రావడం లేదని అధికారులే వెల్లడించారు. ఇటీవల మలేరియా సిబ్బందికి జీతాలు పెంచినా విధులకు సక్రమంగా రావడం లేదని తోటి సిబ్బంది చెప్పుకొస్తున్నారు. తద్వారా తమపై ఎక్కువ పని భారం పడుతుందని తెలిపారు. ఇప్పటికైనా బల్దియా కమిషనర్‌ చహత్‌ బాజ్‌పాయ్‌, మేయర్‌ గుండు సుధారాణి మలేరియా విభాగంలో జరుగుతున్న అవినీతిని గుర్తించి ప్రజలను దోమల బారినుంచి రక్షించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

దోమల నివారణపై అవగాహన కల్పిస్తున్నాం : డాక్టర్‌ బొమ్మన రాజారెడ్డి, ఇన్‌చార్జి మలేరియా అధికారి

వరంగల్‌ నగరంలో దోమల నివారణకు ఇంటింటి సర్వే చేస్తున్నాం. ఎవరైనా జ్వర పీడితులు ఉన్నారా? అని తెలుసుకుని ప్రతీ వారం డ్రై డేను పాటించాలని అవగాహన కల్పిస్తున్నాం. ప్రధానంగా లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇళ్ల చుట్టుపక్కల నీరు నిలువకుండా చూడాలని కరపత్రాలు, కళాజాత ద్వారా ప్రచారం చేస్తున్నాం. ప్రతీ కాలనీలో ఫాగింగ్‌, దోమల మందు స్ర్పే చేస్తున్నాం. ఇప్పటి వరకు కొన్ని డెంగీ కేసులు నమోదైనట్టు తెలిసింది. ఇంకా ప్రజలు దోమల పట్ల అప్రమత్తంగా ఉండకపోతే ఆర్ధికపరమైన నష్టం జరుగుతుంది.

Updated Date - Aug 25 , 2025 | 12:06 AM