ప్రశాంతంగా..
ABN , Publish Date - Sep 12 , 2025 | 12:36 AM
యూరియా కోసం గత కొన్ని రోజులుగా ధర్నాలు, రాస్తారోకోలు, తోపులాటల మధ్య పంపిణీ కొనసాగింది. ఇప్పుడు అవన్నీ గొడవలు లేకుండా జిల్లా కలెక్టర్, ఎస్పీ, అధికారుల పక్కా పర్యవేక్షణతో రైతులకు బస్తాల సరఫరా జరుగుతోంది. ధర్నాలకు, రాస్తారోకోలకు తావులేకుండా.. అందరికీ యూరియా అందిస్తున్నారు.
సాఫీగా యూరియా పంపిణీ
ఎస్పీ, కలెక్టర్, అధికారుల పర్యవేక్షణతో రైతులకు బస్తాల సరఫరా
ఇప్పటికే 25,967 మెట్రిక్ టన్నుల యూరియా అందచేత
రైతు భరోసా పోర్టల్‌లో ఆధారంగా రిజిస్టర్లలో పేర్ల నమోదు
బందైన ధర్నాలు, రాస్తారోకోలు
మహబూబాబాద్ అగ్రికల్చర్, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి) : యూరియా కోసం గత కొన్ని రోజులుగా ధర్నాలు, రాస్తారోకోలు, తోపులాటల మధ్య పంపిణీ కొనసాగింది. ఇప్పుడు అవన్నీ గొడవలు లేకుండా జిల్లా కలెక్టర్, ఎస్పీ, అధికారుల పక్కా పర్యవేక్షణతో రైతులకు బస్తాల సరఫరా జరుగుతోంది. ధర్నాలకు, రాస్తారోకోలకు తావులేకుండా.. అందరికీ యూరియా అందిస్తున్నారు. దీంతో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా పంపిణీ జరుగుతోంది. గ్రామాల్లో రైతు భరోసా పోర్టల్‌లో ఆధారంగా రిజిస్టర్లలో పేర్లు నమోదు చేస్తూ యూరియా పంపిణీ చేస్తుండడంతో గొడవ సద్దుమణిగింది.
ముందుగా ఇలా..
ముందుగా వ్యవసాయశాఖ ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగలేదు. కేంద్రప్రభుత్వం కూడా అరకొరగానే యూరియాను పంపిణీ చేసింది. రైతులంతా బస్తాల కోసం ఎగబడడంతో సంక్షోభం ఏర్పడింది. ముందుగా ఆధార్‌కార్డుతో టోకెన్ సిస్టం ద్వారా పంపిణీ చేయడంతో యూరియా కోసం వందలాది మంది రైతులు ఎగబడ్డారు. యూరియా దొరకదని ప్రచారం కావడంతో ఒక ఇంటిలో ఎన్ని ఆధార్‌కార్డులు ఉంటే అంతమంది వచ్చి క్యూలైన్‌లో నిలబడి యూరియా తీసుకుపోవడం. మళ్లీ తెల్లారి యూరియా కోసం రావడం జరిగింది. దాంతో కొంతమందికి యూరియా దొరకకపోవడంతో ధర్నాలు, రాస్తారోకోలు చేశారు.
కలెక్టర్ ఆధ్వర్యంలో..
జిల్లా కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ సైతం రంగంలో దిగి యూరియా పంపిణీకి నడుం బిగించారు. అధికారులతో టెలికాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూనే, గ్రామాల్లో యూరియా పంపిణీ జరుగుతున్న ప్రాంతాలను ఆకస్మీకంగా తనిఖీలు చేస్తూ అధికారులను అప్రమత్తం చేస్తూ వచ్చారు. రైతులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారు. కేసముద్రం, ఇనుగుర్తి, కురవి, మహబూబాబాద్ మండలాలతో పాటు ఇతర మండలాల్లో అద్వైత్‌కుమార్‌సింగ్ పరిశీలించారు. ఇంతేకాకుండా అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలతో పాటు జిల్లా వ్యవసాయాధికారిణి విజయనిర్మల, మహబూబాబాద్, మరిపెడ ఏడీఏలు శ్రీనివాసరావు, విజయ్‌చందర్‌తో పాటు అధికార యంత్రాంగంతో పాటు వివిధ మండలాల్లో యూరియా పంపిణీకి కలెక్టర్ ప్రత్యేక అధికారులను నియమించారు.
