Share News

నేతల పోరు.. మారని తీరు..

ABN , Publish Date - Sep 17 , 2025 | 12:32 AM

ఓరుగల్లులో రాజకీయాలు మళ్లీ హీటెక్కుతున్నాయి. కాంగ్రె్‌సలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మధ్య మాట ల యుద్ధం పతాకస్థాయికి చేరింది. ఽధర్మకర్తల నియామకంపై నాయిని చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేస్తున్నాయి. దీనికి తోడు ప్రజాపాలన దినోత్సవంలో జాతీయ జెండాను సురేఖ వరంగల్‌ జిల్లాలో అవిష్కరణ చేసేలా ఉత్తర్వులు రావడానికి నేతల మధ్య విభేదాలే కారణమనే చర్చ జరుగుతోంది.

నేతల పోరు.. మారని తీరు..

  • అధికార కాంగ్రె్‌సలో సద్దుమణగని అంతర్గత విభేదాలు

  • తాజాగా మంత్రి కొండా వర్సెస్‌ ఎమ్మెల్యే నాయిని మధ్య ధర్మకర్తల రగడ

  • ప్రజాపాలన దినోత్సవ వేళ ఈ సారి వరంగల్‌లో జెండావిష్కరణ చేయనున్న

  • మంత్రి సురేఖ

  • ఎమ్మెల్యేలతో విభేదాలే కారణమని రాజకీయవర్గాల్లో ప్రచారం

  • స్టేషన్‌ఘన్‌పూర్‌లో తాటికొండ మాటల దాడి.. కడియం వర్గం కన్నెర్ర..

  • స్పీకర్‌ చర్యలతో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతల మధ్య మాటల యుద్ధం

  • నేతల మధ్య మంటలతో అయోమయంలో శ్రేణులు

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, వరంగల్‌ : ఓరుగల్లులో రాజకీయాలు మళ్లీ హీటెక్కుతున్నాయి. కాంగ్రె్‌సలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మధ్య మాట ల యుద్ధం పతాకస్థాయికి చేరింది. ఽధర్మకర్తల నియామకంపై నాయిని చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేస్తున్నాయి. దీనికి తోడు ప్రజాపాలన దినోత్సవంలో జాతీయ జెండాను సురేఖ వరంగల్‌ జిల్లాలో అవిష్కరణ చేసేలా ఉత్తర్వులు రావడానికి నేతల మధ్య విభేదాలే కారణమనే చర్చ జరుగుతోంది. మరోవైపు స్టేషన్‌ఘనపూర్‌ రాజకీయం రణరంగంగా మారుతోంది. స్పీకర్‌ అనర్హత వేటుపై దృష్టి సారించటంతో బీఆర్‌ఎస్‌ దూకుడు పెంచింది. ఎమ్మెల్యే కడి యం టార్గెట్‌గా మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. కడియం వర్గీయుల కన్నెర్రతో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య మాటల దాడులు రాజకీయాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి.

కాంగ్రె్‌సలో ఆగని లొల్లి

కాంగ్రెస్‌ పార్టీలో ఆధిపత్య పోరుకు బ్రేకు లు పడటం లేదు. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేల మధ్య ఉన్న విభేదాలకు అధిష్ఠానం కూడా చెక్‌ పెట్టలేకపోతోంది. రాహుల్‌గాంధీ జన్మదినం సందర్భంగా పోచమ్మమైదాన్‌ వద్ద జరిగిన వేడుకల్లో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు చేసిన కామెంట్లు చర్చనీయాంశంగా మారాయి. మురళిపై చర్యలు తీసుకోవాలంటూ ఐదుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అధిష్ఠానం వద్ద ఫిర్యాదులు చేశారు. ఈ గొడవ ఇటీవలే సద్దుమణుగుతున్న వేళ.. తాజాగా భద్రకాళి ఆలయ ధర్మకర్తల నియామకంలో మంత్రి తన పరిధి దాటుతున్నారని వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరోసారి హీట్‌ పుట్టించాయి. అదృష్టం కొద్దీ రాజేందర్‌రెడ్డి గెలిచారని, అధిష్ఠానం సూచించిన వారినే ధర్మకర్తలుగా నియమించామని, దేవాదాయశాఖ మంత్రిగా తనకు ఆ స్వేచ్ఛ లేదా అని మంత్రి సురేఖ కౌంటర్‌ ఇచ్చారు. అయితే పార్టీలు మారితే నాలుగైదు సార్లు ఎమ్మెల్యేను అవుతానని నాయిని మాటల దాడికి దిగటంతో ఓరుగల్లు రాజకీయాలు మరోసారి రాష్ట్రవ్యాప్తంగా సంచలనమవుతున్నాయి.

