ఆగేనా.. సాగేనా?!
ABN , Publish Date - Oct 06 , 2025 | 12:22 AM
స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటికీ ఎన్నికలు జరుగుతాయా..? కోర్టు జోక్యంతో వాయిదా పడుతాయా..? రిజర్వేషన్లు మారుతాయా..? అనే ఉత్కంఠ నేతల్లో నెలకొంది. బీసీలకు ప్రభుత్వం 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇచ్చిన జీవోను సవాల్ చేస్తూ పలువురు సుప్రీంకోర్టు, హైకోర్టులను ఆశ్రయించటంతో ఎన్నికలపై అనిశ్చితి కొనసాగుతోంది.
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ
నేడు సుప్రీం కోర్టు తీర్పు.. ఎల్లుండి హైకోర్టులో విచారణ
కోర్టులు అడ్డు చెబితే రిజర్వేషన్లు మారే అవకాశం
ఇప్పటికే 42శాతం బీసీ రిజర్వేషన్లతో స్థానాలు ఖరారు
కొందరికి సంతృప్తి.. చాలా చోట్ల సీనియర్ నేతల అసంతృప్తి
సుప్రీం, హైకోర్టు నిర్ణయాలపై ఆశావహుల ఎదురుచూపు
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, వరంగల్ : స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటికీ ఎన్నికలు జరుగుతాయా..? కోర్టు జోక్యంతో వాయిదా పడుతాయా..? రిజర్వేషన్లు మారుతాయా..? అనే ఉత్కంఠ నేతల్లో నెలకొంది. బీసీలకు ప్రభుత్వం 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇచ్చిన జీవోను సవాల్ చేస్తూ పలువురు సుప్రీంకోర్టు, హైకోర్టులను ఆశ్రయించటంతో ఎన్నికలపై అనిశ్చితి కొనసాగుతోంది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలో అన్ని స్థానిక సంస్థలకు రిజర్వేషన్లు ఖరారు చేసి, ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. అయితే 42శాతం రిజర్వేషన్లపై అభ్యంతరం వ్యక్తం చేస్తే.. ప్రస్తుత రిజర్వేషన్లు తారుమారయ్యే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. బీసీ సీట్లు తగ్గటంతో పాటు జనరల్ సీట్లు మరిన్ని పెరిగే అవకాశం ఉంది. రిజర్వేషన్లు కలిసి రాక అసంతృప్తితో ఉన్న ఆశావహులు.. కోర్టు తీర్పుపై ఆశగా ఎదురుచూస్తున్నారు.
రిజర్వేషన్ల ఖరారుతో జోష్
స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది. తొలి విడత పరిషత్ ఎన్నికల కోసం ఈ నెల 9వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 75 జడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. వీటితో పాటు 764 ఎంపీటీసీలు, 1,653 గ్రామపంచాయతీలు, 14,786 వార్డులకు రిజర్వేషన్లను ఖరారు చేశారు. దీంతో బీసీలకు భారీ సంఖ్యలో పోటీ అవకాశం ఏర్పడింది. దీంతో గ్రామాలు, మండలస్థాయిలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కొత్తగా ఖరారైన రిజర్వేషన్లతో ఆశావహులు చాలామంది అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి తామే అభ్యర్థులమనే ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పటికే గ్రామాల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు ఎవరనే చర్చ ప్రజల్లో మొదలైంది. ఎవరెవరు బరిలో ఉంటన్నారు..? ఎవరు గెలిచే అవకాశాలున్నాయని ఆరా తీస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలు స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. అభివృద్ధి, సంక్షేమం పేరుతో కాంగ్రెస్ ఓటర్లకు వల వేసేలా వ్యూహ రచన చేస్తుంటే.. గత ఎన్నికల్లో ఇచ్చిన హమీలను అమలు చేయలేదని, కాంగ్రెస్ బాకీ కార్డు పేరుతో బీఆర్‌ఎస్ ప్రజల్లోకి వెళుతోంది.
అభ్యర్థుల వేట
స్థానిక ఎన్నికలపై దృష్టిపెట్టిన కాంగ్రెస్ పార్టీ.. జడ్పీటీసీ స్థానానికి పోటీ పడే ముగ్గురు పేర్లతో అభ్యర్థుల జాబితాను ఇప్పటికే అధిష్ఠానానికి పంపించారు. ఎంపీటీసీ, సర్పంచ్ అభ్యర్థులను జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేల సమక్షంలో ఎంపిక చేయనున్నారు. మరోవైపు వర్ధన్నపేట, పాలకుర్తి, భూపాలపల్లి, నర్సంపేట, పరకాల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో బీఆర్‌ఎస్ నేతలు పంచాయతీ, వార్డుల వారీగా సమావేశాలు నిర్వహించి గులాబీ శ్రేణుల్లో జోష్ నింపేలా ప్రచారం చేస్తున్నారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆరు జడ్పీలు బీఆర్‌ఎస్ ఖాతాలోనే ఉన్నాయి. వాటిలో మెజారిటీ జడ్పీ పీఠాలను కైవసం చేసుకోవాలని గులాబీ నేతలు కసరత్తు చేస్తున్నారు. ఇక బీజేపీ సైతం అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టింది. మూడు ప్రధాన పార్టీలు స్థానిక సంస్థల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాయి. మరోవైపు ఆశావహులు గ్రామాల్లో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. సద్దుల బతుకమ్మ, దసరా పండుగల్లో రాజకీయ ఉనికి చాటుకునే దిశగా వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. అయితే ఈ రిజర్వేషన్లు ఉంటాయా..? ఉండవా..? అన్న దానిపై స్పష్టత లేకపోవడం ఆశావహులను ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. ఓ వైపు తాము బరిలో ఉంటామనే సంకేతాలు ఇస్తూనే.. ఖర్చుల విషయంలో చాలామంది వెనుకడుగు వేస్తున్నారు. పోటీదారులు దసరా దావత్‌లకు దూరంగానే ఉంటూ రాజకీయం నడిపినట్లుగా అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.