లూటీ జరుగకుండా పకడ్బందీ చర్యలు..
యూరియా బస్తాల లూటీ జరుగకుండా పోలీస్ యంత్రాంగం అనేక చర్యలు చేపట్టింది. ఎస్పీ సుధీర్‌రామ్‌నాథ్ కేకన్ స్వయంగా రంగంలో దిగి, మహబూబాబాద్ జిల్లాలోని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఉదాహరణకు కొన్ని సంఘటనలు ఇలా ఉన్నాయి. గత శనివారం మహబూబాబాద్ పీఏసీఎ్‌సలో యూరి యా లోటు రావడంతో రైతులు ఒక్కసారిగా ఎగబడి యూరియా బస్తాలను ఎత్తుకెళ్తున్న విషయం తెలుసుకున్న ఎస్పీ సుధీర్‌రామ్‌నాథ్ కేకన్ క్షణాల్లో అక్కడికి చేరుకుని అధికారులను, పోలీస్ యం త్రాంగంను అప్రమత్తం చేసి లూటీని అడ్డుకున్నారు. తానే స్వయం గా రైతులను క్యూలైన్‌లో నిలబెట్టి మనిషికి బస్తా చొప్పున యూరి యా పంపిణీ చేయించారు. నెల్లికుదురు మండలం శ్రీరామగిరి పీఏసీఎ్‌సలో యూరియా కోసం ధర్నాలు జరుగుతుండడంతో తొర్రూరు డీఎస్పీ కృష్ణకిశోర్ అక్కడికి చేరుకున్నారు. అర్ధరాత్రి 12 గంటలకు ఎస్పీ సుధీర్‌రామ్‌నాథ్ కేకన్ శ్రీరామగిరికి వెళ్లి యూరియా పంపిణీ పూర్తి చేయించారు. మహబూబాబాద్‌లో ఇటీవల ఎరువుల దుకాణంపై రాళ్లదాడి చేసిన రైతులు గోదాం తాళాలు పగులగొట్టి బస్తా లు ఎత్తుకెళ్లడంతో పోలీసులు అక్కడికి చేరుకుని లూటీ జరుగుకుండా అడ్డుకున్నారు. మరిపెడ మండలంలో పీఏసీఎ్‌సలో ఈ నెల 3న గేటుకు తాళం వేసి ఉండగా రైతులు గోదాం షట్టర్లను లేపి 86 బస్తాల వరకు యూరియా బస్తాలను ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత పీఏసీఎస్ సిబ్బంది, పోలీస్ అధికారులు అక్కడికి చేరుకుని లూటీని అడ్డుకున్నారు. ఎస్పీతో పాటు మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు పర్యవేక్షించారు. ఇలాంటి సంఘటనలు జిల్లాలో పలుచోట్ల జరిగాయి.
44 పీఏసీఎ్‌సలు 20 రైతు వేదికల ద్వారా..
జిల్లాలో 44 పీఏసీఎ్‌సలు 20 రైతు వేదికల ద్వారా యూరియా పంపిణీ ప్రశాంతంగా జరుగుతోంది. రైతు భరోసా విస్తీర్ణం ఆధారంగా ముందుగానే రైతుల పేర్లను తీసుకుని వరుస క్రమంలో వారికి ముందుగా సమాచారం ఇస్తూ, యూరియా పంపిణీ చేస్తున్నారు. పట్టాదారు పాస్‌పుస్తకం లేని గూడూరు, కేసముద్రం, కొత్తగూడ, ఇతర మండలాల్లోని కొన్నిగ్రామాల రైతులకు పాత పహణీల ఆధారంగా గ్రామాల వారీగా పంపిణీ చేస్తున్నారు. బుధవారం వరకు జిల్లాలో 25,967 మెట్రిక్ టన్నుల యూరియాను పంపిణీ చేసినట్లు జిల్లా వ్యవసాయాధికారిణి విజయనిర్మల తెలిపారు. యూరియా అందుబాటులో ఉందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా కల్పిస్తున్నారు.