ఇదిలావుండగా, మంత్రి సురేఖ, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం జరుగుతున్న వేళ ప్రజాపాలన దినోత్సవానికి అతిథులు జిల్లాలు మారటం రాజకీయాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. గత ఏడాది జరిగిన ప్రజాపాలన దినోత్సవంతో పాటు రిపబ్లిక్‌ డే, స్వాతంత్య్ర వేడుకలకు మంత్రి సురేఖ హనుమకొండ జిల్లాకు, మరో మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి వరంగల్‌ జిల్లాకు అతిథులుగా పాల్గొని జాతీయ జెండా అవిష్కరణ చేసేవారు. అయితే బుధవారం ప్రజాపాలన వేడుకలకు హనుమకొండ జిల్లాకు పొంగులేటిని, వరంగల్‌కు సురేఖను మార్చడం వెనుక ఎమ్మెల్యేల ఒత్తిడి ఉందా..? లేక సురేఖ ప్రాతినిథ్యం వహిస్తున్న సొంత జిల్లా కావటం వల్లనే వరంగల్‌కు మార్చారా..? అనేది చర్చనీయాంశంగా మారింది. మంత్రి సురేఖపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేసిన నాయిని రాజేందర్‌రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకా్‌షరెడ్డిల నియోజకవర్గ కేంద్రాలు హనుమకొండ జిల్లాలో ఉన్నాయి. స్టేషన్‌ఘన్‌పూర్‌, భూపాలపల్లి, వర్ధన్నపేట నియోజకవర్గాల్లోని కొన్ని మండలాలు, వార్డులు హనుమకొండ జిల్లాలో ఉన్నాయి. దీంతో అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు ఈ మార్పు జరిగిందా? లేక మంత్రి సురేఖ సొంత నియోజకవర్గ కేంద్రంతో జాతీయ జెండాను అవిష్కరించేలా వరంగల్‌కు మార్చారా? అనేది చర్చనీయాంశంగా మారింది.

చేతులు కలిసేదెప్పుడో..?

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య సయోధ్య కరువైందనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై కొండా మురళి చేసిన ఘూటు వ్యాఖ్యలపై అధిష్ఠానం సీరియ్‌సగా తీసుకున్నప్పటికీ ఎలాంటి ఫలితం లేదనే చర్చ ఉంది. కనీసం విభేదాలు ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రి కొండా సురేఖ దంపతుల మధ్య సయోధ్య కుదుర్చేందుకు కూడా అధిష్ఠానం చొరవ చూపటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో మంత్రి, ఎమ్మెల్యేల మధ్య మరింత గ్యాప్‌ ఏర్పడుతోందని, ఫలితంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపుతుందనే విమర్శలు ఉన్నాయి.

రాజకీయ ‘రణ’పూర్‌

ఇక స్టేషన్‌ఘనపూర్‌ రాజకీయాలు ఓరుగల్లును హీటెక్కిస్తున్నాయి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేకు స్పీకర్‌ నోటీసులు జారీ చేశారు. దీంతో స్టేషన్‌ఘనపూర్‌ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వస్తాయనే ఆశతో బీఆర్‌ఎస్‌ దూకుడు పెంచింది. కడియం శ్రీహరి కాంగ్రె్‌సలో చేరినప్పటి నుంచే బీఆర్‌ఎస్‌ ఆయనను టార్గెట్‌ చేసింది. మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్యను తెరపైకి తీసుకువచ్చి ఎదురుదాడికి దిగుతోంది. శనివారం జనగామలో కడియం శ్రీహరిపై తాటికొండ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం లేపాయి. వ్యక్తిగత దూషణలతో పాటు అవినీతి ఆరోపణలు చేయటంతో కడియం శ్రీహరి వర్గీయులు తీవ్ర నిరసనలకు దిగారు. రాజయ్య దిష్టబొమ్మలను తగలపెట్టడంతో పాటు నియోజకవర్గంలో ధర్నాలకు దిగారు. దీంతోపాటు రఘునాథపల్లిలో పాదయాత్రకు సోమవారం సిద్ధమైన తాటికొండ రాజయ్యను పోలీసులు హనుమకొండలో హౌస్‌అరెస్ట్‌ చేయటంతో బీఆర్‌ఎస్‌ శ్రేణులు భగ్గుమన్నాయి. భారీగా గులాబీ శ్రేణులు తోడు రాగా, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి సమక్షంలో రాజయ్య పాదయాత్ర మొదలు పెట్టారు. అయితే జ్వరంతో బాధపడుతున్న కడియం శ్రీహరి.. ఈ ఎపిసోడ్‌లో తెరపైకి రాకపోయినప్పటికీ ఆయన అనుచరులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనలకు దిగారు.

Updated Date - Sep 17 , 2025 | 12:32 AM