రిజర్వేషన్ల ఝలక్
పదేళ్ల తరువాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో చాలామంది ద్వితీయ శ్రేణి నేతలు తమ అదృష్టాన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో పరీక్షించుకునేందుకు ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలో రిజర్వేషన్లు ఆశావహుల ఆశలపై నీళ్లు చల్లాయి. ప్రధానంగా జనరల్, బీసీ కోటాలో పాగా వేయాలని ఆశించిన నేతలకు జడ్పీ చైర్మన్ పదవులు మింగుడు పడటం లేదు. ములుగు జిల్లాకు సంబంధించిన ఓ కీలక నేత జడ్పీ చైర్మన్ పదవిపై కన్నేశారు. అయితే అనూహ్యంగా ఎస్టీ మహిళకు ములుగు జడ్పీ పీఠం రిజర్వుడు కావటంతో సదరు నేతలకు ఆశాభంగం కలిగింది. హనుమకొండ జడ్పీ పీఠంపై కూడా కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌సలో కీలక నేతలు కన్నేశారు. అయితే ఎస్పీ మహిళకు హనుమకొండ జడ్పీ పీఠం రిజర్వుడు కావటంతో సదరు నేతలు నిరాశకు గురయ్యారు. వరంగల్, జనగామ జడ్పీ చైర్మన్‌లు కూడా రిజర్వేషన్ కోటాలో పోవటంతో ఎన్నో ఏళ్లుగా ఆశతో ఉన్న నేతలకు రిజర్వేషన్లు ఝలక్ ఇచ్చాయి. ఇలా జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలకు కూడా రిజర్వేషన్లు కలిసి రాకపోవటంతో అనేక మంది ఆశావహులు మానసికంగా కుంగిపోతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ 42శాతం రిజర్వేషన్లపై కొందరు కోర్టును ఆశ్రయించటంతో ఆశావహుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఏదైనా జరిగుతే తమకు అనుకూలంగా రిజర్వేషన్లు మారుతాయనే ఆశతో కొందరు నేతలు ఉన్నారు. మరోవైపు బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ప్రకటించిన క్రమంలో కేవలం భూపాలపల్లి జడ్పీ చైర్మనే బీసీలకు కేటాయించారు. ఆరు జడ్పీల్లో కేవలం ఒక్క స్థానమే కేటాయించారని బీసీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కోర్టు తీర్పుపై ఉత్కంఠ
కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇటీవల జీవో విడుదల చేసింది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీలకు 27శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. వీటికి 42 శాతం బీసీ రిజర్వేషన్లు కలిపితే 69 శాతం రిజర్వేషన్లు అవుతాయి. రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు 50శాతం మించకూడదని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో సోమవారం సుప్రీంకోర్టులో తెలంగాణలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై విచారణ జరుగనుంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో అనే ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత పరిస్థితుల్లో పెంచిన రిజర్వేషన్లకు కోర్టు బ్రేకులు వేస్తే ఎలా అనే చర్చ నడుస్తోంది. తీర్పును మరో తేదీకి వాయిదా వేస్తే.. తుది తీర్పు వచ్చే దాకా ప్రభుత్వం ఎదురుచూడక తప్పదని మరికొందరు పేర్కొంటున్నారు. ఒక వేళ కోర్టులో కేసు పెండింగ్ ఉండగానే ఎన్నికలకు వెళ్తే.. ఆ ఎన్నికలు సైతం కోర్టు రద్దుచేయొచ్చని, మహారాష్ట్రలో ఇలాంటి సంఘటనే జరిగిందని బీజేపీ నేత, ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపై రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. సాంకేతికంగా సాధ్యం కాకుంటే ఇటీవల ఖరారైన రిజర్వేషన్లు మారడం తప్పనిసరిగా కనిపిస్తోందనే ప్రచారం ఉంది. ఒకవేళ ఇదే జరిగితే బీసీలకు మళ్లీ పాత రిజర్వేషన్లే దిక్కయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ పరంగా 42శాతం రిజర్వేషన్లు అమలు చేయవచ్చననే ప్రచారం కూడా జరుగుతోంది. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలపై కోర్టు తీర్పు ప్రభావం ఉండటంతో అందరి దృష్టి సోమవారం సుప్రీంకోర్టు, 8వ తేదీన హైకోర్టు ఇచ్చే తీర్పులపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.